Viral News : చిలుక కోసం పోస్టర్లు.. రూ.50 వేల బహుమతి.. వైరల్ స్టోరీ.!

Viral News :మనుషుల మధ్య బంధాలు, అనురాగాలు రోజురోజుకూ తగ్గిపోతున్న ఈ రోజుల్లో, ఒక పెంపుడు పక్షిపై ఓ కుటుంబం చూపించే ప్రేమ అందరినీ కదిలిస్తోంది.

G Krishna
Published on: 18 July 2026 8:35 PM IST
Missing Pet Parrot
X

Missing Pet Parrot

Viral News : మనుషుల మధ్య బంధాలు, అనురాగాలు రోజురోజుకూ తగ్గిపోతున్న ఈ రోజుల్లో, ఒక పెంపుడు పక్షిపై ఓ కుటుంబం చూపించే ప్రేమ అందరినీ కదిలిస్తోంది. ఆగ్రాకు చెందిన సునీల్ కుమార్ సింగ్ కుటుంబం.. తాము ప్రాణంగా చూసుకునే 'మౌ' అనే పెంపుడు చిలుక అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. తమ ఇంటి మహాలక్ష్మిలా భావించే ఆ చిలుకను ఎలాగైనా వెతికి పట్టుకోవాలని ఆ కుటుంబం పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. ఆ చిలుకను ఎవరైనా కనిపెట్టి, సురక్షితంగా తమకు అప్పగిస్తే ఏకంగా రూ. 50,000 నగదు బహుమతి ఇస్తామని సదరు కుటుంబం ప్రకటించింది. ప్రస్తుతం ఈ చిలుకను వెతికేందుకు ఆగ్రా వీధుల్లో పోస్టర్లు వేయడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ విస్తృతంగా "మిస్సింగ్ మౌ" (Missing Mau) అంటూ గాలింపు చర్యలు చేపట్టారు.

గాయపడిన పక్షి.. ప్రాణ స్నేహితుడిగా మారిన కథ

సునీల్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చిలుకకు, వారి కుటుంబానికి మధ్య ఉన్న బంధం గత ఏడాది ప్రారంభమైంది. 2025 మార్చి 15న స్థానిక మెంటల్ హాస్పిటల్ పరిసరాల్లో వెళ్తుండగా, రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న ఈ చిలుకను వారు గమనించారు. బహుశా చెట్టుపై నుంచి పడిపోవడం వల్ల దాని రెక్కలు దెబ్బతిన్నాయి. జాలితో ఆ పక్షిని దగ్గరకు తీసిన సునీల్ కుటుంబం, వెంటనే దానికి పశువైద్యుడితో చికిత్స చేయించారు. అయితే ఎంత వైద్యం అందించినప్పటికీ ఆ చిలుక రెక్కలు పూర్తిగా కోలుకోలేదు, అది ఎక్కువ దూరం ఎగరలేని స్థితికి చేరుకుంది. అటువంటి స్థితిలో దానిని రోడ్డుపై ఒంటరిగా వదిలేయడానికి మనసు రొప్పని సునీల్ కుటుంబం, ఆ పక్షిని తమ ఇంటికి తెచ్చుకుని 'మౌ' అని పేరు పెట్టి అపురూపంగా చూసుకోవడం ప్రారంభించింది. కొద్దిరోజుల్లోనే అది ఆ ఇంట్లో ఒక మూగ జీవిలా కాకుండా, కుటుంబంలో ఒక ముఖ్య సభ్యుడిగా మారిపోయింది.

పంజరంలో బంధించలేదు.. ఇల్లంతా తిరిగేది..

సాధారణంగా చాలామంది పక్షులను తెచ్చి పంజరాలలో బంధించి పెంచుకుంటారు. కానీ సునీల్ కుటుంబం మౌను ఎప్పుడూ ఒక ఖైదీలా చూడలేదు. దానికి ఎలాంటి పంజరం పెట్టకుండా, ఇల్లంతా స్వేచ్ఛగా తిరిగేలా వదిలేశారు. మౌ కూడా ఆ ఇంటిని తన సొంత సామ్రాజ్యంగా మార్చుకుంది. ఇంట్లోని వారు ఒక రూమ్ నుండి మరో రూమ్‌కు వెళ్తుంటే, వారి వెంటే నడుస్తూనో లేదా చిన్నగా ఎగురుతూనో వెళ్లేది.

అయితే, విధి వశాత్తూ ఈ ఏడాది జూలై 13వ తేదీ సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఆ చిలుక అకస్మాత్తుగా ఆవాస్ వికాస్ కాలనీలోని సెక్టార్ 4 వైపు ఎగిరిపోయింది. దానికి రెక్కలు పూర్తిగా పనిచేయకపోవడం వల్ల ఎక్కువ దూరం వెళ్లలేదని, ఎక్కడో ఒకచోట చిక్కుకుపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మౌను సులభంగా గుర్తుపట్టడానికి వీలుగా.. దాని ముక్కుపై, అలాగే రెక్కలపై ప్రత్యేకమైన నల్లటి మచ్చలు ఉన్నాయని, ఎవరైనా చూస్తే గుర్తుపట్టాలని వారు కోరుతున్నారు.

"మౌ లేని ఇల్లు శ్మశానంలా ఉంది".. కుటుంబ సభ్యుల ఆవేదన

"మౌ మాకు కేవలం ఒక పెంపుడు పక్షి మాత్రమే కాదు, మా కుటుంబంలో ఒక ప్రాణం. అది వెళ్లిపోయినప్పటి నుంచి ఇల్లంతా ఒంటరిగా, వెలితిగా అనిపిస్తోంది" అని సునీల్ కుమార్ సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ చిలుకకు తమపై ఎంత ప్రేమ ఉందంటే.. అది ఇంట్లోని వారి పేర్లను సైతం స్పష్టంగా నేర్చుకుందని, ఇంటికి ఎవరైనా కొత్త అతిథులు వస్తే వారిని పలకరిస్తూ ఎంతో సందడి చేసేదని గుర్తుచేసుకున్నారు.

మరో కుటుంబ సభ్యురాలు మమతా సింగ్ మాట్లాడుతూ.. ఉదయాన్నే పిల్లలు చదువుకునేటప్పుడు మౌ వచ్చి వారి పుస్తకాలపై వాలుతూ, వారిని డిస్టర్బ్ చేస్తూ ముద్దుగా అల్లరి చేసేదని చెప్పారు. దాని కిలకిలరావాలతో ఇల్లంతా ఎంతో హుషారుగా ఉండేదన్నారు. మౌ ఎక్కడైనా కనిపిస్తే లేదా దానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని, చిలుకను క్షేమంగా ఇంటికి చేర్చిన వారికి తాము ప్రకటించిన రూ. 50,000 బహుమతిని సంతోషంగా అందిస్తామని ఆ కుటుంబం చేతులు జోడించి వేడుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ ప్రకటన నెట్టింట వైరల్ కావడం ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story