2027లో కరోనా కంటే దారుణ పరిస్థితులు తప్పవా.? ఎక్స్‌పర్ట్ గట్టి హెచ్చరిక.!
AI Warning: 2027లో మానవాళికి AI పెను ముప్పుగా మారనుందని, పరిస్థితులు కొవిడ్-19 కంటే దారుణంగా ఉంటాయని ఎక్స్‌పర్ట్ నికోలా జుర్కోవిక్ హెచ్చరించారు, కనీసం 2 వారాలకు సరిపడా ఆహారం, నగదు ఉంచుకోవాలని సూచించారు.
2027లో కరోనా కంటే దారుణ పరిస్థితులు తప్పవా.? ఎక్స్‌పర్ట్ గట్టి హెచ్చరిక.!
AI Warning: 2027లో మానవాళికి ఏఐ పెను ముప్పుగా మారనుందని ఎక్స్‌పర్ట్ నికోలా హెచ్చరించారు. పరిస్థితులు కొవిడ్-19 కంటే దారుణంగా మారతాయని, 2030 నాటికి మానవులు ఏఐపై పూర్తి నియంత్రణ కోల్పోతారని అంచనా వేశారు. రాబోయే పదేళ్లలో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుందన్నారు.
ఈ హెచ్చరిక చేసింది METR సంస్థలో టెక్నికల్ స్టాఫ్‌గా పనిచేస్తున్న నికోలా జుర్కోవిక్. థాంక్స్ గివింగ్ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు రాసిన లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది ఊహించని స్థాయిలో సంక్షోభం రావచ్చని అందులో పేర్కొన్నారు.
ప్రజలు కనీసం 2 వారాలకు సరిపడా ఆహారం, నీళ్లు నిల్వ చేసుకోవాలని ఆయన సూచించారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ పనిచేయకపోతే ఇబ్బంది రాకుండా ఇంట్లో నగదు కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కఠినమైన ప్రపంచ నియంత్రణలు లేకపోతే AI తనను తానే మెరుగుపరచుకుని, తెలివైన మనుషులను మించిపోతుందని ఆయన భావిస్తున్నారు. ఈ ఏడాది ఏఐ వ్యవస్థలను ఉపయోగించి పలు కంపెనీలపై హ్యాకింగ్ దాడులు జరిగాయని జుర్కోవిక్ గుర్తు చేశారు.
ఇప్పటివరకు ఎక్కువగా ఆర్థిక నష్టమే జరిగిందని, వచ్చే ఏడాది భారీ ప్రాణనష్టం కూడా సంభవించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. 2027 చివర్లో ప్రజలు సెలవు వేడుకలు చేసుకోలేని పరిస్థితికి 5 నుంచి 20 శాతం అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
2030 చివరి నాటికి మానవాళి నాశనం కావడం లేదా అధికారం కోల్పోవడం అనేది దాదాపు 50 శాతం అవకాశమని కూడా ఆయన చెప్పారు. అయితే ఏఐ అభివృద్ధిపై కఠిన నియంత్రణతోనే ముప్పును నివారించవచ్చన్నారు. ఇంకా కొంత సమయం మిగిలి ఉందని ఆయన అభిప్రాయం.
ఏఐ నియంత్రణ కోల్పోయే ప్రమాదంపై ఇతర సంస్థలు కూడా హెచ్చరికలు చేస్తున్నాయి. అత్యాధునిక AI అభివృద్ధిని సమన్వయంతో తాత్కాలికంగా ఆపాలని ఆంత్రోపిక్ సంస్థ జూన్‌లో ప్రతిపాదించింది. AI స్వయంగా మెరుగుపడే స్థాయికి వస్తే నియంత్రణ కోల్పోయే ముప్పు పెరుగుతుందని ఆ సంస్థ పేర్కొంది.
అయితే ఇలాంటి హెచ్చరికలను అందరూ అంగీకరించడం లేదు. కొందరు నిపుణులు ఇలాంటి ప్రచారాన్ని మార్కెటింగ్ ఎత్తుగడగా కొట్టిపారేశారు. 2027నాటికి సూపర్ ఇంటెలిజెన్స్ వస్తుందని చెప్పిన AI 2027 నివేదిక రచయితలు కూడా తమ అంచనా గడువును తర్వాత పొడిగించారు.




