Road Potholes: రోడ్డు గుంతలకు ఏఐ చెక్: బెంగళూరు ఇంజినీర్ సరికొత్త ఆవిష్కరణ!

Road Potholes: రోడ్డుపై గుంత కనిపించగానే ప్రయాణికులకు తీవ్ర అవస్థలు, వాహనాలకు మరమ్మతులు, అధికారులపై అసహనం గుర్తురావడం సాధారణం.

G Krishna
Published on: 16 Aug 2026 4:30 PM IST
Road Potholes
X

Road Potholes: రోడ్డు గుంతలకు ఏఐ చెక్: బెంగళూరు ఇంజినీర్ సరికొత్త ఆవిష్కరణ!

Road Potholes: రోడ్డుపై గుంత కనిపించగానే ప్రయాణికులకు తీవ్ర అవస్థలు, వాహనాలకు మరమ్మతులు, అధికారులపై అసహనం గుర్తురావడం సాధారణం. అయితే బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గౌరవ్ సేన్ మాత్రం ఈ నిత్య సమస్యకు తన నైపుణ్యంతో అద్భుతమైన సాంకేతిక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డ్యాష్‌కామ్ , ప్రభుత్వ కాంట్రాక్టుల డేటాను ఏకీకృతం చేస్తూ పౌర సమస్యల పరిష్కారంలో విప్లవాత్మక అడుగు వేశారు. ఈ ఆవిష్కరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది.

ఏఐ సాంకేతికతతో గుంతల గుర్తింపు

గౌరవ్ సేన్ తన కారుకు ఒక డ్యాష్‌కామ్, జీపీఎస్ , యాక్సిలెరోమీటర్‌ను అమర్చి ప్రయాణం ప్రారంభించారు. వాహనం వెళ్తున్న సమయంలో డ్యాష్‌కామ్ రికార్డు చేసే దృశ్యాలను ఏఐ విజన్ మోడల్స్ క్షుణ్ణంగా విశ్లేషిస్తాయి. దూరానికి స్పీడ్ బ్రేకర్లలా కనిపించే రోడ్డు గుంతలను కూడా ఈ సిస్టమ్ అత్యంత కచ్చితత్వంతో వేరుచేసి పసిగడుతుంది. ఓపెన్ ఏఐ (OpenAI) సాంకేతికత , కోడెక్స్ ఆధారంగా గౌరవ్ రూపొందించిన అప్లికేషన్ ఈ డేటానంతటినీ సేకరించి లొకేషన్‌తో సహా భద్రపరుస్తుంది.

గుంత మాత్రమే కాదు.. బాధ్యులైన అధికారుల వివరాలు ప్రత్యక్షం

కేవలం రోడ్డుపై గుంతలను గుర్తించడమే కాకుండా, "ఈ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ ఎవరు? మరమ్మతు చేయాల్సిన అధికారి ఎవరు?" అనే ప్రశ్నకు ఈ యాప్ కచ్చితమైన సమాధానం ఇస్తుంది. గౌరవ్ తన అప్లికేషన్‌ను దాదాపు 2,900 ప్రభుత్వ టెండర్ కాంట్రాక్టుల డేటాతో అనుసంధానించారు. దీనివల్ల కారు వెళ్తున్న రోడ్డు ఏ కాంట్రాక్టర్ పరిధిలోకి వస్తుంది, ఆ రోడ్డు ఇంకా గ్యారంటీ వ్యవధిలోనే ఉందా అనే వివరాలను సిస్టమ్ వెలికితీస్తుంది. గుంత చిత్రం, కచ్చితమైన జీపీఎస్ కోఆర్డినేట్స్, టెండర్ నంబర్ , సంబంధిత అధికారి పేరుతో సహా కేవలం నాలుగు సెకన్లలో ఫిర్యాదు లేఖను ఇది సిద్ధం చేస్తుంది.

ఆఫీసు ప్రయాణంలో పరీక్ష.. నెటిజన్ల ప్రశంసలు

తన ఆఫీసు ప్రయాణంలో భాగంగా గౌరవ్ ఈ సిస్టమ్‌ను ప్రత్యక్షంగా పరీక్షించగా, ఒకే మార్గంలో 12 రోడ్డు గుంతలను ఆధారాలతో సహా రికార్డు చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. రోడ్ల నిర్వహణలో పారదర్శకత పెంచడానికి, కాంట్రాక్టర్లు , అధికారులలో జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ప్రభుత్వ పౌర వేదికలు కూడా ఇటువంటి అధునాతన ఏఐ విధానాలను అమలు చేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఒక ఇంజినీర్ తన సొంత ప్రయాణ సమస్య నుంచి ప్రారంభించిన ఈ ఆలోచన, ఇప్పుడు దేశవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానంతో పౌర సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో నిరూపించింది.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.