Free Petrol Offer: సిమ్ మార్చితే లీటర్ పెట్రోల్ ఫ్రీ.. వ్యాపారి క్రేజీ ఆఫర్!
Free Petrol Offer: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఓ ఎయిర్‌టెల్ డిస్ట్రిబ్యూటర్ వినూత్న ఆఫర్ ప్రకటించారు. నెట్‌వర్క్ పోర్టింగ్ చేసుకునే వారికి లీటర్ పెట్రోల్ ఉచితమని తెలపడంతో వాహనదారులు క్యూ కట్టారు.
Free Petrol Offer: సిమ్ మార్చితే లీటర్ పెట్రోల్ ఫ్రీ.. వ్యాపారి క్రేజీ ఆఫర్!
Free Petrol Offer: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కష్టాలు పగ పగ పడుతున్న వేళ, ఓ వ్యాపారి ప్రకటించిన ‘బంపర్ ఆఫర్’ ఇప్పుడు రెండు జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, ‘నో స్టాక్’ బోర్డుల మధ్య వాహనదారులు అల్లాడుతుంటే.. “మా దగ్గరకు రండి.. లీటర్ పెట్రోల్ ఉచితంగా పట్టుకెళ్లండి” అంటూ ఆ వ్యాపారి ఇచ్చిన ఆఫర్ వైరల్ అవుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన రేళ్ల సతీష్ అనే ఎయిర్‌టెల్ డిస్ట్రిబ్యూటర్ తన కొత్త స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వినూత్న ప్రచారానికి తెరలేపారు. ప్రస్తుతం ఉన్న ఏ నెట్‌వర్క్ నుంచైనా సరే ఎయిర్‌టెల్‌లోకి పోర్ట్ (MNP) అయ్యే కస్టమర్లకు లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
లీటర్ ఆయిల్ దొరకడమే గగనంగా మారిన ఈ తరుణంలో, సిమ్ మారిస్తే చాలు ఉచితంగా పెట్రోల్ వస్తుండడంతో వాహనదారులు సదరు స్టోర్ ముందు క్యూ కట్టారు. బంకుల వద్ద గంటల తరబడి వేచి చూసినా దొరకని ఇంధనం ఇక్కడ దొరుకుతుండడంతో జనం ఎగబడుతున్నారు. వ్యాపార పబ్లిసిటీ కోసం సతీష్ ఎంచుకున్న ఈ ‘టైమింగ్’ చూసి నెటిజన్లు “భలే తెలివైన ఆలోచన” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు, ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా ఇంధన సెగ కొనసాగుతూనే ఉంది. డిపోల నుంచి సరఫరా లేదని బంకు యజమానులు, ప్యానిక్ బయ్యింగ్ వద్దని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం జనం పెట్రోల్ కోసం యుద్ధమే చేస్తున్నారు. కొన్ని చోట్ల తోపులాటలు జరుగుతుండడంతో పోలీస్ బందోబస్తు మధ్య ఇంధన పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ‘ఉచిత పెట్రోల్’ ఆఫర్ సామాన్యులకు పెద్ద ఊరటనిస్తోంది.




