Viral Mystery in the Sky: మళ్లీ భూమిపైకి గ్రహాంతర వాసులా? జెల్లీ ఫిష్ UFO వీడియో వైరల్
Viral Mystery in the Sky: అమెరికాలోని అలాస్కా సైనిక స్థావరం సమీపంలో జెల్లీ ఫిష్ ఆకారపు యూఎఫ్ఓ (UFO), మెక్సికోలో డైనోసార్ల కాలం నాటి ప్టెరోడాక్టైల్ (Pterodactyl) ఎగురుతున్నట్లు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Viral Mystery in the Sky: మళ్లీ భూమిపైకి గ్రహాంతర వాసులా? జెల్లీ ఫిష్ UFO వీడియో వైరల్
Viral Mystery in the Sky: సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. అంతరిక్ష రహస్యాలు, గ్రహాంతర వాసులు (Aliens), వింత జీవుల ఆనవాళ్లపై మానవుడికి ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా అమెరికా, మెక్సికో, యూరప్ ప్రాంతాల్లోని ఆకాశంలో అత్యంత వింతైన ఆకారాలు కనిపించాయంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌గా మారాయి. ఒకవైపు జెల్లీ ఫిష్ లాంటి వింత వస్తువు, మరోవైపు డైనోసార్ల కాలంలో జీవించిన ప్టెరోడాక్టైల్ తరహా ఎగిరే జీవి కనిపించాయంటూ నెటిజన్లు షేర్ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. అసలు ఈ వీడియోల వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం!
అలాస్కాలోని అంకరేజ్ ప్రాంతంలో నివసిస్తున్న సారా జేన్ ఓస్బోర్న్ అనే మహిళ ఆకాశంలో కదులుతున్న ఓ నల్లటి వింత ఆకారాన్ని తన కెమెరాలో బంధించారు. చెట్ల వెనుక నుంచి బయటకు వచ్చిన ఆ వస్తువు.. కొద్దిసేపు గాలిలో తేలియాడుతూ కనిపించి, ఆ తర్వాత అకస్మాత్తుగా అదృశ్యమైంది. అది అమెరికా సైనిక స్థావరం వైపు వెళ్తున్నట్లు వీడియోలో కనిపించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దీని తర్వాత మెక్సికోలోని జువారెజ్ ప్రాంతంలోనూ లోహపు ఆకారంతో, పొడవైన తీగల్లాంటి భాగాలు వేలాడుతూ ఆకాశంలో కదులుతున్న మరో వింత వస్తువు వీడియో వైరల్ అయింది. అలాగే మేరీ ఐలాండ్ ప్రాంతంలో ఇలాంటి మూడు వస్తువులు ఒకేసారి కనిపించాయంటూ మరో వీడియో చక్కర్లు కొడుతోంది.
అలాస్కాలో జరిగిన ఈ ఘటనపై అమెరికా సైనిక అధికారులు కూడా స్పందించారు. జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్-రిచర్డ్సన్ ప్రతినిధి ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. 2026 జూన్ 15న తమ సైనిక స్థావరం సమీపంలోని గగనతలంలో వింత వస్తువు కనిపించిందంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో తమ దృష్టికి వచ్చిందని ధృవీకరించారు. అయితే, అందుకు సంబంధించి అదనపు సమాచారం తమ వద్ద లేదని, ఆ వస్తువు ఏమిటన్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదని క్లారిటీ ఇచ్చారు.
ఒకవైపు జెల్లీ ఫిష్ యూఎఫ్ఓల చర్చ నడుస్తుండగానే.. మెక్సికోలో మరో వింత చర్చ మొదలైంది. డైనోసార్ల యుగంలో జీవించి, లక్షల సంవత్సరాల క్రితమే అంతరించిపోయిన ప్టెరోడాక్టైల్ అనే భారీ ఎగిరే జీవి మళ్లీ కనిపించిందంటూ కొందరు నెటిజన్లు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. భారీ రెక్కలతో కూడిన ఓ నల్లటి ఆకారం ఆకాశంలో ఎగురుతున్నట్లు ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది.
ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జైమ్ మౌస్సాన్ సైతం ఈ జీవికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. జువారెజ్ లోయలో చిత్రీకరించిన ఈ వింత జీవి అక్కడ ఏదైనా ‘డైమెన్షనల్ పోర్టల్’ ఉందనే విషయానికి ఆధారమా? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ వీడియోలు నెటిజన్లలో ఎంత ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ, వాటి ఆధారంగా కనిపిస్తున్నది ఏమిటనే విషయాన్ని ఇప్పుడే నిర్ధారించడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీడియోలు చాలా తక్కువ నిడివితో, అస్పష్టంగా ఉండటంతో శాస్త్రీయ నిర్ధారణకు రాలేమని చెబుతున్నారు. గతంలోనూ మెక్సికోలో ఇలాంటి వింత జీవుల గురించి ప్రచారం జరిగిందని, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వీడియోను గుడ్డిగా నమ్మకుండా అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు వేచి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.




