Alumnium: స్వీట్లపై వెండి పూత నిజమేనా.! అల్యూమినియం శరీరంలోకి వెళ్తే ఏమవుతుంది.?

Alumnium: స్వీట్లపై వెండి పూత పేరుతో అల్యూమినియం వాడటం ఆందోళన కలిగిస్తోందని, అధిక మోతాదులో శరీరంలోకి వెళ్తే మెదడు, ఎముకలు, ఊపిరితిత్తులకు హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Ravi
By Ravi
Published on: 18 Nov 2026 6:48 PM IST
Alumnium
X

Alumnium: స్వీట్లపై వెండి పూత నిజమేనా.! అల్యూమినియం శరీరంలోకి వెళ్తే ఏమవుతుంది.?

Alumnium: స్వీట్లపై అల్యూమినియం వాడకం ఆందోళన కలిగిస్తోంది. ఇది తక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్తే మలం/మూత్రం ద్వారా బయటకు వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక మోతాదులో శరీరంలోకి వెళ్లే మెదడు, ఎముకలతో పాటు ఊపిరితిత్తులకు హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించి జ్ఞాపకశక్తి కోల్పోవడం, కండరాల నియంత్రణ తగ్గడంతో పాటు నాడీ సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని అంటున్నారు.

ఈ ఆందోళనకు తాజా నేపథ్యం హైదరాబాద్‌లో జరిగిన పోలీసుల దాడులు. చార్మినార్ ప్రాంతంలో నకిలీ వెండి రేకు తయారు చేస్తున్న నాలుగు యూనిట్లపై కమిషనర్స్ టాస్క్ ఫోర్స్, చార్మినార్ పోలీసులు మంగళవారం దాడులు చేశారు. స్వీట్లు, పాన్ తయారీలో ఉపయోగించే నిజమైన వెండి రేకుకు బదులు అల్యూమినియం రేకులను తయారు చేసి విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ యూనిట్ల నుంచి స్వీట్ షాపులు, బేకరీలు, పాన్ దుకాణాలకు తెలంగాణ అంతటా నకిలీ వర్క్ సరఫరా అయినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దాడుల్లో పోలీసులు 49 కట్టల అల్యూమినియం రేకులు, 10 కిలోల అల్యూమినియం ఫ్లేక్స్‌తో పాటు వెండి పూత పూసిన నకిలీ చక్కెర బంతులు, పాన్ చట్నీ, పొగాకు, మొక్కజొన్న పిండి వంటి ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి అల్యూమినియం ఫ్లేక్స్‌ను తెప్పించి ఉపయోగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ యూనిట్లకు చెల్లుబాటయ్యే FSSAI లైసెన్సులు కూడా లేవని వెల్లడించారు.

ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం తినదగిన వెండి రేకు కనీసం 99.9 శాతం స్వచ్ఛమైన వెండి అయి ఉండాలి. దీనికి జంతు సంబంధిత పదార్థాలు ఎప్పుడూ వాడకూడదు. అల్యూమినియం రేకును వెండి పేరుతో వాడటం ఆహార భద్రతా ప్రమాణాల తీవ్ర ఉల్లంఘన అని పోలీసులు స్పష్టం చేశారు.

ఆహార గ్రేడ్ కాని అల్యూమినియం ఎక్కువకాలం శరీరంలోకి వెళ్తే కిడ్నీలకు నష్టం, నాడీ సంబంధిత సమస్యలు, ఎముకల వ్యాధులు, జీర్ణాశయ చికాకు వంటివి రావొచ్చని పోలీసులు హెచ్చరించారు. అల్యూమినియం శరీరంలో ముఖ్యంగా ఎముకల్లో, కొంతవరకు మెదడులో పేరుకుపోయే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యవంతుల్లో చాలావరకు అల్యూమినియం మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్తుంది. కానీ కిడ్నీ సమస్యలున్నవారు, పిల్లలు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. అల్యూమినియం, మెదడు వ్యాధులైన అల్జీమర్స్ మధ్య సంబంధంపై శాస్త్రవేత్తల్లో ఇంకా ఏకాభిప్రాయం లేదు.

నిజమైన వెండి రేకును గుర్తించడానికి పోలీసులు సాధారణ పరీక్ష సూచించారు. చేతిలో నెమ్మదిగా రుద్దినప్పుడు నిజమైన వెండి రేకు చాలా సన్నని పొడిగా విడిపోతుంది. అల్యూమినియం అయితే చుట్టుకుపోవడం, చిరగడం లేదా చిన్న బంతుల్లా మారడం జరుగుతుంది. అయితే ఇది ప్రాథమిక పరీక్ష మాత్రమే, ఖచ్చితమైన నిర్ధారణ కోసం ల్యాబ్ పరీక్ష అవసరం.

పండుగల సీజన్‌లో స్వీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నకిలీ వర్క్ ముప్పు పెరుగుతుంది. వినియోగదారులు వెండి పూత ఉన్న స్వీట్లను కొనేముందు విశ్వసనీయ దుకాణాల నుంచే తీసుకోవాలని, లైసెన్స్ ఉన్న స్వీట్ షాపులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అనుమానం వస్తే ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయాలి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.