Viral Wedding: ప్రాంక్ కాదు నిజమే.. ముగ్గురిని పెళ్లాడిన వీరుడు

Viral Wedding: ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన రైతు వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 23 July 2026 4:26 PM IST
Viral Wedding
X

Viral Wedding: ప్రాంక్ కాదు నిజమే.. ముగ్గురిని పెళ్లాడిన వీరుడు

Viral Wedding: ఈ రోజుల్లో ఒక్కరితో సంసారాన్ని ఈదడమే గగనంగా భావిస్తున్న రోజుల్లో.. ఒకే వేదికపై ఏకంగా ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడి సోషల్ మీడియాను షేక్ చేశాడో పుణ్యాత్ముడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా ధోరియా గ్రామానికి చెందిన రమేష్ అనే రైతు చేసిన ఈ వింత పెళ్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

వృత్తిరీత్యా రైతు అయిన రమేష్, సరోజ్, సావిత్రి, సంతోష అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లను స్థానిక చాముండా ఆలయ హవన్ వేదిక వద్ద అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాడు. వాళ్ల మెడలో పూలమాలలు వేసి ఏడడుగులు నడవగా.. నవవధువులు ముగ్గురూ భర్త పాదాలకు నమస్కరించారు. ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. మొదట ఇది ఏదో ప్రాంక్ వీడియో అనుకున్నప్పటికీ.. తాము చేసుకున్నది నిజమైన పెళ్లేనంటూ మరో రీల్ ద్వారా ఆ నలుగురూ క్లారిటీ ఇవ్వడంతో నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో పలు వివాదాలు తెరపైకి వచ్చాయి. హసన్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ ఛైర్మన్ కూడా వీడియోలో దంపతులతో కలిసి కనిపిస్తుండటంతో ఆయన హాజరుకావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తమ ఆలయ ప్రాంగణంలో ఎలాంటి వివాహ వేడుక జరగలేదని చాముండా ఆలయ పూజారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. సోషల్ మీడియాలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వివాదం పెద్దదవ్వడంతో ఆ ముగ్గురు సోదరీమణులు, రమేష్ ప్రస్తుతం మీడియా ముందుకు రావడానికి నిరాకరిస్తున్నారు. కాగా, ఇటీవలె ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలు ప్రారంభించిన ఈ సోదరీమణులు కేవలం 27 వీడియోలతోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుని ఓవర్ నైట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారిపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ వైరల్ వివాహంపై ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story