Rare Monkey: 89 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించిన ప్రపంచపు ఏకైక విషపూరిత వానరం.. దీని ప్రత్యేకతలివే!
Bangka Slow Loris: 89 ఏళ్ల తర్వాత ఇండోనేసియాలో కనిపించిన ప్రపంచపు ఏకైక విషపూరిత వానరం 'బంగ్కా స్లో లోరిస్' విశేషాలు మరియు వాటి ఎదుర్కొంటున్న ముప్పు పూర్తి వివరాలు.
Rare Monkey: 89 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించిన ప్రపంచపు ఏకైక విషపూరిత వానరం.. దీని ప్రత్యేకతలివే!
Bangka Slow Loris: ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఆశ్చర్యకరమైన జీవులలో ఒకటైన ‘బంగ్కా స్లో లోరిస్’ (Bangka Slow Loris) అనే విషపూరిత వానరం దాదాపు 89 సంవత్సరాల తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇండోనేసియాలోని బంగ్కా దీవి ప్రాంతంలో ఈ అరుదైన జీవులు జీవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
అంతరించిపోయిందనుకున్న సమయంలో..
ఈ బంగ్కా స్లో లోరిస్ జీవులను చివరిసారిగా శాస్త్రవేత్తలు 1937లో కనుగొన్నారు. ఆ తర్వాత వీటి ఆచూకీ ఎక్కడా లభించకపోవడంతో ఇవి పూర్తిగా అంతరించిపోయి ఉంటాయని అందరూ భావించారు. అయితే, ఇండోనేసియాలోని బంగ్కా, సుమత్రా, బోర్నియా దీవుల్లోని చెట్లపై ఇవి నివసిస్తున్నట్లు తాజాగా తేలింది. రాత్రి సమచయాల్లో సంచరించే (నిశాచర) ఈ జీవుల సగటు పొడవు కేవలం 10 అంగుళాలు మాత్రమే ఉంటుంది.
ప్రపంచంలోనే ఏకైక విషపూరిత వానరం:
వానర జాతి మొత్తంలో ఇదే ఏకైక విషపూరిత జీవి కావడం విశేషం. ఇది తన చేతిపై ఉండే ఒక ప్రత్యేక గ్రంధిని నాకడం ద్వారా విషాన్ని క్రియాశీలం చేసుకుంటుంది. ఈ విషం తగిలితే మనుషుల్లో తీవ్రస్థాయి అలర్జిక్ రియాక్షన్ (అనాఫైలాటిక్ షాక్) వస్తుంది. అంతేకాకుండా, శత్రువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఈ వానరాలు ఆ విషాన్ని తమ శరీరాలకు రాసుకుంటాయి.
ఇంకా తప్పని ముప్పు:
తాజాగా గుర్తించిన వాటిలో అనేక బంగ్కా స్లో లోరిస్‌లు విద్యుత్ తీగల బారినపడి గాయపడ్డాయి. ‘అలోబీ వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సెంటర్’ సిబ్బంది వీటిని రక్షించి, చికిత్స అందించిన తర్వాత తిరిగి అడవుల్లోకి విడిచిపెట్టారు. అక్రమ మైనింగ్, ఆయిల్ పామ్ సాగు కోసం అడవులను నరికేస్తుండటం వల్ల వీటికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ జంతు పరిరక్షణ సంఘం (IUCN) వీటిని ‘రెడ్ లిస్ట్’లో చేర్చింది. వీటిని కాపాడుకోవడానికి ప్రత్యేక రక్షణ చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.




