Viral Video: బెంగళూరు నడిరోడ్డుపై రగడ.. ఆటో డ్రైవర్‌తో యువతుల గొడవ వైరల్.!
బెంగళూరు నగరంలోని HSR లేఅవుట్ 3వ సెక్టార్‌లో సోమవారం మధ్యాహ్నం ఆటో డ్రైవర్, ఇద్దరు యువతుల మధ్య జరిగిన గొడవ తీవ్ర కలకలం రేపింది...
బెంగళూరు నగరంలోని HSR లేఅవుట్ 3వ సెక్టార్‌లో సోమవారం మధ్యాహ్నం ఆటో డ్రైవర్, ఇద్దరు యువతుల మధ్య జరిగిన గొడవ తీవ్ర కలకలం రేపింది. నడిరోడ్డుపై ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్న దృశ్యాలను స్థానికులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు చేతులు చేసుకుంటూ తీవ్రంగా ఘర్షణ పడుతుండగా, పరిస్థితి చేయి దాటుతుండటంతో అక్కడే ఉన్న మరో యువతి జోక్యం చేసుకుని గొడవను సర్దిచెప్పేందుకు ప్రయత్నించింది.
అసలేం జరిగింది.?
ఘటనపై సమాచారం అందుకున్న హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా సదరు యువతులను గుర్తించి, విచారణ నిమిత్తం ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. అయితే, స్టేషన్‌కు వచ్చేందుకు నిరాకరించిన ఆ యువతులు, ఫిర్యాదు చేయడానికి తమకు ఒకటి రెండు రోజుల సమయం కావాలని పోలీసులను కోరారు. మరోవైపు గొడవలో ఉన్న ఆటో డ్రైవర్‌ను కూడా పోలీసులు గుర్తించి విచారించారు. తన ఆటోలో ప్రయాణించిన ఆ యువతులు ఛార్జీల చెల్లింపు విషయంలో గొడవకు దిగినట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.
మద్యం మత్తులో దాడి చేశారు.. ఆటో డ్రైవర్ ఆరోపణలు
సదరు యువతులు తీవ్ర మద్యం మత్తులో ఉన్నారని, ఆటో ఛార్జీ ఇవ్వడానికి నిరాకరిస్తూ తనను తీవ్రపదజాలంతో బూతులు తిట్టారని ఆటో డ్రైవర్ ఆరోపించాడు. అంతేకాకుండా, మొదట ఆ యువతులే తనపై భౌతిక దాడికి దిగారని, ఆత్మరక్షణ కోసమే తాను ఎదురుదాడి చేయాల్సి వచ్చిందని అతడు విచారణలో పేర్కొన్నాడు. ఇన్‌స్టాగ్రామ్ సహా ఇతర నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో వైరల్ కావడంతో, ఇటువంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, యువతుల నుంచి అధికారికంగా రాతపూర్వక ఫిర్యాదు అందితే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.




