Viral News : కేఫ్ బిల్లులో బాడీ షేమింగ్.. సోషల్ మీడియాలో రచ్చ..
Viral News : ప్రముఖ ఐటీ హబ్ అయిన బెంగళూరు నగరంలో ఒక కేఫ్‌కు వెళ్లిన కస్టమర్‌కు తీవ్ర మనస్తాపం కలిగించే ఘటనా ఒకటి వెలుగులోకి వచ్చింది.
customer bill controversy
Viral News : ప్రముఖ ఐటీ హబ్ అయిన బెంగళూరు నగరంలో ఒక కేఫ్‌కు వెళ్లిన కస్టమర్‌కు తీవ్ర మనస్తాపం కలిగించే ఘటనా ఒకటి వెలుగులోకి వచ్చింది. రెస్టారెంట్‌లో ఆర్డర్ ఇచ్చి బిల్లు చూసుకున్న ఆ వ్యక్తికి, తన పేరు ఉండాల్సిన చోట రూపాన్ని విమర్శిస్తూ రాసిన వ్యాఖ్యలు కనిపించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. బాడీ షేమింగ్‌కు గురైన ఆ బాధితుడు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకోవడంతో, ఆ కేఫ్ యాజమాన్యంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
పేరుకు బదులు 'లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్'
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఉన్న 'సబ్‌కో ది క్రాఫ్టరీ' (Subko The Craftery) అనే కేఫ్‌కు అతను వెళ్లాడు. అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి, దానికి సంబంధించిన బిల్లు చెల్లించిన తర్వాత రసీదును పరిశీలించాడు. ఆ బిల్లులో కస్టమర్ వివరాలు (Customer Details) ఉండే ప్రదేశంలో అతని పేరుకు బదులుగా "లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్" (పొట్టిగా, లావుగా ఉండి నల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి) అని రాసి ఉంది.
ఒక కస్టమర్‌ను గుర్తించడానికి పేరు లేదా టేబుల్ నంబర్ లేదా ఆర్డర్ వివరాలు ఉపయోగించాలి కానీ, ఇలా ఒక మనిషి శారీరక రూపాన్ని బట్టి హేళన చేస్తూ లేబుల్ వేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం పురుషుడు కాబట్టి ఇలాంటి బాడీ షేమింగ్‌ను జోక్‌గా కొట్టిపారేయలేమని, ఇది తనను తీవ్రంగా కలచివేసిందని రెడ్డిట్ (Reddit) వేదికగా బిల్లు స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తంచేశాడు.
సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్.. దిగొచ్చిన కేఫ్ యాజమాన్యం
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కస్టమర్ల పట్ల కేఫ్ సిబ్బంది ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వివాదం పెద్దది కావడంతో 'సబ్‌కో కాఫీ రోస్టర్స్' యాజమాన్యం ఇన్స్టాగ్రామ్ వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పింది.
"కొన్ని తప్పులను నిశ్శబ్దంగా సరిదిద్దవచ్చు. కానీ మరికొన్నింటిని బహిరంగంగానే సరిదిద్దాలి, ఎందుకంటే నిశ్శబ్దంగా ఉండటమే ఇలాంటి సంస్కృతికి కారణమవుతుంది. ఏ రూపంలో ఉన్నా బాడీ షేమింగ్ చేయడం ముమ్మాటికీ తప్పే. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు" అని కేఫ్ యాజమాన్యం తమ ప్రకటనలో పేర్కొంది. బాధితుడికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతూ, తమ అంతర్గత ఫిర్యాదుల కమిటీని (ICC) సంప్రదించాలని కోరింది. అయితే కేఫ్ యాజమాన్యం తప్పును ఒప్పుకున్నప్పటికీ, ఒక కస్టమర్ శరీర రూపాన్ని ఆధారంగా చేసుకుని వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదని, ఇలాంటి ప్రవర్తనను ఎంతమాత్రం సహించకూడదని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.




