Viral News: మా పిల్లి గర్భానికి మీ పిల్లే కారణం.. పోలీసుల దాకా వెళ్లిన 'పిల్లి' గొడవ..!
Viral News: బెంగళూరులోని శేషాద్రిపురంలో రెండు కుటుంబాల మధ్య పిల్లి ప్రెగ్నెన్సీ వివాదం పోలీసుల వరకు వెళ్ళింది.
Viral News: మా పిల్లి గర్భానికి మీ పిల్లే కారణం.. పోలీసుల దాకా వెళ్లిన 'పిల్లి' గొడవ..!
Viral News: సాధారణంగా ఇరుగుపొరుగు వారి మధ్య గొడవలు ఆస్తుల కోసమో, చిన్నపాటి తగాదాల కోసమో జరుగుతుంటాయి. కానీ బెంగళూరులోని శేషాద్రిపురంలో జరిగిన ఈ గొడవ మాత్రం చాలా వెరైటీ. తన పిల్లి గర్భం దాల్చడానికి పక్కింటి పిల్లే కారణమంటూ ఓ యజమాని ఏకంగా పోలీసులను ఆశ్రయించారు.
శేషాద్రిపురానికి చెందిన రెండు కుటుంబాలు పిల్లులను పెంచుకుంటున్నాయి. అందులో ఒకటి ఆడ పిల్లి కాగా, మరొకటి మగ పిల్లి. ఇటీవలే ఆ ఆడ పిల్లి నాలుగు కూనలకు జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లి యజమాని సంతోషపడాల్సింది పోయి, పక్కింటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "మా పిల్లి తల్లి కావడానికి మీ పిల్లే కారణం.. కాబట్టి ఈ నాలుగు పిల్లి పిల్లలను మీరే పెంచుకోవాలి" అంటూ పక్కింటి వారితో గొడవకు దిగారు.
ఈ గొడవ కాస్తా ముదిరి పరస్పర దూషణల దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఆడ పిల్లి యజమాని అసహనంతో ఆ పిల్లి కూనలను పక్కింటి వారి ఇంటి ముందు పడేశారు. గొడవ పెద్దదై యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపులకు దిగడంతో, మగ పిల్లి యజమాని 112 నంబర్‌కు డయల్ చేసి పోలీసులను పిలిచారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న శేషాద్రిపురం పోలీసులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి వింత కేసును డీల్ చేయడం పోలీసులకు కూడా కొత్తే. చివరకు ఒక ఒప్పందం కుదిర్చారు. పుట్టిన నాలుగు పిల్లి కూనలను.. చెరో రెండు చొప్పున పెంచుకోవాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది.




