Viral News: వైద్యం.. వాచ్‌మన్‌తో: వైరల్ అవుతున్న ఆపరేషన్ థియేటర్ వీడియో..!
Viral News: బిహార్‌లో ఘోరం.. ఆపరేషన్ థియేటర్‌లో రోగులకు సెక్యూరిటీ గార్డు కుట్లు వేస్తున్న వీడియో వైరల్. వైద్యులు లేకపోవడంతో కాపలాదారే డాక్టరయ్యాడు.
Viral News: వైద్యం.. వాచ్‌మన్‌తో: వైరల్ అవుతున్న ఆపరేషన్ థియేటర్ వీడియో..!
Viral News: దేశంలో వైద్య వ్యవస్థ దుస్థితికి ఈ ఘటనే నిదర్శనం. ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రిలో, ఆపరేషన్ థియేటర్ టేబుల్ మీద పడుకున్న రోగికి ఒక సెక్యూరిటీ గార్డు కుట్లు వేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లా బగాహా పట్టణంలోని సబ్ డివిజనల్ ప్రభుత్వాసుపత్రిలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది.
బగాహా సమీపంలో టెంపో, వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరికి తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో వెంటనే ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో, ఆసుపత్రిలో కాపలా ఉండే సెక్యూరిటీ గార్డు డాక్టర్ అవతారమెత్తి రోగికి కుట్లు వేశాడు.
ఈ ఘటనపై ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ తివారీ స్పందిస్తూ విచిత్రమైన వివరణ ఇచ్చారు. ఆసుపత్రిలో దీర్ఘకాలంగా సిబ్బంది కొరత ఉందని, ప్రమాదం జరిగిన రోజు ఒక్కసారిగా రోగులు రావడంతో ఒత్తిడి పెరిగిందని తెలిపారు. వైద్యుడి పర్యవేక్షణలోనే సెక్యూరిటీ గార్డు సహాయం తీసుకున్నారని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
అయితే గాయపడిన వ్యాన్ డ్రైవర్ వాసీమ్ అక్తర్, మరో బాధితుడు సురేందర్ పైసీ మాత్రం తమకు సెక్యూరిటీ గార్డే కుట్లు వేశాడని ధృవీకరించారు. బిహార్ వైద్య శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని గతంలో 'కాగ్' (CAG) నివేదికలు హెచ్చరించినప్పటికీ, ఇలా సెక్యూరిటీ గార్డులతో వైద్యం చేయించడం గమనార్హం.




