Viral: అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ప్లంబర్.. స్క్రీన్‌పై కనిపించిన నెంబర్ చూడగా..

Viral: బీహార్‌కు చెందిన ఒక సామాన్య ప్లంబర్ బ్యాంక్ ఖాతాలో అకస్మాత్తుగా వందలు, వేలు కాదు.. ఏకంగా రూ. 294 కోట్లు జమయ్యాయి.

Ravi
By Ravi
Published on: 6 Jun 2026 11:45 AM IST
Viral
X

Viral: అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ప్లంబర్.. స్క్రీన్‌పై కనిపించిన నెంబర్ చూడగా..

Viral: సాధారణంగా మన బ్యాంక్ అకౌంట్‌లో ఎవరైనా ఓ పది వేలు అదనంగా వేస్తేనే ఎంతో ఆశ్చర్యపోతాం. అలాంటిది అకౌంట్‌లో కేవలం వంద రూపాయల చిల్లర ఉన్న ఒక సామాన్యుడికి, రాత్రికి రాత్రే ఏకంగా వందల కోట్లు జమైతే ఆ షాక్ మామూలుగా ఉండదు. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన షాకింగ్ సంఘటనే బీహార్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన వికాస్ కుమార్ అనే వ్యక్తి వృత్తిరీత్యా ప్లంబర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి జియో పేమెంట్స్ బ్యాంక్‌లో ఒక అకౌంట్ ఉంది. బుధవారం నాటికి అందులో కేవలం రూ. 113 బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అయితే, గురువారం ఉదయం(జూన్ 4, 2026న) తన అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న వికాస్ కుమార్‌కు ఊహించని షాక్ తగిలింది. అకౌంట్‌లో బ్యాలెన్స్ అమాంతం రూ. 94 కోట్లకు పెరిగిపోయింది.

మొదట ఇదేదో బ్యాంకు సర్వర్లలో తలెత్తిన చిన్న టెక్నికల్ ఇష్యూ అయ్యుంటుందని, కాసేపట్లో మళ్లీ మామూలు బ్యాలెన్స్ చూపిస్తుందని వికాస్ భావించాడు. కానీ, ఆ బ్యాలెన్స్ తగ్గకపోగా సాయంత్రం అయ్యేసరికి ఏకంగా రూ. 294 కోట్లకు చేరుకుంది. ఆ రాత్రి గడిచి, మరుసటి రోజు ఉదయం చెక్ చేసినా అకౌంట్‌లో అదే స్థాయిలో బ్యాలెన్స్ ఉండటంతో వికాస్ కుమార్‌కు భయం పట్టుకుంది.

వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తమైన వికాస్.. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు, బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వందల కోట్ల రూపాయల లావాదేవీలు ఒక సామాన్య ప్లంబర్ అకౌంట్‌లో ఎలా జరిగాయో చూసి బ్యాంకు సిబ్బంది సైతం అవాక్కయ్యారు. ఇది కేవలం బ్యాంకు సర్వర్లలో జరిగిన ఒక సాంకేతిక లోపమా? లేక ఏవైనా సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు ఈ అకౌంట్‌ను బినామీగా వాడుకుని ఏదైనా భారీ ఫ్రాడ్‌కు లేదా మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారా? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గురించి విన్న నెటిజన్లు "రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవ్వడం అంటే ఇదేనేమో!" అంటూ ఆన్‌లైన్‌లో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story