Bisleri ఇలా ఉందంటే మరి Belsri సంగతేంటి? కల్తీ బ్రాండ్లపై నెటిజన్ల ఆందోళన
Bisleri: బిస్లరీ నీరు సేఫ్ కాదన్న FSSAI చర్యతో, పేరు పోలిన కల్తీ బ్రాండ్లపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Bisleri ఇలా ఉందంటే మరి Belsri సంగతేంటి? కల్తీ బ్రాండ్లపై నెటిజన్ల ఆందోళన
Bisleri: బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సేఫ్ కాదని FSSAI వెల్లడించిన నేపథ్యంలో కల్తీ బ్రాండ్ల గురించి చర్చ జరుగుతోంది. ఇంటర్నేషనల్ బ్రాండే అలా ఉందంటే దాన్ని పోలిన పేర్లతో వచ్చే కల్తీ బ్రాండ్ల పరిస్థితి ఏంటని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే, బస్ స్టేషన్లలో Bilseri, Belsri, Bislleri, Bislri, Bilsiri, Bisileri పేరుతో బాటిళ్లు అమ్ముతారని, వాటిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆదివారం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా FSSAI, బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది.
ఈ వ్యవహారం గత ఏడాది సెప్టెంబర్ 30న మొదలైంది. గోవాలోని బిస్లరీ ప్లాంట్ నుంచి అదే నెల తయారైన బ్యాచ్‌కు చెందిన 6 నమూనాలను FSSAI సేకరించింది. ల్యాబ్ పరీక్షల్లో ఆహార భద్రత చట్టం, 2006 ప్రకారం అసురక్షిత ఆహారానికి సంబంధించిన ఉల్లంఘనలు తేలాయని FSSAI పేర్కొంది. అయితే సోమవారం స్పందించిన బిస్లరీ, తమ తాగునీరు సురక్షితమేనని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈమెయిల్ ద్వారా గానీ, హార్డ్ కాపీ రూపంలో గానీ ఎలాంటి నోటీసు అందలేదని తెలిపింది. అదే నమూనాను మరో FSSAI ఆమోదిత ల్యాబ్‌లో పరీక్షించగా బ్రోమేట్ పరిమితిలోనే ఉందని, ఆ ఫలితాలను ఫిబ్రవరి 2, 2026న FSSAI పశ్చిమ ప్రాంతీయ కార్యాలయానికి పంపినట్లు వెల్లడించింది. దర్యాప్తుకు సహకరిస్తామని కూడా చెప్పింది.
ఇది ఒక్క బిస్లరీకే పరిమితం కాదు. అన్ని ప్రధాన ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ల నమూనాలను FSSAI సేకరించిందని, నిబంధనలు పాటించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని సమాచారం. దేశంలో ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్లో బిస్లరీ వాటా సుమారు 33%గా ఉంది. కల్తీ బాటిళ్ల సమస్య కొత్తది కాదు. 2019లోనే బిస్లరీ స్వయంగా Belsri, Bilseri, Brislei వంటి నకిలీ బాటిళ్ల ఫోటోను పోస్ట్ చేసి, ప్రతి వాటర్ బాటిల్ బిస్లరీ కాదని వినియోగదారులను హెచ్చరించింది.
ఇటీవల ఢిల్లీలోని షకూర్పూర్లో నకిలీ బిస్లరీ బాటిళ్ల తయారీ ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. నకిలీ లేబుళ్లు, క్యాప్‌లు, బార్కోడ్లతో బాటిళ్లు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. బోరు నీటిని అక్రమంగా వాడినట్లు కూడా వెల్లడించారు. ప్యాకేజ్డ్ వాటర్ కొనేటప్పుడు బ్రాండ్ స్పెల్లింగ్, BIS మార్క్, సీల్ చూసుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నారు.




