Blinkit Delivery Boy Salary: బ్లింకిట్ డెలివ‌రీ బాయ్ నెల‌కు ఎంత సంపాదిస్తారో తెలుసా.?

Blinkit Delivery Boy Salary: చండీగఢ్‌కు చెందిన ఓ బ్లింకిట్ డెలివరీ పార్ట్‌నర్ తన తొలి నెలలోనే రూ.39 వేలు సంపాదించినట్లు రెడ్డిట్‌లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Mokshith
Published on: 26 Nov 2026 4:32 PM IST
Blinkit Delivery Boy Salary
X

Blinkit Delivery Boy Salary: బ్లింకిట్ డెలివ‌రీ బాయ్ నెల‌కు ఎంత సంపాదిస్తారో తెలుసా.?

Blinkit Delivery Boy Salary: క్విక్ కామర్స్ సంస్థలు నిమిషాల్లోనే ఇంటికి సరుకులు డెలివరీ చేస్తున్నాయి. మనం ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే వస్తువులను తీసుకొచ్చే డెలివరీ బాయ్స్ నెలకు ఎంత సంపాదిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? తాజాగా చండీగఢ్‌కు చెందిన ఓ బ్లింకిట్ డెలివరీ పార్ట్‌నర్ తన తొలి నెల ఆదాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించడంతో వైర‌ల్‌గా మారింది.

తొలి నెలలోనే రూ.39 వేల సంపాదన

చండీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తి క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్‌లో డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తున్నాడు. తన ఉద్యోగంలో మొదటి నెలలోనే సుమారు రూ.39 వేల ఆదాయం సంపాదించినట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని రెడ్డిట్‌లో పోస్టు చేస్తూ తన అనుభవాలను పంచుకున్నాడు. మొదటి నెల ఉద్యోగం తనకు మంచి అనుభవాన్ని ఇచ్చిందని తెలిపాడు. ఇప్పటివరకు పెద్దగా ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని పేర్కొన్నాడు. అతని సంపాదన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

రోజుకు 12 గంటలు.. వీకెండ్స్‌లో 16 గంటలు

ఈ ఆదాయం సంపాదించడానికి తాను ఎంత సమయం పనిచేస్తున్నాడో కూడా డెలివరీ పార్ట్‌నర్ వివరించాడు. సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 12 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పాడు. వారాంతాల్లో కస్టమర్ల నుంచి ఆర్డర్లు ఎక్కువగా రావడంతో పని సమయం 16 గంటల వరకు ఉంటుందని వెల్లడించాడు. అంటే నెలకు రూ.39 వేల ఆదాయం సంపాదించాలంటే ఎక్కువ సమయం రోడ్లపైనే గడపాల్సి వస్తోంది. ఆర్డర్ల సంఖ్య, పని గంటలు ఆదాయంపై ప్రభావం చూపుతున్నట్లు అతని అనుభవం తెలియజేస్తోంది.

ఎలక్ట్రిక్ బైక్ ఉంటే మరింత సౌకర్యం

డెలివరీ ఉద్యోగం చేయాలనుకునే వారికి ఆ వ్యక్తి కొన్ని సూచనలు కూడా చేశాడు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసుకోవాలని సలహా ఇచ్చాడు. దీనివల్ల పెట్రోల్ ఖర్చు తగ్గడంతో పాటు ఎక్కువ దూరం ప్రయాణించడానికి సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. చండీగఢ్ వంటి అభివృద్ధి చెందిన నగరాల్లో ఈ పని చేయడం కొంత సులభమని తెలిపాడు. అక్కడ ఆర్థికంగా స్థితిమంతులైన కస్టమర్లు ఉండటంతో అప్పుడప్పుడు మంచి టిప్స్ కూడా లభిస్తున్నాయని పేర్కొన్నాడు.

శారీరక శ్రమ ఎక్కువ.. అందరికీ సరిపోని ఉద్యోగం

డెలివరీ ఉద్యోగంలో ఆదాయం బాగానే ఉన్నప్పటికీ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుందని ఆ వ్యక్తి తెలిపాడు. రోజుకు 12 గంటలు, వారాంతాల్లో 16 గంటల వరకు పనిచేయాల్సి రావడం అంత సులభం కాదని తెలిపాడు. ఎక్కువసేపు బైక్‌పై ప్రయాణించడం, వరుసగా ఆర్డర్లు డెలివరీ చేయడం వల్ల అలసట వచ్చే అవకాశం ఉందని వివరించాడు. ముఖ్యంగా ఎక్కువ శారీరక శ్రమ చేయలేని వారు ఈ ఉద్యోగంలో చేరే ముందు ఆలోచించాలని సూచించాడు.

మొత్తంగా చూస్తే.. బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ సంస్థల్లో డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తే మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉందని ఈ వ్యక్తి అనుభవం చెబుతోంది. అయితే రూ.39 వేల సంపాదన అందరికీ వస్తుందని చెప్పలేం. నగరం, ఆర్డర్ల సంఖ్య, పని గంటలు, టిప్స్ ఆధారంగా ఆదాయం మారుతుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.