Dogs: కుక్కలకు రంగులన్నీ కనిపిస్తాయా.? సైన్స్ ఏం చెబుతోందంటే..!
Dogs: కుక్కలకు ప్రపంచం మొత్తం కేవలం నలుపు, తెలుపు రంగుల్లోనే కనిపిస్తుందని చాలామంది నమ్ముతుంటారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని సైన్స్ చెబుతోంది.
Dogs: కుక్కలకు రంగులన్నీ కనిపిస్తాయా.? సైన్స్ ఏం చెబుతోందంటే..!
Dogs: కుక్కలను పెంచుకునేవారికి ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. మనం చూస్తున్న ఈ అందమైన రంగుల ప్రపంచాన్ని మన పెంపుడు కుక్కలు చూడగలవా.? చాలామంది కుక్కలకు కేవలం నలుపు, తెలుపు రంగులు మాత్రమే కనిపిస్తాయని అనుకుంటారు. కానీ సైన్స్ ప్రకారం, కుక్కలు పూర్తిగా కలర్ బ్లైండ్ కాదు.. అవి కొన్ని రంగులను స్పష్టంగా చూడగలవు.
సాధారణంగా కళ్లలో రంగులను గుర్తించడానికి 'కోన్స్' అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. మనుషుల కళ్లలో మూడు రకాల కోన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఎరుపు, ఆకుపచ్చ, నీలం, వాటి కలయికతో ఏర్పడే అనేక రంగులను చూడగలం. కానీ, కుక్కల కళ్లలో కేవలం రెండు రకాల కోన్స్ మాత్రమే ఉంటాయి. దీనిని శాస్త్రీయ పరిభాషలో 'డైక్రోమాటిక్ విజన్' అంటారు.
కుక్కలు ఏయే రంగులను చూడగలవు?
కళ్లలో రెండు రకాల కోన్స్ మాత్రమే ఉండటం వల్ల కుక్కలు ప్రధానంగా నీలం, పసుపు రంగులను మాత్రమే అత్యంత స్పష్టంగా గుర్తించగలవు. మనుషులకు స్పష్టంగా కనిపించే ఎరుపు, ఆకుపచ్చ రంగుల మధ్య వ్యత్యాసాన్ని కుక్కలు అస్సలు గుర్తించలేవు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు వాటి కంటికి ముదురు బూడిద రంగు లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి.
బంతిని వెతకడంలో ఎందుకు ఇబ్బంది పడతాయంటే?
పచ్చటి గడ్డిలో ఎరుపు రంగు బంతిని వేస్తే, కుక్కలకు ఆ గడ్డి, బంతి రెండు కూడా బూడిద రంగులోనే కనిపిస్తాయి. కాబట్టి అవి ఆ బంతిని కంటి చూపుతో కాకుండా, కేవలం వాసన పసిగట్టడం ద్వారానే ఎక్కువగా కనిపెడతాయి. అందుకే కుక్కలకు ఆడుకునే బొమ్మలు కొనేటప్పుడు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగువి కాకుండా, నీలం లేదా పసుపు రంగులో ఉండే వాటిని కొంటే అవి సులభంగా కంటితో గుర్తించి ఆనందంగా ఆడుకుంటాయి.




