ఓయో రూమ్‌కు వెళ్లినప్పుడు పోలీసులు వస్తే.. ఇలా చేయండి.! చట్టం చెప్పేది ఇదే
OYO rooms: ఓయో రూమ్స్‌లో పెళ్లికాని జంటలు స్టే చేయడం నేరమా.? హోటల్స్‌పై పోలీసులు దాడులు చేస్తే చట్టబద్ధంగా జంటలకు ఉన్న హక్కులు ఏంటి.?
ఓయో రూమ్‌కు వెళ్లినప్పుడు పోలీసులు వస్తే.. ఇలా చేయండి.! చట్టం చెప్పేది ఇదే
OYO rooms: ప్రస్తుత రోజుల్లో పెళ్లి కాని యువతీ యువకులు ఏకాంతంగా గడపడానికి లేదా వేరే ఊరు వెళ్లినప్పుడు బస చేయడానికి హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా ఓయో లాంటి సంస్థలు కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్ పేరుతో వీరికి సులభంగా రూమ్స్ అందిస్తున్నాయి. అయితే, ఇలాంటి రూమ్స్‌పై అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో పెళ్లికాని జంటలు భయాందోళనలకు గురవుతుంటారు. అసలు రూమ్స్‌పై దాడి చేసే అధికారం పోలీసులకు ఉందా? చట్టం ఏం చెబుతోంది?
చట్టపరంగా చూస్తే.. ఇద్దరు మేజర్లు(18 ఏళ్లు నిండిన యువతి, 21 ఏళ్లు నిండిన యువకుడు) పరస్పర అంగీకారంతో ఒక హోటల్ గదిలో కలిసి ఉండటం దేశంలో ఏమాత్రం నేరం కాదు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 ప్రకారం ఎవరైనా తమకు నచ్చిన విధంగా ప్రశాంతంగా జీవించే హక్కు ఉంది. పెళ్లికాని జంటలు హోటల్‌లో బస చేయకూడదని ఏ చట్టంలోనూ రాయలేదు.
పోలీసులు ఎందుకు దాడులు చేస్తారు?
హోటల్ గదిలో ఉన్న జంటలను ఇబ్బంది పెట్టాలన్నది పోలీసుల ఉద్దేశం కాదు. కొన్ని హోటళ్లలో వ్యభిచారం, డ్రగ్స్ వాడకం లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పక్కా సమాచారం వచ్చినప్పుడు లేదా ఏదైనా క్రైమ్‌కు సంబంధించి విచారణలో భాగంగా మాత్రమే పోలీసులు దాడులు చేస్తారు.
దాడి జరిగినప్పుడు ఏం చేయాలి? జంటలకున్న హక్కులు ఏంటి?
ఒకవేళ మీరు ఉన్న ఓయో హోటల్‌పై పోలీసులు రైడ్ చేస్తే ఏమాత్రం భయపడకండి, కంగారుపడి పారిపోవడానికి ప్రయత్నించకండి. పోలీసులు మిమ్మల్ని విచారించినప్పుడు, మీ వయసును నిర్ధారించే సరైన గుర్తింపు కార్డులు చూపించాలి. మీరిద్దరూ మేజర్లని, పరస్పర అంగీకారంతోనే గదిలో ఉన్నామని పోలీసులకు స్పష్టంగా చెప్పాలి.
పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి లేదా అకారణంగా కేసు నమోదు చేయడానికి చట్టం అంగీకరించదు. ఒకవేళ పోలీసులు మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, లంచం అడిగినా, లేదా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెబుతామని బెదిరించినా.. ఆ చర్యలు పూర్తిగా చట్టవ్యతిరేకం. అలాంటి సమయంలో మీరు న్యాయవాది సహాయం కోరవచ్చు లేదా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
అయితే, ఓయో లాంటి హోటల్స్ బుక్ చేసుకునే ముందు అది సురక్షితమైన ప్రాంతంలో ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే హోటల్ నిబంధనలు, లోకల్ ఐడీ అనుమతి ఉందో లేదో సరిచూసుకుని వెళ్లడం ఎల్లప్పుడూ సురక్షితం.




