Viral Job Notification: గొర్రెలు కాస్తే నెలకు రూ.1.10 లక్షల జీతం.. ఫ్రీగా ఇల్లు, సరుకులు.. ఎగబడ్డ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు!

Viral Job Notification: చైనాలో ఉద్యోగాల కరవుకు ఈ ఘటనే నిదర్శనం. మంగోలియా సరిహద్దులో రూ.1.10 లక్షల జీతంతో గొర్రెల కాపరి ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇస్తే.. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు, వైట్ కాలర్ ఐటీ ఉద్యోగులు క్యూ కట్టారు.

Arun Chilukuri
Published on: 28 May 2026 5:30 PM IST
Viral Job Notification
X

Viral Job Notification: గొర్రెలు కాస్తే నెలకు రూ.1.10 లక్షల జీతం.. ఫ్రీగా ఇల్లు, సరుకులు.. ఎగబడ్డ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు!

Viral Job Notification: చైనాలోని జాబ్ మార్కెట్ ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉందో చాటిచెప్పే ఒక విచిత్రమైన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగోలియాకు దక్షిణాన ఉన్న అత్యంత మారుమూల, కఠినమైన గడ్డి మైదానాలలో గొర్రెలు కాయడానికి ఇద్దరు కాపరులు కావాలంటూ చైనాకు చెందిన ఫార్మ్ హౌస్ యజమాని 'జువో జియావోయాంగ్' ఇచ్చిన ఒక చిన్న ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియాను షేక్ చేసింది.

ఆయన పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘వీబో’ (Weibo) లో ఈ యాడ్ ఏకంగా 5.9 కోట్ల వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. కేవలం రెండు ఖాళీల కోసం ఏకంగా 700 మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం చూసి యజమాని జువో షాకయ్యాడు. దరఖాస్తు చేసిన వారిలో షాంఘై, చోంగ్‌కింగ్ వంటి మెట్రో నగరాల్లో పనిచేసే వైట్ కాలర్ (ఐటీ/కార్పొరేట్) ఉద్యోగులతో పాటు ఫ్యాక్టరీ కార్మికులు, యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత ఉండటం గమనార్హం.

ఇంత క్రేజ్ ఎందుకు?

ఈ గొర్రెల కాపరి ఉద్యోగానికి ప్రకటించిన నెల జీతం అక్షరాలా రూ. 1,10,000 (భారత కరెన్సీలో). ఇది చైనాలోని ప్రైవేట్ కంపెనీల సగటు జీతం (రూ. 70 వేలు) కంటే చాలా ఎక్కువ. ఈ జీతంతో పాటు సదరు గొర్రెల కాపరికి ఉచిత వసతి (Free Accommodation), ఉచిత నిత్యావసర సరుకులు (Free Groceries) కూడా యజమాని అందిస్తాడు.

"నా ప్రకటన ఇంత వైరల్ అవుతుందని అస్సలు అనుకోలేదు. దరఖాస్తు చేసుకున్న వారిలో 10 శాతం మంది ఇప్పుడే యూనివర్సిటీ చదువు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మరికొందరు నగరాల్లో అప్పుల్లో కూరుకుపోయి, ఈ జీతంతో వాటిని తీర్చుకుందామని వచ్చారు. ఇది చైనా యువత ఎదుర్కొంటున్న ఆర్థిక, ఉద్యోగ సంక్షోభానికి అద్దం పడుతోంది."

— జువో జియావోయాంగ్, ఫార్మ్ యజమాని

జీతం భారీగా ఉన్నప్పటికీ ఈ పని చేయడం సాధారణ విషయం కాదని యజమాని ముందే హెచ్చరించాడు. వేసవి కాలంలో దాదాపు 4,900 ఎకరాల సువిశాల మైదానంలో 3,000 గొర్రెలను ఒంటరిగా మేపాల్సి ఉంటుంది. శీతాకాలంలో వాతావరణం -30 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది. అంతటి తీవ్రమైన చలిలో గొర్రెల శాలలను క్లీన్ చేస్తూ అక్కడే గడపాలి. ఏడాది పొడవునా చుట్టుపక్కల ఎలాంటి మనుషులూ కనిపించరు. పూర్తిగా ఒంటరితనాన్ని భరించాలి.

ఈ కఠిన నిబంధనలన్నీ ప్రకటనలోనే స్పష్టంగా పేర్కొనడంతో.. నగరాల్లో ఏసీ గదుల్లో పనిచేసే వైట్ కాలర్ యువత లేదా డిగ్రీ చదివిన వారు ఈ ఒంటరితనాన్ని, చలిని తట్టుకోలేరని యజమాని భావించాడు. అందుకే దరఖాస్తు చేసుకున్న 700 మందిలో నుంచి.. గతంలో వ్యవసాయం, పశుపోషణలో అనుభవం ఉండి, 1980ల కాలంలో పుట్టి కాస్త పరిణతి చెందిన రెండు జంటలను (మొత్తం నలుగురిని) ఈ ఉద్యోగానికి ఎంపిక చేశాడు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story