Gold Spot: కోకా-కోలా నుంచి 90s కిడ్స్‌కు స్వీట్ సర్‌ప్రైజ్.. నిజంగానే 26 ఏళ్ల తర్వాత తిరిగొస్తోందా?
Gold Spot: 1993లో పార్లే నుంచి కొని 2000లో ఫాంటా కోసం పక్కనపెట్టిన 'గోల్డ్ స్పాట్'ను కోకా-కోలా 26 ఏళ్ల తర్వాత లో-షుగర్ లేదా నో-షుగర్ వెర్షన్‌లో మార్కెట్‌లోకి తేనుందని, నాటి క్రేజ్‌ను వాడుకుని డిమాండ్ పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.
Gold Spot: కోకా-కోలా నుంచి 90s కిడ్స్‌కు స్వీట్ సర్‌ప్రైజ్.. నిజంగానే 26 ఏళ్ల తర్వాత తిరిగొస్తోందా?
Gold Spot: ఒకప్పుడు ఎంతో మందికి స్వీట్ మెమొరీగా నిలిచిన 'గోల్డ్ స్పాట్'ను కోకా-కోలా మళ్లీ మార్కెట్‌లోకి తేనున్నట్లు సమాచారం. ఈసారి లో-షుగర్ లేదా నో-షుగర్ వెర్షన్‌లో రీలాంచ్ చేయాలని భావిస్తోందట. 1993లో పార్లే నుంచి ఈ గోల్డ్ స్పాట్‌ను కొన్న కోకా-కోలా 2000లో ఫాంటాను ప్రమోట్ చేసేందుకు దీనిని పక్కనపెట్టింది. ఇప్పుడు 26ఏళ్ల తర్వాత మార్కెట్‌లో డిమాండ్ పెంచుకునేందుకు అప్పటి క్రేజ్‌ను వాడుకోవాలని ప్లాన్ చేస్తోంది.
గోల్డ్ స్పాట్ ఒక ఆరెంజ్ ఫ్లేవర్ కార్బొనేటెడ్ శీతల పానీయం. పార్లే ప్రొడక్ట్స్ దీన్ని 1952లో ప్రవేశపెట్టింది. పార్లే విజయవంతమైన 'గోల్డ్ స్టార్' పెప్పర్‌మింట్ పేరుతో దీనికి నామకరణం చేశారు. ఈ డ్రింక్ పిల్లల్లో బాగా ప్రాచుర్యం పొందింది. 'ద జింగ్ థింగ్' అనే ట్యాగ్‌లైన్‌తో దీన్ని ప్రచారం చేశారు. కుటుంబ విభజనలో భాగంగా ఈ బ్రాండ్ పార్లే బిస్లరీ చేతికి వచ్చింది.
ఆర్థిక సరళీకరణ తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన కోకా-కోలా 1993లో రమేశ్ చౌహాన్ నేతృత్వంలోని పార్లే బిస్లరీ నుంచి గోల్డ్ స్పాట్, థమ్స్ అప్, లిమ్కా, మాజా, సిట్రాలను సుమారు 40 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. వీటిలో థమ్స్ అప్, లిమ్కా కంపెనీ పోర్ట్‌ఫోలియోలో కొనసాగాయి. కానీ ఆరెంజ్ ఫ్లేవర్ విభాగంలో కోకా-కోలా సొంత బ్రాండ్ ఫాంటాతో నేరుగా పోటీ పడటంతో, గోల్డ్ స్పాట్ 2000 నాటికి మార్కెట్ నుంచి కనిపించకుండా పోయింది.
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం గోల్డ్ స్పాట్ ఇప్పుడు లో-షుగర్ లేదా నో-షుగర్ డ్రింక్‌గా తిరిగొస్తుంది. అందువల్ల ఫాంటా అమ్మకాలకు ఇది అడ్డం పడదని ఓ అధికారి చెప్పారు. కంపెనీ ఇప్పటికే కోకా-కోలా, స్ప్రైట్, థమ్స్ అప్ బ్రాండ్లలో జీరో లేదా నో-షుగర్ వెర్షన్లు అమ్ముతోంది. ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ వల్ల తక్కువ చక్కెర పానీయాలకు డిమాండ్ పెరుగుతోంది. రిపోర్టుల ప్రకారం ఈ డ్రింక్ ఈ నెల 23 నుంచి మార్కెట్‌లోకి రావచ్చు.
ఈ బ్రాండ్ తిరిగి రావడానికి మార్కెట్ పరిస్థితులు కూడా కారణం. రిలయన్స్ 2023లో క్యాంపా కోలాను తిరిగి ప్రవేశపెట్టి విజయం సాధించింది. అలాగే లాహోరీ జీరా వంటి దేశీయ బ్రాండ్ల నుంచి పోటీ పెరిగింది. ఈ ధోరణిని ఉపయోగించుకుని 90ల తరం పిల్లల జ్ఞాపకాలను, కొత్త తరం ఆరోగ్య అవసరాలను కలిపి గోల్డ్ స్పాట్‌ను విక్రయించాలని కోకా-కోలా భావిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. అయితే పాత బ్రాండ్లు మళ్లీ మార్కెట్ వాటా పొందాలంటే డిస్ట్రిబ్యూషన్, ఉత్పత్తి నాణ్యత, మార్కెటింగ్‌పై తగినంత పెట్టుబడి అవసరమని ఓ ఎగ్జిక్యూటివ్ అన్నారు. కోకా-కోలా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.




