Viral Video: గుండెపోటు అనుకుని సీపీఆర్.. ఆస్పత్రికి వెళ్లాక షాకింగ్ ట్విస్ట్!

Viral Video: గుండెపోటు అనుకుని తప్పుడు పద్ధతిలో CPR చేయడంతో ఉపాధ్యాయురాలి పక్కటెముకలు విరిగిన షాకింగ్ ఘటన. సోషల్ మీడియాలో వీడియో వైరల్.

Arun Chilukuri
Published on: 1 Aug 2026 11:14 AM IST
Viral Video
X

Viral Video: గుండెపోటు అనుకుని సీపీఆర్.. ఆస్పత్రికి వెళ్లాక షాకింగ్ ట్విస్ట్!

Viral Video: ఆపదలో ఉన్న ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఆత్రుత.. కానీ అనుభవరాహిత్యం, పొరపాటు అంచనా కలగలిసి ఊహించని నష్టాన్ని మిగిల్చాయి! రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన ఒక ఉపాధ్యాయురాలికి గుండెపోటు వచ్చిందనుకుని ఇద్దరు యువకులు చేసిన CPR ఆమెకు తీవ్ర గాయాలయ్యేలా చేసింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని కైలారస్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.

బాధితురాలు లలిత వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. తీవ్రమైన ఎండ వేడిమి కారణంగా ఆమె స్కూటీపై వెళ్తుండగా ఒక్కసారిగా తలతిరిగి కిందపడిపోయారు. క్షణాల్లో అక్కడికి చేరుకున్న ఇద్దరు యువకులు, ఆమెకు గుండెపోటు వచ్చిందని భావించి ఆలస్యం చేయకుండా వెంటనే CPR చేయడం ప్రారంభించారు. అయితే, ప్రాణాలు కాపాడాలనే కంగారులో సరైన పద్ధతి తెలియకుండానే పదేపదే ఆమె ఛాతీపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.

కొంతసేపటి తర్వాత ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెకు ఎలాంటి గుండెపోటు రాలేదని, కేవలం ఎండ దెబ్బ, నీరసం వల్లే స్పృహ కోల్పోయారని స్పష్టం చేశారు. అయితే, ఎక్స్-రే నివేదికలను చూసిన వైద్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సరిగ్గా తెలియకుండా, అధిక ఒత్తిడితో CPR చేయడం వల్ల లలిత ఛాతీకి సంబంధించిన రెండు పక్కటెముకలు (Ribs) విరిగిపోయినట్లు నిర్ధారించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు CPR అత్యంత కీలకమైన ప్రాథమిక చికిత్స అయినప్పటికీ, దానిని సరైన శిక్షణ, అవగాహనతో చేయడం అంతే ముఖ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన అవగాహన లేకుండా చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ప్రాణాలు తీసే లేదా కొత్త ఆరోగా్య సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని ఈ సంఘటన గుర్తుచేస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story