Dalit Worker Attack : మానవత్వం చచ్చిపోయిందా.? నీళ్లు తాగాడని దళితుడిపై దాడి..
Dalit Worker Attack : ఆధునిక సమాజంలో సాంకేతికత ఎంతగా దూసుకుపోతున్నా, కొన్ని ప్రాంతాల్లో కుల వివక్ష, అంటరానితనం లాంటి అమానుషాలు ఇంకా
Dalit-Worker-Attack
Dalit Worker Attack : ఆధునిక సమాజంలో సాంకేతికత ఎంతగా దూసుకుపోతున్నా, కొన్ని ప్రాంతాల్లో కుల వివక్ష, అంటరానితనం లాంటి అమానుషాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహి జిల్లాలో మానవత్వాన్ని సిగ్గుచేటు చేసే ఒక ఘోర ఉదంతం వెలుగుచూసింది. ఒక ప్రైవేట్ క్లినిక్ వెలుపల ఉంచిన పాత్ర నుండి నీరు తాగాడనే ఒకే ఒక్క కారణంతో, దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక రోజువారీ కూలీపై అమానుషంగా దాడి చేసి, ప్రాణాలతో చెలగాటమాడారు.
అనారోగ్యంతో నీళ్లు అడిగితే..
బాధితుడైన భోలా గౌతమ్ అనే వ్యక్తి పెయింటింగ్ పనులు ముగించుకుని తన తోటి కూలీ ఓం ప్రకాష్‌తో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో అతనికి తీవ్రమైన తలనొప్పి రావడంతో, మందుల కోసం దారిలో ఉన్న ఒక ప్రైవేట్ క్లినిక్ వద్ద ఆగాడు. అక్కడ మందులు వేసుకోవడానికి తాగునీరు కావాలని అడగడంతో, క్లినిక్ వెలుపల ఉంచిన కుండ నుండి నీరు తీసుకోవాలని అక్కడి వారు చెప్పారు.
కులం పేరుతో దూషణలు, కర్రలతో దాడి
బాధితుడు ఆ పాత్రలోని నీటిని తాగుతుండగా, పక్కనే దుకాణం నడుపుతున్న సుభాష్ బింద్ అనే వ్యక్తి ఒక్కసారిగా అక్కడికి వచ్చి కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించాడు. "తక్కువ కులం" వ్యక్తివి అయ్యి ఉండి ఈ పాత్రలోని నీటిని ఎలా తాగుతావంటూ, ఆ నీరు అపవిత్రం (మైల) అయిపోయిందని గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా, పక్కనే ఉన్న ఒక కర్రను తీసుకుని భోలా గౌతమ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా కొట్టడమే కాకుండా, ప్రాణాలతో విడిచిపెట్టనంటూ ఘోరంగా బెదిరించాడు.
12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స
అక్కడే ఉన్న తోటి కూలీ , చుట్టుపక్కల వారు స్పందించి నిందితుడి బారి నుండి భోలాను రక్షించారు. ఈ దాడిలో బాధితుడి తల, పొట్ట, వెన్ను , కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా మారడంతో అతడిని మొదట జిల్లా ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం వారణాసిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఏకంగా 12 రోజుల పాటు మృత్యువుతో పోరాడి, చికిత్స పొంది కోలుకున్నాడు.
పోలీసుల చర్య
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, బాధితుడు జూలై 5న పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎస్సీ/ఎస్టీ (SC/ST) అట్రాసిటీ చట్టంతో పాటు పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ శుభమ్ అగర్వాల్ స్పందిస్తూ, దాడికి పాల్పడిన ముఖ్య నిందితుడు సుభాష్ బింద్‌తో పాటు మరొకరిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, ఇంకా కులం పేరుతో తోటి మనిషిని కనీసం నీళ్లు కూడా తాగనివ్వకుండా కొట్టడం అత్యంత దారుణమైన విషయం. చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి వివక్షాపూరిత ఆలోచనలు మారకపోవడం సమాజానికి ఒక మాయని మచ్చ. ఇలాంటి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట పడుతుంది.




