Delhi Fire : మంటల్లో చిక్కుకున్న బామ్మ.. ప్రాణాలకు తెగించి రక్షించిన ఫైర్ సిబ్బంది.!
Delhi Fire : దేశ రాజధాని ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు..
Delhi Fire
Delhi Fire : దేశ రాజధాని ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. ఆ వేడికి అక్కడే ఉన్న మూడు కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలడంతో చుట్టుపక్కల జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మంటలు చాలా వేగంగా బిల్డింగ్ మొత్తం వ్యాపించినా.. ఫైర్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి, బిల్డింగ్ రెండో అంతస్తులో చిక్కుకుపోయిన ఒక ముసలమ్మను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
తెల్లవారుజామునే చెలరేగిన మంటలు
కల్కాజీ ఏరియాలోని గోవింద్‌పురి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న 'పంజాబీ తడ్కా' రెస్టారెంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:45 గంటల సమయంలో రెస్టారెంట్ నుండి పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావడాన్ని గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మొదట ఆరు ఫైర్ ఇంజన్లను పంపించినప్పటికీ, మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో దీనిని పెద్ద ప్రమాదంగా గుర్తించి, మరికొన్ని ఫైర్ ఫైటింగ్ వాహనాలను రప్పించారు. బేస్‌మెంట్ నుండి మొదలైన మంటలు గ్రౌండ్ ఫ్లోర్, ఆపై మూడు అంతస్తులకూ పాకాయి. చివరికి బిల్డింగ్ పైన తాత్కాలికంగా వేసిన షెడ్డు కూడా పూర్తిగా కాలిబూడిదైంది.
సిలిండర్ల పేలుళ్లతో కలకలం
మంటలు రెస్టారెంట్ అంతటా వ్యాపించడంతో లోపల ఉన్న మూడు పెద్ద కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. ఈ పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా కలకలం రేగింది. చుట్టుపక్కల ఉన్న ఇళ్ల జనాలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.
బామ్మ కోసం సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్
ఈ బిల్డింగ్‌కు బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పైన మూడు అంతస్తులు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ రెండో అంతస్తులో సీతాదేవి అనే 75 ఏళ్ల వృద్ధురాలు చిక్కుకుపోయారు. చుట్టూ దట్టమైన పొగ, మంటలు ముసురుకుంటున్న వేళ.. ఫైర్ సిబ్బంది ఏమాత్రం వెనకడుగు వేయకుండా బిల్డింగ్‌లోకి దూసుకెళ్లారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టి, ఆ బామ్మను ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
అదుపులోకి వచ్చిన మంటలు
మంటలను ఆర్పడానికి మొత్తం తొమ్మిది ఫైర్ ఫైటింగ్ వాహనాలను రంగంలోకి దించారు. ఇందులో వాటర్ టెండర్లతో పాటు వాటర్ బ్రౌజర్, శ్వాస తీసుకోవడానికి సపోర్ట్ ఇచ్చే బ్రీతింగ్ యూనిట్ వాహనాలను ఉపయోగించారు. ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి మొత్తానికి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ కూలింగ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




