Diwali: దీపావళికి క్రాకర్స్ కాలుస్తున్నారా? జాగ్రత్త.. వైద్యుల సలహా ఇదే.!

Diwali: భారత్‌లో క్రాకర్స్ శబ్దానికి చట్టబద్ధమైన పరిమితి 125 డెసిబెల్స్ అయినా, ఆ స్థాయి కూడా సురక్షితం కాదని, పిల్లలు, పెద్దలు, జంతువులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Ravi
By Ravi
Published on: 6 Nov 2026 8:30 PM IST
Diwali
X

Diwali: దీపావళికి క్రాకర్స్ కాలుస్తున్నారా? జాగ్రత్త.. వైద్యుల సలహా ఇదే.!

Diwali: దీపావళి వచ్చిందంటే పల్లెల నుంచి సిటీల వరకు క్రాకర్స్ మోతలు కామన్. ఇండియాలో క్రాకర్స్ కాల్చేందుకు లీగల్‌గా 125 డెసిబెల్స్ శబ్దం వరకు అనుమతి ఉంటుంది. ఇది కూడా సేఫ్ లిమిట్ కాదు. ప్రొడక్ట్స్ తయారీకి విధించిన నిబంధన మాత్రమే. ఆ లిమిట్‌లో కాల్చినా, అంతకుమించినా మన చెవులకు ఎలాంటి గ్యారంటీ ఉండదని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, పెద్దలతో పాటు జంతువులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ పరిమితి గురించి ఇంకాస్త వివరంగా చూద్దాం. పర్యావరణ నిబంధనల ప్రకారం, బాణసంచా పేల్చే చోటు నుంచి 4 మీటర్ల దూరంలో కొలిచినప్పుడు శబ్దం 125 dB(AI) లేదా 145 dB(C) పీక్‌కు మించితే ఆ క్రాకర్ల తయారీ, అమ్మకం, వాడకం నిషేధం. ఈ నిబంధన 1999 నాటి నోటిఫికేషన్‌తో మొదలైంది. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో బలపడింది. సైలెన్స్ జోన్లలో క్రాకర్స్ కాల్చడంపై కూడా నిషేధం ఉంది.

అయితే ఈ 125 డెసిబెల్స్ అంకె క్రాకర్ల కోసం పెట్టిన ప్రత్యేక పరీక్ష ప్రమాణం. అది తక్కువ క్షణం పాటు వచ్చే ఆకస్మిక శబ్దాన్ని, నిర్ణీత దూరం నుంచి కొలిచేది. అంటే సాధారణ పరిసరాల శబ్ద పరిమితి కంటే చాలా ఎక్కువ శబ్దం చట్టబద్ధంగానే రావచ్చు. అంతమాత్రాన అది హానికరం కాదని అర్థం కాదు. చెవికి దగ్గరగా పేలిన ఒక్క పెద్ద శబ్దం కూడా శాశ్వత వినికిడి లోపానికి కారణం కావచ్చని అమెరికాలోని CDC హెచ్చరిస్తోంది.

ఆచరణలో నిబంధనలు ఎంతవరకు అమలవుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. గతంలో మహారాష్ట్రలో చేసిన పరీక్షల్లో పలు క్రాకర్లు నిర్ణీత పరిమితిని మించినట్లు తేలింది. ఒక నివేదికలో ఆరు నమూనాల్లో మూడు పరిమితి దాటాయి. వాటిలో అత్యధికంగా 132.4 డెసిబెల్స్ నమోదైంది. ఈ పరిమితి మరీ ఎక్కువని, ఇది కూడా ఆరోగ్యానికి హానికరమని నిపుణులు గతం నుంచీ చెబుతున్నారు.

ఈ ఏడాది ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా దృష్టి పెట్టింది. దీపావళి సమయంలో కొన్ని క్రాకర్లకు ప్రస్తుత శబ్ద పరిమితుల నుంచి పరిమిత మినహాయింపు ఇవ్వవచ్చా అని కాలుష్య నియంత్రణ సంస్థను కోర్టు ప్రశ్నించింది. అంతేకానీ, ఎక్కువ శబ్దం చేసే క్రాకర్లకు కోర్టు అనుమతి ఇచ్చినట్లు కాదు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గత దీపావళికి సర్టిఫై చేసిన గ్రీన్ క్రాకర్లను మాత్రమే, నిర్ణీత సమయాల్లో కాల్చడానికి అనుమతించారు.

ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. క్రాకర్లను చెవులకు దగ్గరగా కాల్చకూడదు. పిల్లలను పెద్దల పర్యవేక్షణలోనే కాల్చనివ్వాలి. చెవుల్లో రింగింగ్ శబ్దం, నొప్పి లేదా వినికిడి తగ్గినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పెంపుడు జంతువులు, వీధి జంతువులు భయపడి గాయపడే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఇంట్లో సురక్షితంగా ఉంచడం, క్రాకర్ల శబ్దం తక్కువగా ఉండే ప్రదేశం ఏర్పాటు చేయడం మంచిది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.