Paan: భోజనం తర్వాత పాన్ తింటున్నారా? వైద్యులు చెబుతున్న హెచ్చరిక ఇదే

Paan: భోజనం తర్వాత పాన్ తింటే జాగ్రత్త. వక్క, సున్నం, పొగాకు కలిసిన పాన్లు హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Ravi
By Ravi
Published on: 25 Nov 2026 8:18 PM IST
Paan
X

Paan: భోజనం తర్వాత పాన్ తింటున్నారా? వైద్యులు చెబుతున్న హెచ్చరిక ఇదే

Pann: భోజనం చేశాక డైజెషన్ కోసం పాన్ తినేవారు అందులోని కంటెంట్‌తో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. హైషుగర్ ఉండే స్వీట్ పాన్ సహా వక్క, సున్నం, పొగాకు కలిసే ఇతర పాన్‌లు ఆరోగ్యానికి హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి రోజూ తినకూడదని, ఆ స్థానంలో రోజుకు 1-2 ప్లెయిన్ తమలపాకులు తీసుకోవడం మేలని అంటున్నారు. ఒకవేళ చిగుళ్లు, గొంతుకు ఇరిటేషన్‌గా ఉంటే దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.

భోజనం తర్వాత పాన్ తినడం మన దేశంలో పాత సంప్రదాయం. ఆయుర్వేదంలో తమలపాకును జీర్ణక్రియను ప్రేరేపించే ఆకుగా వర్ణించారు. దీన్ని నమిలినప్పుడు లాలాజలం ఎక్కువగా ఊరి, నోటిలోనే జీర్ణక్రియ మొదలవుతుంది. సోంపు, యాలకులు, లవంగాలు వంటివి కడుపుబ్బరం, అజీర్ణం తగ్గించడంలో సహాయపడతాయి. అయితే సమస్య తమలపాకుతో కాదు, దానితో కలిపే పదార్థాలతోనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

తమలపాకు, వక్క వేర్వేరని గుర్తుంచుకోవాలి. వక్క తాటి జాతి చెట్టు విత్తనం. ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ పరిశోధన విభాగం (IARC) 2003లో వక్కను మనుషులకు క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది. పొగాకు కలిపినా, కలపకపోయినా వక్క, తమలపాకు కలిపిన పాన్ ముప్పు తెస్తుందని చెబుతారు. పొగాకు పాన్‌లో నోరు, గొంతు, అన్నవాహిక క్యాన్సర్ల ముప్పు మరింత ఎక్కువ. పొగాకు లేకపోయినా వక్కను తరచూ నమిలితే నోరు తెరవడం కష్టమయ్యే ఓరల్ సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఇది క్యాన్సర్‌కు ముందు దశగా భావిస్తారు.

స్వీట్ పాన్ సురక్షితమని చాలామంది అనుకుంటారు. కానీ చాలా స్వీట్ పాన్లలో కూడా వక్క ఉంటుంది. అందులోని తీపి, చక్కెర డయాబెటిస్ ఉన్నవారికి సమస్యగా మారుతుంది. సున్నం కాలక్రమేణా పళ్లపై ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది, చిగుళ్ల సమస్యలు, పళ్లపై మరకలు కూడా వస్తాయి. అందుకే భోజనం తర్వాత పాన్ తినాలనిపిస్తే వక్క, సున్నం, పొగాకు లేకుండా సాదా తమలపాకు లేదా సోంపు, యాలకులతో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. తిన్న తర్వాత నోటిని నీటితో పుక్కిలించాలి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.