Viral Story : ఉద్యోగిని 10 నిమిషాలు ముందే వెళ్లింది.. సీఈఓ రియాక్షన్ వైరల్.!
Viral Story : కార్పొరేట్ ఉద్యోగాల్లో ఉండే పని ఒత్తిడి, ప్రశాంతత లేని వాతావరణం, ప్రతి చిన్న విషయాన్నీ అతిగా పర్యవేక్షించే మైక్రోమేనేజ్‌మెంట్
Reddit Viral
Viral Story : కార్పొరేట్ ఉద్యోగాల్లో ఉండే పని ఒత్తిడి, ప్రశాంతత లేని వాతావరణం, ప్రతి చిన్న విషయాన్నీ అతిగా పర్యవేక్షించే మైక్రోమేనేజ్‌మెంట్ (Micromanagement) సంస్కృతిపై సోషల్ మీడియాలో నిరంతరం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇటీవల ఒక కంపెనీలో ఫుల్ టైమ్ హెచ్‌ఆర్ (HR) విభాగంలో చేరిన ఒక జెన్-జీ (Gen-Z) యువతికి ఎదురైన అనుభవం ఇప్పుడు నెటిజన్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పని ముగిసే సమయానికంటే కేవలం 10 నిమిషాలు త్వరగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్లినందుకు, ఏకంగా కంపెనీ సీఈఓ నేరుగా ఆమె వాట్సాప్‌కే సందేశం పంపి నిలదీశారు.
వాట్సాప్ సందేశం.. రెడ్డిట్‌లో వైరల్ అయిన ఉదంతం
సదరు ఉద్యోగిని ఇటీవల ఒక కంపెనీలో పూర్తిస్థాయి ఉద్యోగంలో చేరారు. కార్పొరేట్ జీవితం తాననుకున్న దానికంటే చాలా భిన్నంగా, అత్యంత కఠినంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరోజు సాధారణ పనివేళలు ముగిసే సమయానికంటే కేవలం 10 నిమిషాల ముందుగా, అంటే సాయంత్రం 5:43 గంటలకు ఆమె ఆఫీస్ నుంచి బయలుదేరారు. అంతలోనే ఆ కంపెనీ సీఈఓ నుంచి "ఈ రోజు నువ్వు ఏ సమయానికి ఆఫీస్ వదిలి వెళ్లావు?" అని వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. దానికి ఆమె 5:43 గంటలకే బయలుదేరానని బదులిచ్చారు. సదరు వాట్సాప్ సంభాషణల స్క్రీన్‌షాట్‌ను రెడ్డిట్‌లోని 'r/IndianWorkplace' ఫోరమ్‌లో షేర్ చేస్తూ తన నిరసనను వ్యక్తం చేశారు.
రీయింబర్స్‌మెంట్ల ఆలస్యం.. కానీ..
ఈ సంఘటన వల్ల తాను తీవ్ర అసహనానికి గురయ్యానని సదరు ఉద్యోగిని తెలిపారు. కంపెనీ పని కోసం తాను సొంతంగా ఖర్చు చేసిన సొమ్మును తిరిగి ఇచ్చే (Reimbursement) విషయంలో, ఎన్నిసార్లు గుర్తుచేసినా కంపెనీ 17 రోజుల పాటు ఆలస్యం చేసిందని ఆరోపించారు. తమ హక్కులు, రీయింబర్స్‌మెంట్ల విషయంలో తీవ్ర అలసత్వం వహించే యాజమాన్యం, సమయం విషయంలో మాత్రం ఇలా నిమిషాల లెక్కలు తీయడంపై మండిపడ్డారు.
మైక్రోమేనేజ్‌మెంట్, ఉచిత ఇంటర్న్‌షిప్‌ల ఒత్తిడి
ఆఫీసులోని మిగిలిన మేనేజర్లు గంటల తరబడి బ్రేక్‌లు తీసుకుంటారని, ఇతర ఉద్యోగులు ఎలాంటి అభ్యంతరం లేకుండా 30 నిమిషాల పాటు బయట గడుపుతుంటారని ఆమె పేర్కొన్నారు. తాను రోజూ సరిగ్గా బ్రేకులు కూడా తీసుకోకుండా పనిచేస్తానని, అలాంటిది ఒక్కరోజు 10 నిమిషాలు త్వరగా వెళ్లినందుకే సీఈఓ నేరుగా రంగంలోకి దిగి ప్రశ్నించడం ఏమాత్రం సమంజసం కాదని వాపోయారు. అంతేకాకుండా, రూపాయి కూడా జీతం లేదా స్టైపెండ్ ఇవ్వకుండా ఒక సోషల్ మీడియా ఇంటర్న్‌ను నియమించాలని, ఒకవేళ అలా చేయకపోతే కంపెనీ సోషల్ మీడియా రీల్స్ అన్నీ తనతోనే బలవంతంగా చేయిస్తామని తనపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారని ఆమె బయటపెట్టారు.
విషసంస్కృతిపై విరుచుకుపడుతున్న నెటిజన్లు
ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఉద్యోగులు చేసే పని నాణ్యత , అవుట్‌పుట్‌ను పట్టించుకోకుండా, కేవలం వేళలు, నిమిషాల లెక్కలపై మాత్రమే దృష్టి పెట్టే కంపెనీలు ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని అందించలేవని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఒక సీఈఓ స్థాయిలో ఉన్న వ్యక్తి 10 నిమిషాల సమయం కోసం స్వయంగా మెసేజ్ చేయడం సమర్థవంతమైన నాయకత్వ లక్షణం కాదని, అది కేవలం ఆధిపత్య ధోరణి , అతిగా పర్యవేక్షించే మైక్రోమేనేజ్‌మెంట్ విధానానికి నిదర్శనమని విమర్శించారు. సదరు యువతికి కొంత అనుభవం రాగానే వెంటనే ఆ ఉద్యోగాన్ని వదిలేసి, ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చే వేరే మంచి కంపెనీకి మారాలని నెటిజన్లు సలహా ఇచ్చారు.




