భార్యకు తెలియకుండా పెట్టుబడులు, అప్పులు చేసి భర్త చనిపోతే ఏం జరుగుతుంది.? పూర్తి వివరాలు..

Financial Advice: కుటుంబ పెద్ద అనుకోకుండా మరణిస్తే, ఆయన చేసిన పెట్టుబడులు, ఆస్తుల గురించి భార్యకు తెలియకపోతే ఏమవుతుంది.?

Ravi
By Ravi
Published on: 7 Jun 2026 6:17 PM IST
Financial Advice
X

భార్యకు తెలియకుండా పెట్టుబడులు, అప్పులు చేసి భర్త చనిపోతే ఏం జరుగుతుంది.? పూర్తి వివరాలు..

Financial Advice: ఒక కుటుంబంలో భర్త మాత్రమే సంపాదిస్తూ, తన ఆర్థిక విషయాలు, పెట్టుబడులు, అప్పుల గురించి భార్యకు ఏమాత్రం చెప్పకుండా రహస్యంగా ఉంచడం చాలా ఇళ్లలో చూస్తుంటాం. అయితే, కుటుంబ పెద్ద అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం ఎంతటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో, అలాగే చేసిన ఆస్తులు, పెట్టుబడులు ఎలా వృధా అవుతాయో ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు వివరించారు. ప్రతి భార్యాభర్తలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన కీలకమైన ఆర్థిక సూత్రాలు ఆయన మాటల్లోనే..

కుటుంబ సభ్యులకు(వారసులకు) తెలియకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల జరిగే అతిపెద్ద నష్టం ఏమిటంటే.! ప్రస్తుతం మన దేశంలోని బ్యాంకులు, ఎల్ఐసీ పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్‌లో వారసులు క్లెయిమ్ చేసుకోని సొమ్ము ఏకంగా రూ. 1.54 లక్షల కోట్లు ఉందని వెల్లడించారు. ఈ డబ్బు ఎవరికి చెందాలో తెలియక అనాథగా మిగిలిపోయింది. దీనికి ప్రధాన కారణం.. ఆస్తులు కూడబెట్టిన వ్యక్తి, ఆ వివరాలను తన కుటుంబ సభ్యులకు చెప్పకపోవడమే!

'ఉద్గమ్' పోర్టల్:

ఇలా క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లను కనుగొనడంలో కుటుంబాలకు సహాయపడటానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ సంయుక్తంగా 'ఉద్గమ్' అనే పోర్టల్‌ను ప్రారంభించాయి. ఇది దాదాపు 30 బ్యాంకులతో అనుసంధానమై ఉంది. అయితే, దీని ద్వారా ఆ నిధులను విజయవంతంగా పొందాలంటే.. బ్యాంక్ అకౌంట్లకు అప్‌డేట్ చేసిన ఫోన్ నంబర్లు, ఈమెయిల్, పాన్ కార్డ్, నామినీ వివరాలు కచ్చితంగా ఉండాలి.

భార్యాభర్తల మధ్య ఆర్థిక పారదర్శకత తప్పనిసరి:

ఫైనాన్షియల్ ఫైల్: భార్యాభర్తలు ఇద్దరూ తమ ఆర్థిక ఆస్తులు, అప్పుల వివరాలను ఒకరికొకరు కచ్చితంగా పంచుకోవాలి. ప్రతి జంట తాము డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎంత అమౌంట్ పెట్టారు, వాటి మెచ్యూరిటీ తేదీలు లాంటి వివరాలతో ఒక ఉమ్మడి "ఫైనాన్షియల్ ఫైల్"ను తయారు చేసుకోవాలని సూచించారు.

నామినీ వివరాలు: అన్ని బ్యాంక్ ఖాతాలు, డీమ్యాట్ అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్లలో నామినీ వివరాలను పక్కాగా అప్‌డేట్ చేయాలి. ఇది ఆస్తులను క్లెయిమ్ చేసుకునే ప్రక్రియను 90 శాతం సులభతరం చేస్తుంది. నామినీ పేర్లు సరిలేకపోయినా, సంబంధాలు స్పష్టంగా లేకపోయినా న్యాయపరమైన వివాదాలకు దారి తీస్తుంది.

టర్మ్ ఇన్సూరెన్స్: సంపాదించే వ్యక్తి మరణిస్తే కుటుంబం రోడ్డున పడకుండా కాపాడేదే టర్మ్ పాలసీ. అలాంటి యాక్టివ్ పాలసీల గురించి, వాటి పత్రాలు ఎక్కడ ఉన్నాయో జీవిత భాగస్వామికి పూర్తిగా తెలిసి ఉండాలి.

ఆస్తులను ట్రాక్ చేయడానికి యాప్స్:

కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి "వెల్తీ లెటర్" లాంటి ఫైనాన్షియల్ ట్రాకింగ్ యాప్‌లను ఉపయోగించాలని ఫైనాన్సియల్ ఎక్స్‌పర్ట్ సూచించారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్, బంగారం, ఈక్విటీల వివరాలన్నీ ఇందులో నమోదు చేసి, ఆ యాప్ యాక్సెస్‌ను మీ జీవిత భాగస్వామికి ఇవ్వడం ద్వారా.. వారు కుటుంబం మొత్తం ఆర్థిక స్థితిని ఒకే చోట సులభంగా చూడగలరు.

మరోవైపు చాలామంది భవిష్యత్తులో తమ కుటుంబానికి సర్ ప్రైజ్ ఇద్దామని ఇతర ఊర్లలో చిన్న చిన్న ప్లాట్లు రహస్యంగా కొనిపెడుతుంటారు. ఒకవేళ అనుకోని మరణం సంభవిస్తే, ఆ కొనుగోలు గురించి కుటుంబానికి ఏమాత్రం తెలియకపోవడం వల్ల ఆ కోట్ల రూపాయల ఆస్తులు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. కాగా, ఏదైనా విషాదం జరిగే వరకు ఎదురుచూడకండి. ప్రతి జంట కూర్చుని తమ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఆస్తి, అప్పు వివరాలను స్పష్టంగా రాసి పెట్టుకోవాలి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story