Eye: అసలు కన్ను ఎందుకు కొట్టుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.?

Eye: చాలామందికి ఒక్కసారిగా కన్ను లేదా కనురెప్ప అదరడం అనుభవించే ఉంటాం. కొందరు దీనిని శుభం లేదా అశుభానికి సంకేతంగా భావిస్తే, కొందరు ఆరోగ్య సమస్యగా అనుమానిస్తారు.

Mokshith
Published on: 16 Jun 2026 3:46 PM IST
Eye
X

Eye: అసలు కన్ను ఎందుకు కొట్టుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.?

Eye Twitching: చాలామందికి ఒక్కసారిగా కన్ను లేదా కనురెప్ప అదరడం అనుభవించే ఉంటాం. కొందరు దీనిని శుభం లేదా అశుభానికి సంకేతంగా భావిస్తే, మరికొందరు ఆరోగ్య సమస్యగా అనుమానిస్తారు. అయితే వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కన్ను అదరడం వెనకాల అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

కన్ను అదరడం అంటే ఏంటి?

కన్ను అదరడం అనేది కంటి చుట్టూ ఉండే కండరాలు లేదా కనురెప్పల కండరాలు మన నియంత్రణ లేకుండా కదలడం. కొన్నిసార్లు కేవలం కనురెప్ప మాత్రమే స్వల్పంగా కంపిస్తుంటుంది. మరికొన్ని సందర్భాల్లో కంటి చుట్టూ ఉన్న కండరాల్లో పదేపదే చిన్న చిన్న కదలికలు కనిపిస్తాయి. అరుదుగా ఈ సమస్య తీవ్రంగా ఉంటే కన్ను పదేపదే మూసుకుపోయే పరిస్థితి కూడా రావచ్చు.

ఒత్తిడి, నిద్రలేమి ప్రధాన కారణాలు

వైద్య నిపుణుల ప్రకారం కన్ను అదరడానికి అత్యంత సాధారణ కారణాలు ఒత్తిడి (Stress), నిద్రలేమి. శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోతే లేదా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే కనురెప్పల కండరాల్లో ఆకస్మిక కదలికలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం చాలామంది గంటల తరబడి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ స్క్రీన్లు చూస్తున్నారు. దీనివల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి కూడా ఈ సమస్య రావచ్చు.

కాఫీ, టీ ఎక్కువగా తాగినా ఈ సమస్య రావచ్చు

అధికంగా కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ లేదా మద్యం సేవించడం కూడా కన్ను అదరడానికి కారణమవుతుంది. అలాగే శరీరంలో మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాల లోపం ఉన్నప్పుడు కండరాల్లో కంపనలు, ఆకస్మిక కదలికలు కనిపించవచ్చు. కంటి అలర్జీలు, కళ్లలో పొడిబారడం, మంట వంటి సమస్యలు ఉన్నవారిలో కూడా కనురెప్పలు తరచూ అదిరే అవకాశం ఉంటుంది.

కన్ను అదరడంపై ఉన్న అపోహలు ఏంటి?

భారతీయ సమాజంలో కన్ను అదరడంపై అనేక నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు ఎడమ కన్ను అదిరితే శుభం, కుడి కన్ను అదిరితే అశుభం అని కొందరు నమ్ముతారు. పురుషుల విషయంలో కూడా ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. అయితే వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో కన్ను అదరడం అనేది జీవనశైలి, శారీరక పరిస్థితులు లేదా మానసిక ఒత్తిడితో సంబంధం ఉన్న సమస్య మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

కన్ను అదరడం కొన్ని గంటలు లేదా ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతే ఆందోళన అవసరం లేదు. అయితే ఎక్కువ రోజుల పాటు కొనసాగితే, కన్ను పూర్తిగా మూసుకుపోయే పరిస్థితి వస్తే, ముఖంలోని ఇతర భాగాల్లో కూడా కండరాల కదలికలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇది నరాలకు సంబంధించిన సమస్యలు, కండరాల వ్యాధులు లేదా ఇతర న్యూరాలజికల్ సమస్యలకు సంకేతంగా ఉండవచ్చు.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించడం, మొబైల్, కంప్యూటర్ వినియోగాన్ని పరిమితం చేయడం, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా సందర్భాల్లో ఈ చిన్న చిన్న జాగ్రత్తలతోనే కన్ను అదరడం సమస్య తగ్గిపోతుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story