Viral Story : నాన్న డైరీ తెరిచిన కొడుకు.. 10 ఏళ్ల కలలు నిజమైన షాకింగ్ స్టోరీ.!
Viral Story : పెద్ద పెద్ద విజయాలు సాధించినప్పుడే కాదు, జీవితంలో మనకున్న చిన్న చిన్న వసతులకే కృతజ్ఞతతో ఉండటం ఎంత ముఖ్యమో గుర్తుచేసే ఒక అద్భుతమైన ఉదంతం
Inspirational Story
Viral Story : పెద్ద పెద్ద విజయాలు సాధించినప్పుడే కాదు, జీవితంలో మనకున్న చిన్న చిన్న వసతులకే కృతజ్ఞతతో ఉండటం ఎంత ముఖ్యమో గుర్తుచేసే ఒక అద్భుతమైన ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆశుతోష్ ప్రతిహస్త్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన తండ్రికి సంబంధించిన ఒక పాత నోట్‌బుక్‌ను తిరగేయగా, అందులో రాసి ఉన్న విషయాలు చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. పదేళ్ల క్రితం ఆయన రాసుకున్న చిన్న చిన్న 'థ్యాంక్యూ' నోట్స్, కాలక్రమేణా ఎలా నిజమయ్యాయో వివరిస్తూ పెట్టిన వీడియో నెటిజన్ల కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది.
ఫ్రిజ్‌లో చల్లటి నీళ్ల నుంచి.. కుటుంబంపై ప్రేమ వరకు
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఆశుతోష్ తన తండ్రిని ఆ పాత డైరీ వయసు ఎంత అని అడుగుతాడు. దానికి ఆయన నవ్వుతూ అది 9 లేదా 10 ఏళ్ల నాటిదని చెబుతారు. ఆశుతోష్ ఆ డైరీ పేజీలను తిరగేస్తుండగా.. అందులో దాదాపు ప్రతి పేజీలోనూ కృతజ్ఞతా భావమే ప్రధానాంశంగా కనిపించింది. ఆయన పెద్ద పెద్ద విజయాల గురించి కాకుండా, సామాన్య మానవుడు నిత్యజీవితంలో పెద్దగా పట్టించుకోని చిన్న చిన్న సౌకర్యాల గురించి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నారు.
ఒక పేజీలో.. "వేసవి కాలంలో మా కుటుంబం చల్లటి నీరు తాగడానికి మా ఇంట్లో ఫ్రిజ్ ఉన్నందుకు కృతజ్ఞతలు" అని రాశారు. మరోచోట తన భార్య గురించి రాస్తూ.. "ఎంతో కేరింగ్‌గా ఉంటూ, ఇద్దరు పిల్లలను క్రమశిక్షణతో పెంచినందుకు నా భార్యకు ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. తన పిల్లలిద్దరూ స్కూల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నందుకు, బహుముఖ ప్రజ్ఞాశాలలుగా ఎదుగుతున్నందుకు తాను ఎంతో అదృష్టవంతుడినని రాసుకున్నారు.
‘ది సీక్రెట్’ పుస్తక స్ఫూర్తి..
ఇంత చిన్న విషయాలను డైరీలో ఎందుకు రాశారని కొడుకు అడగగా, ఆ తండ్రి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రపంచప్రసిద్ధ పుస్తకం 'ది సీక్రెట్' చదివిన తర్వాత.. మనసులో బలంగా అనుకుంటే ఏదైనా సాధించవచ్చనే నమ్మకంతో, కృతజ్ఞతా భావంతో ఈ డైరీ రాయడం ప్రారంభించినట్లు చెప్పారు.
ఆ డైరీలో వారి చిన్ననాటి సాదాసీదా ఆశలు కూడా ఉన్నాయి. "మేము కుటుంబంతో కలిసి కూర్చుని టీ తాగడానికి రెండు కుర్చీలు, చలికాలంలో వెచ్చదనాన్నిచ్చే రెండు దుప్పట్లు ఉన్నందుకు థ్యాంక్స్" అని రాశారు. వీటితో పాటు ప్రెజర్ కుక్కర్, సీలింగ్ ఫ్యాన్, కప్బోర్డ్, సోఫా సెట్, సెంటర్ టేబుల్, చివరకు వై-ఫై కనెక్షన్ కావాలని కూడా అందులో కోరుకున్నారు. "ఇంత చిన్న విషయాలు రాయడం వల్ల ఏమైనా మార్పు వచ్చిందా?" అని కొడుకు ప్రశ్నించగా.. "నేను రాసినవన్నీ కాలక్రమేణా నా కలల జాబితాగా మారి, నిజమయ్యాయి" అని ఆ తండ్రి గర్వంగా సమాధానమిచ్చారు.
మిరాకిల్.. ప్రెజర్ కుక్కర్ నుంచి లగ్జరీ కార్ల వరకు
అప్పట్లో ఒక కుక్కర్, సోఫా కోసం ఆశపడిన ఆ కుటుంబ ప్రస్థానం పదేళ్లలో పూర్తిగా మారిపోయింది. డైరీలో రాసుకున్న ప్రతీ చిన్న వస్తువు ఇంట్లోకి రావడమే కాకుండా.. ఇవాళ ఆ తండ్రి బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లకు యజమాని అయ్యారు. నిరంతరం కృతజ్ఞతతో ఉండటం, అనుకున్నది సాధించగలమనే పాజిటివ్ ఆలోచనా విధానమే వారి జీవితాన్ని ఇంతలా మార్చేసిందని వీక్షకులు నమ్ముతున్నారు.
ఆ ఒక్కటి ఇస్తే.. అన్నీ లభిస్తాయి
వీడియో చివరలో ఆశుతోష్ డైరీలోని చివరి లైన్ చదివి వినిపించాడు. "నువ్వు జీవితానికి ఆ ఒక్కటి ఇస్తే, నీకు అన్నీ లభిస్తాయి. ఒకవేళ ఆ ఒక్కటి ఇవ్వకపోతే, నీకు ఉన్నది కూడా కోల్పోతావు" అని అందులో ఉంది. ఆ 'ఒక్కటి' మరేదో కాదు.. మనకున్న దాని పట్ల 'కృతజ్ఞత' కలిగి ఉండటమేనని ఆ తండ్రి వివరించారు.
ఈ ఎమోషనల్ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. "ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే మా జనరేషన్‌కు మీ నాన్నగారి డైరీ ఒక పెద్ద కనువిప్పు" అని ఒక 17 ఏళ్ల యువకుడు కామెంట్ చేయగా.. "విజయం సాధించిన తర్వాత కృతజ్ఞత చూపడం కాదు, కృతజ్ఞతతో ఉండటమే విజయానికి పునాది అని ఈ డైరీ నిరూపించింది" అని మరొకరు రాసుకొచ్చారు.




