Elephant Calf: నదిలో 5 కిలోమీటర్లు కొట్టుకుపోయిన ఏనుగు పిల్ల.. మత్స్యకారుల సాహసంతో దక్కిన ప్రాణాలు!
Elephant Calf: పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో నదిలో కొట్టుకుపోయిన నాలుగు రోజుల ఏనుగు పిల్లను మత్స్యకారులు ప్రాణాలకు తెగించి కాపాడారు.
Elephant Calf: నదిలో 5 కిలోమీటర్లు కొట్టుకుపోయిన ఏనుగు పిల్ల.. మత్స్యకారుల సాహసంతో దక్కిన ప్రాణాలు!
Elephant Calf: తల్లి గుంపు నుంచి తప్పిపోయి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన ఓ చిన్నారి ఏనుగు పిల్లను మత్స్యకారులు సాహసించి కాపాడారు. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయిగురి జిల్లా బైకంఠపూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.
అటవీ అధికారుల వివరాల ప్రకారం.. బైకంఠపూర్ అటవీ ప్రాంతం గుండా ఓ ఏనుగుల గుంపు తీస్తా నదిని దాటుతుండగా, కేవలం నాలుగు రోజుల వయసున్న ఏనుగు పిల్ల గుంపు నుంచి తప్పిపోయింది. ఆ సమయంలో నదిలో వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో ఆ పసి ఏనుగు నీటిలో దాదాపు 5 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయింది. నీటిలో తేలేందుకు తీవ్రంగా అవస్థపడుతున్న ఏనుగు పిల్లను కొందరు స్థానిక మత్స్యకారులు గమనించారు.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా మత్స్యకారులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా నదిలోకి వెళ్లి, తీవ్రంగా శ్రమించి ఆ పిల్ల ఏనుగును సురక్షితంగా పడవలోకి ఎక్కించారు. అనంతరం వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ అధికారులు ఆ ఏనుగు పిల్లను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి తల్లి ఏనుగు ఆచూకీ కనుగొన్నారు. ఎంతో భయపడిన ఆ పసి ఏనుగును సురక్షితంగా దాని తల్లి వద్దకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మత్స్యకారులు చూపిన చొరవ, అటవీ అధికారుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.




