Viral: ఇలా ఉన్నారేంట్రా.! చలాన్లు తప్పించేందుకు నెంబర్ ప్లేటే మాయం చేసిన ఎస్‌యూవీ..

Viral: ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై నంబర్ ప్లేట్ మాయం చేసే పరికరంతో తిరుగుతున్న టయోటా ఫార్చ్యూనర్ వీడియో వైరల్ అవుతోంది.

Ravi
By Ravi
Published on: 9 Sept 2026 9:46 PM IST
Viral
X

Viral: ఇలా ఉన్నారేంట్రా.! చలాన్లు తప్పించేందుకు నెంబర్ ప్లేటే మాయం చేసిన ఎస్‌యూవీ..

Viral: మహారాష్ట్రలోని ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై చోటుచేసుకున్న ఒక విచిత్రమైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక టయోటా ఫార్చ్యూనర్ కారు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా దాని రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కనిపించకుండా కనుమరుగైపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కారు వెనుక భాగంలో అమర్చిన ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ లేదా స్లైడింగ్ మెకానిజమ్ సహాయంతో డ్రైవర్ క్షణాల వ్యవధిలో నంబర్ ప్లేట్‌ను పూర్తిగా కవర్ చేసినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రాఫిక్ కెమెరాలకు చిక్కకుండా, నిబంధనలను ఉల్లంఘించేందుకు వాహనదారులు ఇలాంటి అక్రమ పద్ధతులను ఆశ్రయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు వాహన వివరాలను ఆరా తీశారు. ఆ వెహికల్ రికార్డ్ పరిశీలించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఫార్చ్యూనర్ కారుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 55కి పైగా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. ఓవర్‌స్పీడింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్, సీట్ బెల్ట్ ధరించకపోవడం లాంటి వివిధ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కింద ఈ చలాన్లు నమోదయ్యాయి. ఈ పెండింగ్ జరిమానాల మొత్తం రూ. 1 లక్ష దాటినట్లు ఆన్ లైన్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో జరిమానాలు పేరుకుపోయినప్పటికీ, అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆటోమేటిక్ నంబర్-ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల నుంచి తప్పించుకోవడానికి కొందరు కేటుగాళ్లు ఇలాంటి నంబర్ ప్లేట్ హైడింగ్ పరికరాలను వాడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఏవైనా యాక్సిడెంట్లు లేదా హిట్-అండ్-అన్ కేసులు జరిగితే, ఇలాంటి నంబర్ ప్లేట్లు లేని వాహనాలను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారుతుంది. నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న ఇలాంటి వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు తక్షణమే దృష్టి పెట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరహా అక్రమ పరికరాలను విక్రయించే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు భద్రతను విస్మరించి నిబంధనలను తుంగలో తొక్కుతున్న ఇలాంటి డ్రైవర్ల లైసెన్సులను రద్దు చేసి, వాహనాలను సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story