Viral News : బురదలో బడి ప్రయాణం.. త్రివర్ణ పతాకాలతో పిల్లల ‘తిరంగా తిరుగుబాటు’.!

Viral News : ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఒక వినూత్న, ఉద్వేగభరిత నిరసన వెలుగు చూసింది. తమ పాఠశాలకు వెళ్లేందుకు కనీసం

G Krishna
Published on: 12 Aug 2026 1:00 PM IST
Viral-News
X

Viral-News

Viral News : ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఒక వినూత్న, ఉద్వేగభరిత నిరసన వెలుగు చూసింది. తమ పాఠశాలకు వెళ్లేందుకు కనీసం పక్కా రోడ్డు కూడా లేకపోవడంతో విసుగుచెందిన 'జెన్ ఆల్ఫా' చిన్నారులు, గ్రామస్థులు కలసి కలెక్టరేట్ ముట్టడికి దిగారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ తమ హక్కుల కోసం కలెక్టర్ కార్యాలయం ముందు భీష్మించారు.

5 కిలోమీటర్ల 'తిరంగా యాత్ర'.. కలెక్టరేట్ గేటు వద్ద ధర్నా

చందు పూర్ గ్రామ్‌పంచాయతీకి చెందిన పాఠశాల విద్యార్థులు, గ్రామస్థులు సుమారు 5 కిలోమీటర్ల మేర 'తిరంగా యాత్ర'గా నడుచుకుంటూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా తమ గ్రామానికి కనీసం ఒక పక్కా రోడ్డు కూడా నిర్మించలేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ బడికి వెళ్లాలంటే కాళ్లకు బురద అంటుకుంటూ, ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన చెందారు.

కలెక్టరేట్‌కు చేరుకున్న వెంటనే విద్యార్థులంతా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (DM) కార్యాలయ ప్రధాన గేటు ముందే బైఠాయించి నిరసన చేపట్టారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రత్యక్షంగా ప్రారంభమయ్యే వరకు తాము అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించగా, ఎస్డీఎమ్ , ఇతర అధికారులు వచ్చి వారితో చర్చలు జరిపారు.

వర్షాకాలంలో నరకయాతన.. స్కూలు డ్రెస్సులు పాడవుతున్నాయని ఆవేదన

ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ మట్టి రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయి బురదమయంగా మారుతుందని విద్యార్థులు, గ్రామస్థులు తెలిపారు. పాఠశాలలకు వెళ్లే చిన్నపిల్లలు బురదలో జారిపడి గాయపడుతున్నారని, యూనిఫాంలు, పుస్తకాలు పాడైపోతున్నాయని వాపోయారు. ఎన్నో ఏళ్లుగా విన్నపాలు ఇస్తున్నా ఏ అధికారి, ప్రజాప్రతినిధి పట్టించుకోకపోవడంతోనే చివరికి ఇలా పిల్లలతో కలిసి నిరసన తెలపాల్సి వచ్చిందని చెప్పారు.

అధికారుల వివరణ.. 'అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి'

ఈ ఆందోళనపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) రాకేష్ కుమార్ స్పందిస్తూ.. విద్యార్థులు, గ్రామస్థుల నుంచి వినతిపత్రం స్వీకరించినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఇదివరకు ఉన్న అటవీ శాఖ అనుమతుల (NOC) సమస్య పరిష్కారమైందని వెల్లడించారు.

సుమారు రూ. 1 కోటి అంచనా వ్యయంతో పక్కా రోడ్డు నిర్మించే ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి పంపామని, అనుమతి రాగానే టెండర్లు పిలిచి పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఈ విషయమై గతంలోనే గ్రామస్థులకు వివరణ ఇచ్చినప్పటికీ, కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చిన్నారులను ముందుకు నెట్టి సమస్యను రాజకీయంగా పెద్దది చేసేందుకు యత్నిస్తున్నారని ఏడీఎమ్ ఆరోపించారు. అధికారులు హామీలు ఇస్తున్నప్పటికీ, రాతపూర్వక హామీ లేదా పనుల ప్రారంభం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని విద్యార్థులు, గ్రామస్థులు స్పష్టం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story