Viral News: ఉపాధి కోసం పెంచుకున్న కోళ్లు మాయం.. ఫామ్‌లో దృశ్యం చూసి షాకైన మహిళ!

Python: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటి గ్రామంలో భారీ కొండచిలువ కలకలం. కోళ్ల ఫామ్‌లోకి జొరబడి 10 కోళ్లను మింగేసిన కొండచిలువ.

Arun Chilukuri
Published on: 31 Oct 2026 11:49 AM IST
Python
X

Python: ఉపాధి కోసం పెంచుకున్న కోళ్లు మాయం.. ఫామ్‌లో దృశ్యం చూసి షాకైన మహిళ!

Python: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక భారీ కొండచిలువ తీవ్ర కలకలం సృష్టించింది. రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో రాత్రికి రాత్రే జనవాసాల్లోకి చొరబడిన ఒక కొండచిలువ ఏకంగా ఒక మహిళకు చెందిన కోళ్ల ఫామ్‌పై దాడి చేసి పది కోళ్లను మింగేసింది. కడుపు నిండా కోళ్లను ఆరగించిన ఆ భారీ సరీసృపం కదల్లేని స్థితిలో ఫామ్‌లోనే ఉండిపోవడంతో తెల్లవారుజామున ఈ భయంకర దృశ్యాన్ని చూసిన ఆ మహిళ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

గోలేటి గ్రామానికి చెందిన సుల్వ రాజనర్సు అనే మహిళ డ్వాక్రా సంఘం ద్వారా ప్రభుత్వం అందించే 'ఇందిరా మహిళా శక్తి' పథకం కింద 25 కోడి పిల్లలను అందుకని లబ్ధి పొందారు. వాటిని పెంచుకుంటూ జీవనోపాధి పొందాలనే ఉద్దేశంతో ఆమె తన ఇంటి వద్దే చిన్నపాటి కోళ్ల ఫామ్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

అయితే రాత్రి సమయంలో ఆహారం వెతుక్కుంటూ వచ్చిన భారీ కొండచిలువ ఫామ్‌లోకి చొరబడి అక్కడ ఉన్న కోళ్లపై విచక్షణారహితంగా దాడి చేసింది. అందులో ఉన్న 25 కోళ్లలో దాదాపు 10 కోళ్లను ఒక్కొక్కటిగా మింగేసింది. అనంతరం పొట్ట నిండా కోళ్లతో బరువుగా మారిన ఆ కొండచిలువ కదలలేక ఫామ్‌లోనే కూలబడింది. ఉదయాన్నే కోళ్లకు దానా వేసేందుకు వెళ్లిన రాజనర్సు ఫామ్‌లో తిష్టవేసిన కొండచిలువను చూసి భయంతో వణికిపోయి గట్టిగా కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కొండచిలువను చూసేందుకు ఎగబడ్డారు.

ఉపాధి కోసం పెంచుకుంటున్న కోళ్లను కొండచిలువ మింగేయడంతో బాధితురాలు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ అనూహ్య ఘటనతో గోలేటి గ్రామంలో కొండచిలువల సంచారంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.