Viral: ఆన్‌లైన్ ఆర్డర్ కోసం చూసిన కస్టమర్‌.. ఎంతకూ రాని డెలివరీ బాయ్.. ట్రాక్ చేయగా!

Viral: గురుగ్రామ్‌లో ఓ కస్టమర్ తన లేట్ అయిన జొమాటో ఆర్డర్‌ను ట్రాక్ చేయగా, డెలివరీ బాయ్ దానిని తింటూ కనిపించాడు.

Ravi
By Ravi
Published on: 9 Sept 2026 9:43 PM IST
Viral
X

Viral: ఆన్‌లైన్ ఆర్డర్ కోసం చూసిన కస్టమర్‌.. ఎంతకూ రాని డెలివరీ బాయ్.. ట్రాక్ చేయగా!

Viral: ఆన్‌లైన్ ఫూడ్ డెలివరీ యాప్‌ల ద్వారా నగరాల్లో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేయడం నేడు సర్వసాధారణంగా మారింది. ఆర్డర్ చేసిన తర్వాత కస్టమర్లు లైవ్ లొకేషన్ ట్రాకర్ ద్వారా డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడో ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. అయితే గురుగ్రామ్‌కు చెందిన రిషభ్ కౌశిక్ అనే వ్యక్తికి ఎదురైన అనుభవం మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. రాత్రి సమయంలో ఆయన ఒక ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేశారు. చాలా సమయం గడిచినా ఆర్డర్ ఇంటికి రాకపోవడంతో ఆయన ఆ యాప్‌లో డెలివరీ పార్టనర్ లైవ్ లొకేషన్‌ను పరిశీలించారు. సుమారు నలభై నిమిషాల పాటు డెలివరీ బాయ్ కదలకుండా అదే ప్రదేశంలో నిలిచి ఉండటంతో ఆయనకు అనుమానం వచ్చింది.

ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆయన నేరుగా ఆ లొకేషన్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ ఆయన చూసిన దృశ్యం చూసి షాక్‌కు గురయ్యారు. కస్టమర్‌కు డెలివరీ చేయాల్సిన ఫుడ్ ప్యాకెట్లను తెరిచి, డెలివరీ బాయ్ మరో వ్యక్తితో కలిసి హ్యాపీగా తింటూ కనిపించాడు. ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన ఫోటోలను, ఆర్డర్ ట్రాకర్ స్క్రీన్‌షాట్లను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్‌ను ట్యాగ్ చేస్తూ ఆయన తీవ్రంగా స్పందించారు. ఇది ఫుడ్ డెలివరీ కాదని, ఫుడ్ షేరింగ్ ఎకానమీగా మారిపోయిందని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసుల నాణ్యత, పారదర్శకతపై ఈ ఘటన మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. కస్టమర్లు ఎంతో ఆశగా ఎదురుచూసే ఆర్డర్లు ఇలా మధ్యలోనే డెలివరీ బాయ్స్ తినేయడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఘటనపై స్పందించిన జొమాటో కేర్ బృందం, బాధితుడిని ఆర్డర్ ఐడీ వివరాలు కోరింది. ఈ సమస్యపై పూర్తి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సంస్థ తెలిపింది. ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డెలివరీ సిబ్బందిపై కఠినమైన నిఘా ఉండాలని వినియోగదారులు కోరుతున్నారు. చిన్న ఆర్డర్ల విషయంలోనూ ఇలాంటి మోసాలు జరుగుతుండటం ఆందోళనకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న ఇలాంటి సిబ్బందిపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story