Viral : భిక్షాటనలో రోజుకు రూ.4 వేలా.? యూట్యూబర్ షాకింగ్ ఎక్స్‌పెరిమెంట్.!

Viral : ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ఉత్సవాల వద్ద అడుక్కునే వారికి రోజుకు ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోవడానికి ఒక యూట్యూబర్ చేసిన వినూత్న సోషల్..

G Krishna
Published on: 20 Aug 2026 1:42 PM IST
Social Experiment
X

Social Experiment

Viral : ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ఉత్సవాల వద్ద అడుక్కునే వారికి రోజుకు ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోవడానికి ఒక యూట్యూబర్ చేసిన వినూత్న సోషల్ ఎక్స్‌పెరిమెంట్ (Social Experiment) ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రసిద్ధ హరిద్వార్ కాన్వడ్ మేళా (Kawad Mela) ప్రాంగణంలో సాగిన ఈ ప్రయోగంలో ఒక్క రోజులోనే అడిగిన డబ్బుల వివరాలు, ఆడియన్స్‌తో పాటు నెటిజన్లను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

చిరిగిన దుస్తులు.. మెడలో క్యూఆర్ కోడ్‌తో రంగంలోకి

పురుషోత్తం వశిష్ట్ అనే యూట్యూబర్, తన స్నేహితుడు సచిన్‌తో కలిసి ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. సచిన్ తన రూపాన్ని పూర్తిగా మార్చేసుకుని చిరిగిన బట్టలు ధరించి, ముఖానికి బురద పూసుకుని, చేతిలో చిన్న పాత్ర పట్టుకుని బిచ్చగాడి అవతారమెత్తాడు. అంతేకాకుండా, నేటి డిజిటల్ యుగానికి తగ్గట్లుగా తన మెడలో ఒక UPI క్యూఆర్ కోడ్ (QR Code) బోర్డును కూడా వేలాడదీసుకుని రద్దీగా ఉన్న మేళా ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. రోజంతా కష్టపడితే దాదాపు రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు రావచ్చు అని వారు ప్రాథమికంగా అంచనా వేశారు.

గ్లాస్‌తో పాటు స్పెాక్స్ గిఫ్ట్.. క్యూఆర్ కోడ్‌ ద్వారా డిజిటల్ భిక్ష

ప్రారంభంలో కొన్ని గంటల పాటు పెద్దగా స్పందన లభించలేదు. "ఏమీ లేవు పో" అని కొంతమంది విసుక్కున్నప్పటికీ, మరికొందరు భక్తులు ఉదారంగా సహాయం చేశారు. మేళా వీధుల్లో తిరుగుతున్న సమయంలో ఒక కూలింగ్ గ్లాసెస్ అమ్మే వ్యాపారి సచిన్‌కు ఉచితంగా ఒక సన్‌గ్లాసెస్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీంతో సచిన్ సరదాగా తనను తాను "ప్రొఫెషనల్ భిక్షగాడిని" అని వర్ణించుకున్నాడు. విచిత్రమేమిటంటే, అతని మెడలో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా కూడా కొందరు డిజిటల్ విధానంలో రూ. 40 వరకు విరాళం పంపడం విశేషం.

రోజంతా కష్టపడితే ఏకంగా రూ. 4,000 ఆదాయం

సుదీర్ఘంగా వర్షంలో తడుస్తూ, భద్రతా సిబ్బంది వెళ్లగొడుతున్నా సరే భక్తులను అడుగుతూ సచిన్ ఈ ప్రయోగాన్ని కొనసాగించాడు. మొదటి 4 గంటల్లోనే రూ. 800 వరకు పోగయ్యాయి. ప్రయోగం పూర్తయ్యేసరికి వారి దగ్గర ఏకంగా రూ. 4,000 సంపాదన సమకూరింది. ఇదే లెక్కన రోజుకు రూ. 4,000 చొప్పున లెక్కిస్తే, నెలకు దాదాపు రూ. 1.2 లక్షల వరకు సంపాదించవచ్చని వారు ఈ వీడియో ద్వారా అంచనా వేసి చూపించారు.

ఆదాయం బాగానే ఉంది కానీ.. యూట్యూబర్ల కీలక సందేశం

ప్రయోగం ముగిసిన తర్వాత యూట్యూబర్లు ఇద్దరూ ఒక ముఖ్యాంశాన్ని వెల్లడించారు. రోజంతా వీధుల్లో తిరిగి, ముఖంపై నవ్వులు లేదా బాధను నటిస్తూ జనం వద్దకు వెళ్లడం శారీరకంగా, మానసికంగా తీవ్రమైన అలసటను కలిగిస్తుందని పేర్కొన్నారు. "ఇది చూడటానికి సులువుగా అనిపించినా చాలా కష్టంతో కూడుకున్న పని. ఎవరూ కూడా అడ్డదారిలో భిక్షాటన వైపు వెళ్లకుండా, నిజాయితీగా కష్టపడి సంపాదించుకోవాలి" అని వారు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.

నెటిజన్ల భిన్నమైన అభిప్రాయాలు

ఈ వీడియో ఎక్స్ (X), ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుణ్యక్షేత్రాల వద్ద భిక్షాటన అనేది ఇప్పుడు ఒక వ్యవస్థీకృత వ్యాపారంగా లేదా జీవనోపాధిగా మారిపోయిందని కొందరు విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం సరదాగా చేసిన ఒక రోజు ప్రయోగం ఆధారంగా నిజంగా భిక్షాటనపై ఆధారపడి బ్రతికే పేదల దైన్య స్థితిని, వారి దినచర్యను అంచనా వేయలేమని అభిప్రాయపడుతున్నారు.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story