Viral Video : మెతుకు కోసం వెతుకులాట.. కడుపు ఆకలికి కన్నీటి వేట.. ఈ వీడియో చూడలేము బాబోయ్

Viral Video : ఆకలి మనిషితో ఏమైనా చేయిస్తుందని చెప్పడానికి ఈ వైరల్ వీడియో నిదర్శనం. రైలు బోగీలో మురికి నేలపై పడిపోయిన అన్నం మెతుకులను ఏరుకుని తింటున్న వ్యక్తి దృశ్యం సోషల్ మీడియాను కదిలించివేస్తోంది.

CR Reddy
Updated on: 3 April 2026 9:03 AM IST
Heart Wrenching Viral Video
X

Heart Wrenching Viral Video

Viral Video : సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వస్తుంటాయి. కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం గుండె తరుక్కుపోతుంది. దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా, పేదరికం అనే కఠిన వాస్తవం ఇంకా మన కళ్లముందే ఉందనడానికి ఈ దృశ్యమే నిదర్శనం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక రైలు స్లీపర్ బోగీలో చిత్రీకరించినట్లుగా ఉంది. అక్కడ ఒక వ్యక్తి తన ఆకలిని తట్టుకోలేక, పరువును కూడా పక్కన పెట్టి చేస్తున్న పని చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు. రైలులో ప్రయాణికులు నడిచే మురికి నేలపై ఎవరో పడేసిన లేదా ఒలికిపోయిన అన్నం మెతుకులను ఆ వ్యక్తి ఒక్కొక్కటిగా ఏరుకుని తింటున్నాడు. చుట్టూ ఎంతమంది చూస్తున్నా, ఆ ప్రదేశం ఎంత అపరిశుభ్రంగా ఉన్నా.. తన కడుపులో మండుతున్న ఆకలి మంట ముందు అతడికి ఏదీ అడ్డు రాలేదు. ఆకలి మనిషిని ఎంతటి దయనీయ స్థితికి దిగజారుస్తుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

సిస్టమ్ పై నెటిజన్ల ఆగ్రహం

ఈ వీడియోను X వేదికగా @Renuy703 అనే హ్యాండిల్ ద్వారా షేర్ చేయగా, అది చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో, టెక్నాలజీ ఇంతగా పెరిగిన రోజుల్లో కూడా ఒక మనిషి అన్నం మెతుకుల కోసం ఇంతలా తల్లడిల్లడం వ్యవస్థ వైఫల్యమేనని మండిపడుతున్నారు. మనం హోటళ్లకు వెళ్లినప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు ప్లేట్ల నిండా అన్నం వదిలేస్తుంటాం.. కానీ ఇక్కడ ఒక వ్యక్తి నేలపై పడ్డ మెతుకులే అమృతంలా తింటున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాతైనా ఆహారాన్ని వృథా చేయడం ఆపేయాలని పలువురు హితవు పలుకుతున్నారు.

మానవత్వం ఎక్కడ?

ఈ క్లిప్ చూసిన ఒక యూజర్ స్పందిస్తూ.. "మనం విలాసాల కోసం వేల రూపాయలు ఖర్చు పెడతాం, కానీ ఇలాంటి పేదల ఆకలి తీర్చడానికి మాత్రం ఎవరూ ముందుకు రారు" అని కామెంట్ చేశారు. మరొకరు "ఇది చూస్తుంటే మనం ఎంత స్వార్థపూరిత సమాజంలో బతుకుతున్నామో అర్థమవుతోంది" అని రాశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. కేవలం సానుభూతి చూపడమే కాకుండా, ఇలాంటి అభాగ్యులను ఆదుకునేలా ప్రభుత్వం మరియు సమాజం స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు.

CR Reddy

CR Reddy

Next Story