Viral: వరదల్లో చిక్కుకున్న బైకర్.. చున్నీతో ప్రాణాలు కాపాడిన నవ వధువు.. వీడియో వైరల్!
Viral: హిమాచల్ ప్రదేశ్‌లో వరదల్లో చిక్కుకున్న ఒక బైకర్‌ను, నవ వధువు తన చున్నీ సాయంతో కాపాడిన వీడియో వైరల్ అవుతోంది.
Viral: వరదల్లో చిక్కుకున్న బైకర్.. చున్నీతో ప్రాణాలు కాపాడిన నవ వధువు.. వీడియో వైరల్!
Viral: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. పచ్చని కొండలు, అందమైన లోయలతో ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి వణికిపోతోంది. ముఖ్యంగా చంబా జిల్లాలో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అకస్మాత్తుగా రోడ్లపైకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో బానిఖేత్ ప్రాంతం వైపు వెళ్తున్న ఒక బైకర్ ఆకస్మిక వరద ప్రవాహంలో చిక్కుకుపోయాడు. ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉండటంతో అతడు ముందుకూ వెళ్లలేక, వెనక్కి రాలేక రోడ్డు అంచున ప్రాణభయంతో నిలబడ్డాడు. నీటి ఉద్ధృతికి అతడు ఏ క్షణంలోనైనా కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. సరిగ్గా అదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఒక కుటుంబం అక్కడికి చేరుకుంది. ప్రమాదంలో ఉన్న బైకర్‌ను చూసి వెంటనే తమ వాహనాన్ని ఆపారు.
కారులో నుంచి ఒక వ్యక్తి దిగి వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లి అతడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ప్రవాహం చాలా బలంగా ఉండటంతో ఆ బైకర్ వద్దకు చేరుకోవడం సాధ్యపడలేదు. ఆ క్లిష్ట సమయంలో కారులో ఉన్న ఒక నవ వధువు అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. కారులోంచి బయటకు వచ్చిన ఆమె, ఏమాత్రం ఆలోచించకుండా తన మెడలో ఉన్న చున్నీని తీసి వరదల్లో చిక్కుకున్న ఆ యువకుడి వైపు ఒక తాడులా విసిరింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ బైకర్ వెంటనే ఆ చున్నీని గట్టిగా పట్టుకున్నాడు. చున్నీ సాయంతో బ్యాలెన్స్ చేసుకుంటూ అతడు నెమ్మదిగా కారు వైపు అడుగులు వేశాడు. నీటిలో ఉన్న వ్యక్తి కూడా తోడుగా నిలబడటంతో, ముగ్గురూ కలిసి జాగ్రత్తగా ఆ బైకర్‌ను వరద ప్రవాహం నుంచి సురక్షిత ప్రాంతానికి లాగేశారు.
ఈ ఉత్కంఠభరితమైన రెస్క్యూ ఆపరేషన్ మొత్తాన్ని అక్కడున్న కొందరు తమ మొబైల్ కెమెరాలతో రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని రక్షించడానికి నవ వధువు చూపిన చొరవను, ఆ కుటుంబం చేసిన సాయాన్ని నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు. సమయానికి వారు స్పందించకపోయి ఉంటే ఆ యువకుడు వరదల్లో గల్లంతయ్యేవాడని, ఆ కుటుంబం దేవుడిలా వచ్చి అతడిని కాపాడిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందని ఆ కామెంట్లలో తెలియజేస్తున్నారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. భారీ వర్షాల వల్ల ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. చంబా జిల్లా పరిధిలో కొడ్లా ఉరాయ్ రహదారిపై భారీగా కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ బండరాళ్లు, మట్టి కొండపై నుంచి రోడ్డు మీదకు పడటంతో ఆ మార్గంలో ప్రయాణాలు ఎంతో ప్రమాదకరంగా మారాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు అధికారికంగా ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.




