Legal Tips: మీ పొలానికి వెళ్లనివ్వకుండా సరిహద్దులు కట్టి దారి మూసివేస్తే ఇలా చేయండి!
Legal Tips: వ్యవసాయ భూములకు లేదా ప్లాట్లకు వెళ్లే దారి విషయంలో పక్కవారు అభ్యంతరాలు చెబుతూ అడ్డుకుంటున్నారా.?
Legal Tips: మీ పొలానికి వెళ్లనివ్వకుండా సరిహద్దులు కట్టి దారి మూసివేస్తే ఇలా చేయండి!
Legal Tips: భూమి అనేది ప్రతి ఒక్కరికీ ఒక ఎమోషన్. అయితే, భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో భూవివాదాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ భూములకు లేదా సొంత స్థలాలకు వెళ్లే 'దారి' విషయంలో పక్క పొలాల వారితో లేదా ఇరుగుపొరుగు వారితో తరచుగా గొడవలు జరుగుతుంటాయి. దారిని కబ్జా చేయడం, కంచె వేయడం లేదా ముళ్లకంపలు అడ్డుపెట్టడం లాంటి పనులు చేసి ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఇలాంటి భూవివాదాలు, దారి తగాదాలు తలెత్తినప్పుడు చట్టబద్ధంగా ఎలా ముందుకెళ్లాలి అనే విషయాలపై ప్రముఖ న్యాయవాది భాస్కర్ పలు కీలక సూచనలు చేశారు.
భారతీయ చట్టాల ప్రకారం(ముఖ్యంగా ఈజ్‌మెంట్ యాక్ట్ కింద) ఒక వ్యక్తి తన భూమికి లేదా ఆస్తికి చేరుకోవడానికి తగిన దారి హక్కు కచ్చితంగా ఉంటుంది. ఏళ్ల తరబడి ఒక దారిని వాడుకలో ఉపయోగిస్తున్నప్పుడు, అకస్మాత్తుగా ఎవరైనా దాన్ని మూసివేయడానికి లేదా అడ్డుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా బలవంతంగా మీ దారిని అడ్డుకుంటే, మీరు ఆవేశపడకుండా న్యాయపరంగా ఈ చర్యలు తీసుకోవచ్చు:
రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం: వ్యవసాయ భూముల విషయమైతే, ముందుగా స్థానిక వీఆర్వో, ఆర్ఐ లేదా తహసీల్దార్‌కు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. భూమి రికార్డులు, పాత మ్యాప్(నక్షా / FMB) ఆధారంగా అసలు దారి ఎక్కడినుంచి ఉందో వారు సర్వే చేసి నిర్ధారిస్తారు.
సివిల్ కోర్టును ఆశ్రయించడం: రెవెన్యూ అధికారుల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే, మీ ఆధారాలతో సహా నేరుగా సివిల్ కోర్టును ఆశ్రయించి 'ఇంజంక్షన్ ఆర్డర్' లేదా స్టే ఆర్డర్ తీసుకురావచ్చు. దీని ద్వారా ఎవరూ మీ దారిని అడ్డుకోకుండా కోర్టు రక్షణ కల్పిస్తుంది.
పోలీసుల సహాయం: దారి అడ్డుకునే క్రమంలో అవతలి వ్యక్తులు దౌర్జన్యానికి దిగినా, భౌతిక దాడులకు పాల్పడినా ఏమాత్రం భయపడకుండా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయాలి.
తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు:
భూమి లేదా ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడే దానికి స్పష్టమైన దారి ఉందో లేదో డాక్యుమెంట్లలో(లింక్ డాక్యుమెంట్లు, పాస్ బుక్స్) సరిచూసుకోవాలి. దారికి సంబంధించిన హక్కులు సేల్ డీడ్‌లో స్పష్టంగా రాసి ఉండేలా చూసుకోవాలి. భూవివాదాలు వచ్చినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, సరైన పత్రాలతో ఒక మంచి లాయర్‌ను సంప్రదిస్తే చట్టబద్ధంగా పూర్తి న్యాయం జరుగుతుంది.




