Viral News : నా జీతం సగానికి తగ్గించండి.. ప్రభుత్వానికి IAS అధికారి సంచలన లేఖ.!

Viral News : ఉత్తరప్రదేశ్ పాలనా యంత్రాంగంలో ఒక ఐఏఎస్ అధికారి రాసిన లేఖ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. 2023 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం ఎస్‌డీఎంగా

G Krishna
Published on: 21 July 2026 10:05 AM IST
Rinku-Singh-Rahi-IAS
X

Rinku-Singh-Rahi-IAS

Viral News : ఉత్తరప్రదేశ్ పాలనా యంత్రాంగంలో ఒక ఐఏఎస్ అధికారి రాసిన లేఖ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. 2023 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం ఎస్‌డీఎంగా (జ్యుడీషియల్) బాధ్యతలు నిర్వర్తిస్తున్న రింకు సింగ్ రాహి రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు పేజీల లేఖ రాశారు. తనకు రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే పని ఉంటోందని, అందుకే తన జీతంలో సగం కోత విధించాలని లేదా చట్టప్రకారం స్వతంత్రంగా పనిచేసే పోస్టింగ్‌కు బదిలీ చేయాలని కోరడం యూపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో ఆయన ఏకంగా రాష్ట్ర కేబినెట్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్ వర్మలపై పలు తీవ్ర ఆరోపణలు చేశారు.

అక్రమ ఆక్రమణల వెనుక రాజకీయ ఒత్తిళ్లు

తాను జాలౌన్ ఎస్‌డీఎంగా ఉన్న సమయంలో అక్కడి అక్రమ భూ ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ తనపై ఒత్తిడి తెచ్చారని రింకు సింగ్ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే గౌరీ శంకర్ వర్మ సమక్షంలోనే కలెక్టర్ ఈ ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. అంతేకాకుండా, మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్‌తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న అక్రమ ఆక్రమణల వ్యవహారంలో నిష్పాక్షిక విచారణ జరగకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా కుట్రలు పన్నారని తన లేఖలో బహిర్గతం చేశారు.

తనిఖీ చేసినందుకే హడావుడిగా బదిలీ

మంత్రి బంధువు, బ్లాక్ చీఫ్ రామ్‌రాజా నిరంజన్‌కు చెందిన ఒక కోల్డ్ స్టోరేజ్ కేంద్రం విషయంలో ఉద్దేశపూర్వకంగానే వివాదం సృష్టించారని రింకు సింగ్ పేర్కొన్నారు. గతంలో లక్నో అగ్నిప్రమాదం తర్వాత భద్రతా చర్యలను సమీక్షించే క్రమంలో తాను ఆ కోల్డ్ స్టోరేజ్‌ను తనిఖీ చేశానని తెలిపారు. అక్కడ నిర్వహించిన ఫైర్ డ్రిల్‌లో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని తేలిందని, పైగా దానికి సంబంధించిన పత్రాలు కూడా వారి వద్ద లేవని వెల్లడించారు. ఈ వ్యవహారంపై విచారణ కమిటీ నివేదిక ఇవ్వకముందే, తనను హడావుడిగా జాలౌన్ ఎస్‌డీఎం బాధ్యతల నుంచి తప్పించి జ్యుడీషియల్ గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారం కేవలం పేరుకే

జిల్లా పరిపాలన తీరుపై కూడా ఈ యువ ఐఏఎస్ అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ నిర్వహించే 'జనతా దర్శన్' కార్యక్రమం కేవలం ఒక లాంఛనంగా మాత్రమే మిగిలిపోయిందని, ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపకుండా తాత్కాలిక సర్దుబాట్లు మాత్రమే చేస్తున్నారని విమర్శించారు. నిబంధనల ప్రకారం తాను స్వతంత్రంగా పనిచేసేందుకు వీలుగా జాలౌన్‌లోని వేరే తహసీల్‌కు కానీ, లేదా మరొక జిల్లాకు కానీ బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఉత్తరప్రదేశ్‌లో అలాంటి వాతావరణం లేకపోతే, తనను వేరే రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై పంపాలని కోరారు. ఈ ఆరోపణలు ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుండగా, దీనిపై సంబంధిత నేతలు, అధికారులు ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story