Viral Video: ఫ్లైటా.. ఫ్యామిలీ రెస్టారెంటా.. సమోసాలు లాగిస్తూ తెగ ఎంజాయ్ చేసిన ఫ్యామిలీ..
Viral Video: ఇండిగో ఫ్లైట్‌లో ఓ కుటుంబం సమోసాలు, ధోక్లాలతో మినీ రెస్టారెంట్‌గా మార్చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Viral Video: ఫ్లైటా.. ఫ్యామిలీ రెస్టారెంటా.. సమోసాలు లాగిస్తూ తెగ ఎంజాయ్ చేసిన ఫ్యామిలీ..
Viral Video: సాధారణంగా విమాన ప్రయాణంలో శాండ్‌విచ్ లాంటి స్నాక్స్ తీసుకుంటారు. ఒక భారతీయ కుటుంబం మాత్రం ఇండిగో విమానాన్ని ఏకంగా మినీ ఫ్యామిలీ రెస్టారెంట్‌గా మార్చేసింది. గాల్లో ప్రయాణిస్తుండగా ఇంట్లోంచి తెచ్చుకున్న సమోసాలు, ధోక్లాలు, థేప్లాలు, నమ్కీన్ వంటి రకరకాల వంటకాలను డిస్పోజబుల్ ప్లేట్లలో వడ్డించుకుని బంధువులంతా కలిసి ఓ పండుగ భోజనంలా లాగించేశారు. ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూ నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ వైరల్ వీడియోలో, ఒక మహిళ విమానం క్యాబిన్‌లో పెద్ద సంఖ్యలో డిస్పోజబుల్ ప్లేట్లు బయటకు తీసి కుటుంబ సభ్యులకు వరుసగా ఆహారం వడ్డించింది. దాదాపు 15 మందికి పైగా ఉన్న ఆ కుటుంబ సభ్యులు సీట్లలో కూర్చుని ఈ వంటకాలను ఎంతో ఇష్టంగా తిన్నారు. కొందరు అమ్మాయిలు భోజనం చేస్తూనే చేతులకు నెయిల్ పాలిష్ (ప్రెస్-ఆన్ నెయిల్స్) వేసుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. భోజనం పూర్తయిన తర్వాత ఆ మహిళ వాడిన ప్లేట్లు, చెత్తను ఒక పెద్ద కవర్‌లో వేసి శుభ్రం చేసింది.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆ కుటుంబం తీసుకున్న జాగ్రత్తలు, తర్వాత శుభ్రం చేసిన విధానాన్ని మెచ్చుకుంటున్నారు. విమానాల్లో ఇంట్లో వండిన ఆహారం తీసుకెళ్లడానికి నిబంధనలు అంగీకరిస్తాయని, ఇందులో ఎలాంటి తప్పు లేదని కొందరు నెటిజన్లు బలంగా వాదిస్తున్నారు. అయితే మెజారిటీ నెటిజన్లు మాత్రం వీరి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
విమానాల్లో ప్రయాణించడానికి రూ. వేలు, రూ. లక్షలు ఖర్చు పెట్టి వచ్చే తోటి ప్రయాణికులకు ఇలాంటి పనులు తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయని పలువురు మండిపడుతున్నారు. భారతీయ వంటకాలకు ఘాటైన వాసన ఉంటుందని, ఏసీ క్యాబిన్‌లో ఆ వాసన గంటల తరబడి ఉండిపోవడం వల్ల పక్క సీట్లలో ఉన్నవారికి తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. రెస్టారెంట్ల మాదిరిగానే విమానాల్లో కూడా బయటి ఆహారాన్ని పూర్తిగా నిషేధించేలా కఠినమైన పాలసీ తీసుకురావాలని ఎయిర్‌లైన్స్ సంస్థలను కొందరు డిమాండ్ చేస్తున్నారు. భోజనం ఇస్తున్న సమయంలో క్యాబిన్ క్రూ సభ్యులు ఈ వ్యవహారాన్ని ఎందుకు అడ్డుకోలేదని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
విమానం గాల్లో ఉండగా ఇలా గుంపులుగా తిరగడం, ప్లేట్లు పంచుకుంటూ హడావిడి చేయడం భద్రతాపరంగా ముప్పు తెస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ స్పేస్‌లో ఎలా వ్యవహరించాలో కనీస సివిక్ సెన్స్ ఉండాలని, ఇలాంటి ప్రవర్తన వల్లే విదేశాల్లో భారతీయులను చిన్నచూపు చూస్తున్నారని ఒక నెటిజన్ ఘాటుగా విమర్శించారు. ఆన్‌లైన్‌లో వస్తున్న విమర్శలపై ప్రయాణికురాలు యశ్వి స్పందిస్తూ.. తాము ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని, కేవలం 20 నిమిషాల్లో భోజనం ముగించి చెత్తను పక్కకు పెట్టేశామని వివరణ ఇచ్చారు. తోటి ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, ఇండిగో సిబ్బంది కూడా తమను ఏమీ అనలేదని ఆమె స్పష్టం చేశారు.




