మార్కులే జీవితం కాదు.. కొడుక్కి 55% మార్కులొస్తే ‘మార్కుషీట్ కేక్’తో పండగ చేసిన తల్లిదండ్రులు!

99 శాతం మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి పెంచే ఈ రోజుల్లో, ముంబయికి చెందిన దంపతులు తమ కొడుక్కి పదో తరగతిలో 55 శాతం మార్కులు వచ్చాయని మార్కుషీట్ ఆకారంలో కేక్ చేయించి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.

Arun Chilukuri
Published on: 28 Jun 2026 3:52 PM IST
viral news
X

మార్కులే జీవితం కాదు.. కొడుక్కి 55% మార్కులొస్తే ‘మార్కుషీట్ కేక్’తో పండగ చేసిన తల్లిదండ్రులు!

పబ్లిక్ పరీక్షల్లో 99 శాతానికి ఏ ఒక్క మార్కు తగ్గినా పిల్లల కంటే ముందు తల్లిదండ్రులు తెగ దిగాలుపడిపోతూ, పిల్లలపై తీవ్ర ఒత్తిడి పెంచేస్తున్న కాలం ఇది. కానీ, రేటింగ్‌ల రేసులో పరిగెత్తే ఈ సమాజానికి ముంబయికి చెందిన ఒక దంపతులు సరికొత్త దిశానిర్దేశం చేశారు. తమ పిల్లాడు పదో తరగతి పరీక్షల్లో కేవలం 55 శాతం మార్కులు తెచ్చుకున్నా.. ఏమాత్రం నిరాశపడకుండా ఇంట్లోనే పెద్ద పండుగ వాతావరణాన్ని సృష్టించారు. అబ్బాయి మార్కుషీట్ ఆకారంలోనే ఒక ప్రత్యేకమైన కేకును తయారుచేయించి మరీ కట్ చేయించారు.

ముంబయికి చెందిన వశీం పటేల్, షబ్నం దంపతుల కుమారుడు మహమ్మద్ జైద్ ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో 500 మార్కులకు గానూ 276 మార్కులు సాధించాడు. అంటే ఇంచుమించు 55 శాతం మార్కులన్నమాట. సమాజంలోని పోటీని చూసి, మొదట ఈ మార్కులను తల్లిదండ్రులకు చూపించడానికి జైద్ ఎంతో భయపడ్డాడు. కానీ, మార్కుల కార్డును చూసిన తల్లిదండ్రులు అతడిని తిట్టకపోగా.. ప్రేమతో హత్తుకున్నారు. "నువ్వు పాసయ్యావు కదా.. మాకు అంతే చాలు" అంటూ ధైర్యం చెప్పారు.

అంతటితో ఆగకుండా, అదే రోజు రాత్రి బంధువులందరికీ తమ ఇంట్లో పార్టీ ఉందని పిలిచారు. జైద్ సాధించిన మార్కుల వివరాలతో కూడిన 'మార్కుషీట్' డిజైన్ కేకును సిద్ధం చేయించి, అందరి సమక్షంలో కట్ చేయించారు. పార్టీకి వచ్చిన బంధువులు, స్నేహితులు కూడా ఆ దంపతుల ఆలోచనా విధానాన్ని మెచ్చుకున్నారు. "పరీక్షల్లో మార్కులే జీవితం కాదు.. చదువుల్లో మొదటి మైలురాయిని విజయవంతంగా దాటావు.. శభాష్" అంటూ జైద్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు.

పిల్లల మానసిక ఆరోగ్యం కంటే మార్కులే ముఖ్యం కాదని, కేవలం పాస్ మార్కులతోనే జీవితం ముగిసిపోదని నిరూపించిన ఈ ముంబయి దంపతుల ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎంతో మంది తల్లిదండ్రులకు ఇది ఒక గొప్ప కనువిప్పు అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story