Viral Story : జపాన్‌లో 18 ఏళ్ల కల చెదిరింది.. భారతీయుడి ఎమోషనల్ స్టోరీ.!

Viral Story : జపాన్‌లో స్థిరపడి, దాదాపు రెండు దశాబ్దాలుగా సొంత వ్యాపారం నడుపుకుంటున్న ఒక భారతీయ రెస్టారెంట్ యజమాని కథ..

G Krishna
Published on: 17 May 2026 12:36 PM IST
Viral
X

Viral

Viral Story : జపాన్‌లో స్థిరపడి, దాదాపు రెండు దశాబ్దాలుగా సొంత వ్యాపారం నడుపుకుంటున్న ఒక భారతీయ రెస్టారెంట్ యజమాని కథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. జపాన్ ప్రభుత్వం విదేశీయుల వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో, ఆయన 'బిజినెస్ మేనేజర్ వీసా' (Business Manager Visa) పొడిగింపు (Renewal) దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీనివల్ల 18 ఏళ్లుగా ఎంతో కష్టపడి నడుపుకుంటున్న రెస్టారెంట్‌ను మూసివేసి, దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జపాన్‌లోని సైతామా ప్రిఫెక్చర్‌లో ఇండియన్ రెస్టారెంట్ నడుపుతున్న మనీష్ కుమార్ అనే వ్యక్తికి ఈ ఘోర అన్యాయం జరిగింది.

తాజాగా టోక్యోలో జరిగిన ఒక నిరసన ర్యాలీలో మనీష్ కుమార్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. "రెండు వారాల క్రితం జపాన్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ (ISA) నన్ను నా స్వదేశానికి (భారత్‌కు) తిరిగి వెళ్లిపోవాలని చెప్పింది. నా పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు. వారికి జపనీస్ భాష మాత్రమే తెలుసు, వారి స్నేహితులంతా జపనీస్ వారే. ఇప్పుడు మమ్మల్ని హఠాత్తుగా ఇండియా వెళ్ళిపొమ్మంటే మేము అక్కడ ఏం చేయాలి? మా భవిష్యత్తు ఏంటి?" అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు.

కొత్త నిబంధనలతో చిన్న వ్యాపారస్తుల విలవిల

జపాన్ ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 2025లో 'బిజినెస్ మేనేజర్ వీసా' వ్యవస్థలో తీసుకువచ్చిన కొన్ని కీలక మార్పుల కారణంగా మనీష్ కుమార్ వంటి ఎంతో మంది చిన్న విదేశీ వ్యాపారస్తులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ వీసా కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య ఏకంగా 96 శాతం పడిపోయింది. గతంలో నెలకు సగటున 1,700 వరకు వచ్చే దరఖాస్తులు, ఇప్పుడు కేవలం 70కి పడిపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నిజమైన వ్యాపారాలు చేయకుండా, కేవలం జపాన్‌లో దీర్ఘకాలిక నివాసం (Residency) ఉండటానికి ఈ వీసాను ఒక సులభమైన మార్గంగా వాడుకుంటున్న వారిని అడ్డుకునేందుకే ఈ కఠిన నిబంధనలు తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటున్న చిన్న సంస్థల యజమానులు బలవుతున్నారని విమర్శకులు మండిపడుతున్నారు.

జపాన్ వీసా రూల్స్‌లో మారిన అంశాలు ఇవే..

గతంలో ఈ వీసా పొందడానికి కనీస మూలధన పెట్టుబడి 5 మిలియన్ యెన్లు (సుమారు రూ. 30 లక్షలు) ఉంటే సరిపోయేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం దీనిని ఏకంగా 30 మిలియన్ యెన్లకు (సుమారు రూ. 2 కోట్లు) పెంచారు. ఇది చిన్న వ్యాపారాలు చేసేవారికి తలకు మించిన భారంగా మారింది. అంతేకాకుండా.. వ్యాపారంలో కనీసం ఒకరు పూర్తి స్థాయి స్థానిక (జపనీస్) కార్మికుడిని ఉద్యోగంలోకి తీసుకోవడం ఇప్పుడు తప్పనిసరి చేశారు. గతంలో పెట్టుబడి ఉంటే సిబ్బందిని నియమించుకోవడం ఆప్షనల్‌గా ఉండేది.దీనితో పాటు. దరఖాస్తుదారుడికి లేదా అక్కడ పనిచేసే పూర్తి స్థాయి ఉద్యోగికి జపనీస్ భాషా నైపుణ్యం (JLPT N2 లెవెల్) ఉండాలని నిబంధన విధించారు.ఇంకా.. విదేశీ దరఖాస్తుదారులకు ఖచ్చితంగా వ్యాపార నిర్వహణలో అనుభవం లేదా దానికి సంబంధించిన అర్హతలు ఉండాలి. ఇదేకాకుండా.. హోమ్ ఆఫీసులను (ఇంటి నుండి నడిపే వ్యాపారాలు) ఇకపై అంగీకరించబోరు. అలాగే బిజినెస్ ప్లాన్‌కు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉండాలి. పన్ను రికార్డులను ఎంతో కఠినంగా పరిశీలిస్తున్నారు.

భవిష్యత్తుపై అభద్రతాభావం

దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జపాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు.. దశాబ్దాలుగా అక్కడే నమ్మకంగా ఉంటూ, స్థానిక ఆర్థిక వ్యవస్థకు పన్నుల రూపంలో సహాయపడుతున్న విదేశీ పారిశ్రామికవేత్తల పొట్ట కొడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనీష్ కుమార్ కేస్ ఇప్పుడు జపాన్‌లోని విదేశీ చిన్న వ్యాపార వర్గాలలో ఎదురవుతున్న అభద్రతాభావానికి ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది. ప్రభుత్వం ఈ నిబంధనలపై పునరాలోచించకపోతే ఎంతో మంది విదేశీయులు తమ వ్యాపారాలను మూసివేసి రోడ్డున పడే ప్రమాదం ఉంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story