Johnson & Johnson: బేబీ పౌడర్ వల్ల క్యాన్సర్ .. రూ. 52,700 కోట్లకు సెటిల్మెంట్‌కు ఓకే
Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ వల్ల క్యాన్సర్ వస్తోందన్న ఆరోపణల కేసుల్లో బిగ్ అప్‌డేట్.
Johnson & Johnson: బేబీ పౌడర్ వల్ల క్యాన్సర్ .. రూ. 52,700 కోట్లకు సెటిల్మెంట్‌కు ఓకే
Baby Powder: ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ఇంటా పరిచయమున్న పేరు.. హెల్త్‌కేర్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ . అయితే, గత దశాబ్ద కాలంగా ఆ కంపెనీ తయారు చేసే బేబీ పౌడర్, టాల్కమ్ పౌడర్ ఉత్పత్తులపై తీవ్ర వ్యతిరేకత, వరుస వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చట్టపరమైన పోరాటానికి ముగింపు పలికేందుకు కంపెనీ ఏకంగా రూ. 52,700 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది.
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన టాల్కమ్ పౌడర్లను వాడటం వల్ల మహిళల్లో అండాశయ క్యాన్సర్ వస్తోందంటూ అమెరికా వ్యాప్తంగా కోర్టుల్లో వేలాది కేసులు నమోదయ్యాయి.పౌడర్లలో క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రమాదకరమైన ఆస్బెస్టాస్ పదార్థం కలిసి ఉందనేది పిటిషనర్ల వాదన. అమెరికా అంతటా దాదాపు 76 వేలకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి.
ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ నష్టపరిహారం కేసులను పరిష్కరించేందుకు కంపెనీ ముందుకొచ్చింది. అయితే, ఇందులో ఒక కీలక షరతు ఉంది. నమోదైన కేసుల్లో కనీసం 95% మంది పిటిషనర్లు ఈ సెటిల్మెంట్ ప్రతిపాదనకు అంగీకరిస్తేనే కంపెనీ ఈ రూ. 52,700 కోట్లను పంపిణీ చేస్తుంది. ఒకవేళ వారు అంగీకరించకపోతే, కోర్టులోనే తిరిగి సుదీర్ఘ న్యాయపోరాటం ఎదుర్కోవాల్సి వస్తుంది. కోర్టు సమ్మతి లభిస్తే, నష్టపరిహారాన్ని రెండు విడతల్లో చెల్లించేందుకు కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది.అంత భారీ మొత్తం చెల్లించడానికి సిద్ధపడినప్పటికీ, కంపెనీ మాత్రం తమ ఉత్పత్తుల్లో ఎటువంటి లోపం లేదని గట్టిగా వాదిస్తోంది.
మా టాల్కమ్ ఆధారిత పౌడర్లు, ఉత్పత్తులు పూర్తిగా సురక్షితమైనవి. అందులో క్యాన్సర్ కారక ఆస్బెస్టాస్ లేదు. ఈ కేసులో న్యాయపరంగా మేమే గెలుస్తామనే నమ్మకం మాకుంది. కానీ, ప్రతీ ఏటా ఈ కోర్టు విచారణలు, రక రకాల వివాదాలకే ఎక్కువ సమయం, డబ్బు వృథా అవుతోంది. దీనివల్ల కంపెనీ ఇతర ప్రధాన వ్యాపార లక్ష్యాలపై దృష్టి పెట్టలేకపోతున్నాం. అందుకే ఈ వివాదానికి శాశ్వతంగా స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే ఈ సెటిల్మెంట్‌కు అంగీకరించామని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
వివాదాలు ముదిరిన నేపథ్యంలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ముందస్తు జాగ్రత్తగా కొన్ని కీలక మార్పులు చేసింది.అమెరికా , కెనడా మార్కెట్లలో టాల్కమ్ ఆధారిత పౌడర్ల విక్రయాలను నిలిపివేసింది.టాల్కమ్ స్థానంలో మొక్కజొన్న పిండి ఆధారిత సురక్షితమైన బేబీ పౌడర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా నమ్మకమైన బ్రాండ్‌గా వెలుగొందిన ఓ దిగ్గజ సంస్థ, ఈ కోర్టు వివాదాల వల్ల భారీ ఆర్థిక భారాన్ని మోయడమే కాకుండా బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు వ్యాపార సామ్రాజ్యంలో హాట్ టాపిక్‌గా మారింది.




