Inspiring Success Story : కాకినాడ కుర్రాడి కోటి రూపాయల విజయం.!
Inspiring Success Story : కష్టపడే తత్వం, కలలు కనే ధైర్యం, దానికి తల్లిదండ్రుల నిరంతర త్యాగం తోడైతే సాధించలేనిదేమీ లేదని నిరూపించాడు కాకినాడకు చెందిన అఖిలేష్.
Akhilesh success story
Inspiring Success Story : కష్టపడే తత్వం, కలలు కనే ధైర్యం, దానికి తల్లిదండ్రుల నిరంతర త్యాగం తోడైతే సాధించలేనిదేమీ లేదని నిరూపించాడు కాకినాడకు చెందిన అఖిలేష్. వినికిడి, సంభాషణ లోపం ఉన్న ఒక సాధారణ దర్జీ కుమారుడైన ఈ యువకుడు, ఏకంగా కెనడాకు చెందిన ప్రముఖ AI కంపెనీలో ఏటా రూ. 1.06 కోట్ల సాలరీ ప్యాకేజీ (CTC) సాధించి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు.
రెక్కల కష్టంతో చదివించిన తల్లిదండ్రులు
కాకినాడ జిల్లా కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన గంగాధర్ రావు, మాలతి దంపతుల జీవితం చాలా సాదాసీదా. తండ్రి గంగాధర్ రావుకు మాటలు రావు, వినికిడి శక్తి కూడా లేదు. అయినా సరే, కుట్టుమిషన్ నమ్ముకుని కుటుంబాన్ని పోషించాడు. ఆయనకు తోడుగా భార్య మాలతి కూడా బట్టలపై ఎంబ్రాయిడరీ, చేతిపనులు చేస్తూ సంసారాన్ని ఈదేవారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, తమ ఇద్దరు పిల్లల చదువు విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆ కష్టానికి, త్యాగానికి ఈ రోజు అఖిలేష్ సాధించిన విజయమే ఒక అద్భుతమైన ప్రతిఫలం.
డేటా సైన్స్ నుంచి గ్లోబల్ AI ఇంజనీర్‌గా..
అఖిలేష్ ప్రాథమిక విద్యను కొత్తపల్లిలో, ఆ తర్వాత ఒక ప్రైవేట్ పాఠశాలలో పూర్తి చేశాడు. అనంతరం సూరపాలెంలోని ఆదిత్య విశ్వవిద్యాలయం నుంచి 'డేటా సైన్స్' విభాగంలో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నాడు. కాలేజీ రోజుల నుంచే కోడింగ్, సాంకేతిక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిన అఖిలేష్, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో తన ప్రతిభతో మెరిసాడు. కెనడాకు చెందిన 'క్వాంట్‌రైజ్ టెక్ AI' (QuantRise Tech AI) కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్‌గా ఎంపికై, రూ. 1.06 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అతను ఇంటి నుంచే (Work From Home) ఈ కంపెనీ కోసం పనిచేస్తుండటం విశేషం.
ఆదిత్య యూనివర్సిటీలో మరో సంచలనం!
ఈ డ్రీమ్ ఆఫర్ కేవలం అఖిలేష్‌కే కాకుండా, అదే ఆదిత్య విశ్వవిద్యాలయానికి చెందిన రాజేష్ అనే మరో విద్యార్థికి కూడా దక్కింది. అతను కూడా అదే కంపెనీలో రూ. 1.06 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు కోడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడం వల్లే తమ విద్యార్థులు ఈ స్థాయి అవకాశాలను అందుకోగలిగారని యూనివర్సిటీ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.
కలల సాధనకు పేదరికం అడ్డంకి కాదు
అఖిలేష్ సాధించిన ఈ ఘనత ఎంతోమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత ఆశను, స్ఫూర్తిని నింపుతోంది. పుట్టిన ఊరు, కుటుంబ నేపథ్యం ఎలాంటిదైనా.. సరైన మార్గదర్శకత్వం, పట్టుదల ఉంటే ప్రపంచ స్థాయి ఎత్తులకు ఎదగొచ్చని ఈ ఉదంతం నిరూపించింది. ప్రస్తుతం అఖిలేష్ విజయంపై అతని కుటుంబ సభ్యులు, కుతుకుడుమిల్లి గ్రామస్తులు, ఉపాధ్యాయులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు.




