Keerthana Sampath : తమిళనాడులో తెలుగు ప్రచారం.. విజయ్ నమ్మిన కీర్తనా సంపత్ ఎవరు..!

Keerthana Sampath : తమిళనాడు పాలిటిక్స్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది.. అదే తమిళగ వెట్రి కళగం (TVK). దళపతి విజయ్ నేతృత్వంలోని ఈ పార్టీ

G Krishna
Updated on: 6 May 2026 1:38 PM IST
Keerthana-Sampath
X

Keerthana-Sampath

Keerthana Sampath : తమిళనాడు పాలిటిక్స్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది.. అదే తమిళగ వెట్రి కళగం (TVK). దళపతి విజయ్ నేతృత్వంలోని ఈ పార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే.. కోట్లు ఖర్చు చేసే రాజకీయ నేతలను కాదని, ఆటో స్టాండ్ నుంచి సామాన్యులను, మాజీ డ్రైవర్ల తనయులను విజయ్ అసెంబ్లీకి పంపించడం. ఆ సామాన్యుల లిస్టులో ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యారు 29 ఏళ్ల కీర్తనా సంపత్. ఆమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఎవరైనా సరే 'ఔనా' అని నోరెళ్ల బెట్టాల్సిందే.

డేటా అనలిస్ట్ నుంచి పీకే టీం వరకు

విరుద్ నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి అనే సామాన్య గ్రామంలో పుట్టిన కీర్తన, చదువులో ఎప్పుడూ టాప్. పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసి, డేటా అనలిస్ట్‌గా తన కెరీర్ స్టార్ట్ చేశారు. ఆమె టాలెంట్ చూసి దేశంలోనే నంబర్ వన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ (I-PAC) బృందం ఆమెను తమ టీంలోకి తీసుకుంది. అక్కడ గోవా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తెరవెనుక ఉండి కీలకమైన వ్యూహరచన చేశారు. అంతేకాకుండా, 2021 తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే గెలుపు కోసం కూడా పొలిటికల్ వ్యూహకర్తగా పనిచేసి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ సోషల్ మీడియా విభాగానికి టీం లీడ్‌గా బాధ్యతలు చేపట్టి, సోషల్ మీడియా పవర్ ఏంటో నిరూపించారు. ఈ క్రమంలోనే ఆమెకు తెలుగు భాషపై మంచి పట్టు దొరికింది.




సొంత జిల్లాపై మమకారం..

దేశవ్యాప్తంగా ఎందరో నేతల గెలుపు కోసం వ్యూహాలు రచించిన కీర్తనకు, తన సొంత జిల్లాలోని ప్రజలు పడుతున్న కష్టాలు చూసి మనసు చలించింది. ముఖ్యంగా బాణాసంచా పరిశ్రమకు కేంద్రమైన శివకాశిలో తరచూ జరిగే అగ్ని ప్రమాదాలు, కార్మికుల మరణాలు, సరైన రోడ్లు , తాగునీరు లేకపోవడం వంటి సమస్యలు ఆమెను కలచివేసాయి. ఉన్నత చదువులు చదివిన యువత కూడా ఉద్యోగాలు లేక టాక్సీ డ్రైవర్లుగా మిగిలిపోవడం చూసి, ఎలాగైనా మార్పు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. దీంతో పొలిటికల్ కన్సల్టెంట్‌గా ఉన్న లగ్జరీ లైఫ్‌కు గుడ్ బై చెప్పి, తన సొంతూరు వచ్చేసి ప్రజల కోసం పనిచేయడం స్టార్ట్ చేశారు.

సోషల్ మీడియానే మెయిన్ వెపన్

పాతాళానికి పడిపోయిన వ్యవస్థను బాగుచేయడమే లక్ష్యంగా అడుగులు వేసిన కీర్తన, సోషల్ మీడియాను తన ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. టీడీపీలో సోషల్ మీడియా లీడ్‌గా చేసిన ఎక్స్‌పీరియన్స్‌తో, ఇంటర్నెట్ వేదికగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి జెట్ స్పీడుతో దూసుకుపోయారు. ప్రజలతో మమేకం అవుతూ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వైద్యంపై అవగాహన కల్పించడం వంటి పనులతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె నిబద్ధత గురించి తెలుసుకున్న విజయ్, కీర్తనను పార్టీలోకి ఆహ్వానించి ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందు శివకాశి టికెట్ కేటాయించారు.

శివకాశిలో ఆకట్టుకున్న తెలుగు స్పీచ్

ఎన్నికల ప్రచారంలో కీర్తన తనదైన శైలిలో దూసుకుపోయారు. శివకాశి నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో, వారిని ఆకట్టుకోవడానికి ఆమె తన తెలుగు భాషా ప్రావీణ్యాన్ని వాడారు. తెలుగులో ప్రసంగించి అక్కడి ప్రజలను విశేషంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇతర రాజకీయ పార్టీల కంటే వినూత్నంగా ఎన్నికల కాంపైన్ నిర్వహించి, భారీ మెజారిటీతో గెలుపొంది ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, కేవలం ప్రజలపై ఉన్న మమకారంతో 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచిన కీర్తనా సంపత్ ప్రయాణం ఇప్పుడు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story