Surendranath College : ఇది కాలేజీనా.. లేక కలర్‌ఫుల్ రిసార్టా.? కాలేజీ రూమ్‌లో నోట్లకట్టలు, కండోమ్‌లు.. ఇంకా..!

Surendranath College : విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దుకునే పవిత్ర దేవాలయాలుగా పిలవబడే విద్యాసంస్థల్లో.. ఎంతటి ‘ఉన్నతమైన’ పనులు జరుగుతున్నాయో..

G Krishna
Published on: 3 Jun 2026 12:53 PM IST
Surendranath-College
X

Surendranath-College

Surendranath College : విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దుకునే పవిత్ర దేవాలయాలుగా పిలవబడే విద్యాసంస్థల్లో.. ఎంతటి ‘ఉన్నతమైన’ పనులు జరుగుతున్నాయో చెప్పడానికి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న ప్రముఖ సురేంద్రనాథ్ కాలేజ్ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. దాదాపు ఏడాది కాలంగా తాళం వేసి ఉన్న స్టూడెంట్స్ యూనియన్ రూమ్‌ను క్లీన్ చేద్దామని తెరిచిన కాలేజీ యాజమాన్యానికి, అక్కడ ఎదురైన దృశ్యాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. సాధారణంగా కాలేజీ రూముల్లో పుస్తకాలు, చాక్ పీసులు, డస్టర్లు దొరుకుతాయి. కానీ, ఇక్కడ మాత్రం సాక్షాత్తూ లక్ష్మీదేవి కొలువై ఉంది.. కాకపోతే ఆ లక్ష్మీదేవికి కొద్దిగా ‘చెదలు’ పట్టాయంతే..

రూముల్లో దొరికిన ‘విద్యా సామాగ్రి’!

బీజేపీ ప్రభుత్వం ఆదేశించిన నిధుల ఆడిటింగ్‌లో భాగంగా ఈ యూనియన్ రూమ్‌ను తెరిచారు. లోపల పాత చెక్క అల్మారాలో రెండు పెద్ద పెట్టెలు కనిపించాయి. తెరిచి చూస్తే.. వంద, ఐదు వందల నోట్ల కట్టలు.. మొత్తం లెక్కగడితే అక్షరాలా ఒక కోటి రూపాయలు. అయితే, ఆ డబ్బును ‘పాపం’ చాలా కాలంగా అక్కడ దాచిపెట్టడం వల్ల, విద్యార్థుల కంటే ముందే చెద పురుగులు ఆ నోట్లను బాగా ‘చదివేసి’ నమిలేశాయి.

ఇక అక్కడితో ఆగకుండా కాలేజీ క్యాంపస్‌ను కాస్త లోతుగా పరిశీలిస్తే, టెక్స్ట్‌బుక్కులను మించిన మరికొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. కాలేజీ లోపల అటాచ్‌డ్ బాత్‌రూమ్‌లు, ఖరీదైన పరుపులు, దిండ్లతో కూడిన రెండు లగ్జరీ ఏసీ బెడ్‌రూమ్‌లు వెలిశాయి. గత తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం వీటిని ‘టెర్రస్ ఫెసిలిటీస్’ పేరుతో ప్రారంభించిందట. ఇకపోతే.. కాలేజీ బిల్డింగ్ రూఫ్‌టాప్‌పై ఖాళీ లిక్కర్ బాటిళ్లు, స్టూడెంట్స్ కామన్ రూమ్‌లో కండోమ్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. విద్యార్థుల ‘సర్వతోముఖాభివృద్ధికి’ ఇవి ఎంతగానో తోడ్పడతాయేమో మరి.. ఇక వీటన్నింటికీ మకుటాయమానంగా ఒక నల్లటి ప్యాకెట్‌లో చుట్టి ఉంచిన అసలైన రివాల్వర్ కూడా యూనియన్ రూమ్‌లో దొరికింది. చదువుతో పాటు ‘రక్షణ’ కూడా ముఖ్యం కదా..

నేతల ‘సేవలో’ కాలేజీ సిబ్బంది..

ఈ లగ్జరీ ఏసీ రూములను టీఎంసీకి చెందిన బలమైన నేత దేబాశిష్ బంద్యోపాధ్యాయ (కన్‌కటా దేబు), ఆయన కుమారుడు శిబాశిష్‌లు తమ సొంత రిసార్ట్‌లా వాడుకునేవారని కాలేజీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే.. కాలేజీ ఉద్యోగుల చేత ఈ నేతలకు సదరు రూముల్లో ‘మసాజ్’లు కూడా చేయించేవారట. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట నేతలకు మసాజ్ సేవలు అందించడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే.. అయితే ఈ ఆరోపణలను సదరు నేత కొట్టిపారేశారు.

అడ్మిషన్ల పేరుతో భారీ దోపిడీ..?

ఈ కోటి రూపాయల క్యాష్ వెనుక పెద్ద కథే ఉందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కాలేజీలో సీటు కావాలంటే విద్యార్థుల నుంచి రూ.20,000 నుండి రూ.50,000 వరకు వసూలు చేసేవారని, ఆ అడ్మిషన్ల రాకెట్ ద్వారా వచ్చిన నల్లధనమే ఆ పెట్టెల్లో ఉందని ఆరోపిస్తున్నారు. సాధారణంగా స్టూడెంట్స్ నుంచి వసూలు చేసే రూ.50 లేదా రూ.100 యూనియన్ ఫీజుతో కోట్లలో ఫండ్స్ ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులను పక్కనపెట్టి, పైసలు ఉన్నవారికే సీట్లు ఇస్తూ యూనియన్ రూమ్‌ను ఒక ‘ప్రైవేట్ వ్యాపార సంస్థ’ లాగా నడిపించారనే విమర్శలు వస్తున్నాయి.

ఇది కేవలం ‘ట్రైలర్’ మాత్రమే..

స్వాతంత్య్ర సమరయోధులను, గొప్ప రచయితలను అందించిన ఇలాంటి చారిత్రాత్మక కాలేజీలో ఈ స్థాయి ‘రాజకీయ సంస్కృతి’ వెల్లివిరియడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ఇది కేవలం ఒక కాలేజీలో బయటపడిన ‘గోరంత’ నిజం మాత్రమేనని, బెంగాల్‌లోని చాలా క్యాంపస్‌లలో ఇలాంటి ‘కొండంత’ వింతలు ఇంకా దాగి ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అన్ని కాలేజీల ఫండ్స్‌పై ఆడిటింగ్‌కు ఆదేశించడంతో, రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఏసీ బెడ్‌రూమ్‌లు, మరెంత చెదలు పట్టిన క్యాష్ బయటపడుతుందో చూడాలి..

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story