Viral News : రక్తపు మడుగులో కుటుంబం.. ఫోన్‌లో రీల్స్ చూస్తూ భార్య..

Viral News : కర్ణాటకలోని ధార్వాడ్‌లో గుండెలవిసే దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో 45 ఏళ్ల వైద్యుడు డాక్టర్ కిరణ్ హొనన్నవర్ దారుణ హత్యకు..

G Krishna
Published on: 16 July 2026 10:41 AM IST
lady doctor kills husband
X

lady doctor kills husband 

Viral News : కర్ణాటకలోని ధార్వాడ్‌లో గుండెలవిసే దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో 45 ఏళ్ల వైద్యుడు డాక్టర్ కిరణ్ హొనన్నవర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన భార్య, వృత్తిరీత్యా వైద్యురాలైన ప్రియాంకనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేవలం భర్తను చంపడమే కాకుండా, తన ఎనిమిదేళ్ల కుమారుడిని కూడా ఆమె కత్తితో పొడిచింది. తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. అక్కడ కనిపించిన భయానక దృశ్యాలు చూసి షాక్‌కు గురయ్యారు. ఇల్లంతా రక్తసిక్తంగా మారి, భర్త, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉంటే.. నిందితురాలు ప్రియాంక మాత్రం ఏమీ తెలియనట్లు మంచంపై పడుకుని ఫోన్ స్క్రోల్ చేస్తూ కనిపించడం అక్కడి క్రూరత్వానికి అద్దం పడుతోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది.

బాలుడి ప్రాణాలు కాపాడిన పోలీస్ కమిషనర్

హుబ్బళ్ళి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ ఘటనా స్థలానికి చేరుకున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఎనిమిదేళ్ల బాలుడు ఇంకా శ్వాస తీసుకుంటుండటాన్ని ఆయన గమనించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి సకాలంలో ప్రాణాలు కాపాడారు. కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిరాయు ఆసుపత్రిలో అనస్థీటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ కిరణ్ హొనన్నవర్, తన భార్య ప్రియాంక కట్టనహళ్లి (MBBS, MS ఆప్తాల్మాలజీ), కుమారుడితో కలిసి పవన్ హైస్కూల్ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఆరో అంతస్తులో నివసిస్తున్నారు. కిరణ్ కుటుంబ సభ్యులు తరచూ వీరిని కలవడానికి వస్తూ ఉండేవారు.

ఫోన్ కాల్స్‌తో కరకథలు.. బంధువుల ఎంట్రీతో వెలుగులోకి

ఇంత పెద్ద దారుణం జరిగినా నిందితురాలు చాలా చాకచక్యంగా నాటకమాడింది. మంగళవారం రాత్రి, మళ్లీ బుధవారం ఉదయం కిరణ్ బంధువులు, స్నేహితులు ఫోన్ చేసినప్పుడు ప్రియాంకనే లిఫ్ట్ చేసింది. మొదట ఆయన రెస్ట్ తీసుకుంటున్నారని, ఆ తర్వాత డ్యూటీకి బయటకు వెళ్లారని అబద్ధాలు చెప్పింది. అయితే, బుధవారం సాయంత్రం వరకు కూడా కిరణ్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు నేరుగా వారి ఫ్లాట్‌కు వెళ్లారు. లోపలికి వెళ్లి చూడగా కిరణ్ ఒక గదిలో శవమై రక్తపు మడుగులో పడి ఉండటం, బాలుడు గాయాలతో మూలగడం చూసి హతాశయులయ్యారు. ఆ సమయంలో కూడా ప్రియాంక ఫోన్ వాడుకుంటూ కూర్చోవడం వారిని భయభ్రాంతులకు గురిచేసింది.

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ ఘోరం జరిగిన సమయంలో అపార్ట్‌మెంట్‌లో భార్యాభర్తలు, కుమారుడు తప్ప మూడో వ్యక్తి ఎవరూ లేరని పోలీసులు నిర్ధారించారు. బయటి వ్యక్తులు ఎవరూ లోపలికి వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కమిషనర్ శశికుమార్ తెలిపారు. అసలు ఈ దారుణం ఎప్పుడు జరిగింది? దీనికి దారితీసిన కారణాలు ఏంటి? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితురాలు ప్రియాంక ఫోన్ డేటాను, ఆమె ఎవరెవరితో మాట్లాడింది, ఏం చెప్పింది అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి హత్య కేసు నమోదు చేసి, విచారణను ముమ్మరం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story