Viral Video : గ్యాస్ సిలిండర్‌లో మోసం.? వైరల్ వీడియోతో కలకలం..!

Viral Video : సోషల్ మీడియాలో ఒక వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతూ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

G Krishna
Published on: 20 May 2026 10:24 AM IST
Gas-Cylinder
X

Gas-Cylinder

Viral Video : సోషల్ మీడియాలో ఒక వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతూ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. మనం రోజువారీ వంట కోసం వాడే ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ విషయంలో జరిగిన ఒక మోసం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన గ్యాస్ సిలిండర్ల భద్రతపై, అలాగే అనధికారికంగా బయట అమ్మే సిలిండర్ల కొనుగోలుపై ప్రజల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. నమ్మకమైన డీలర్ల దగ్గర కాకుండా బ్లాక్‌లో బట్టలు కొన్నట్లు గ్యాస్ కొంటే ఎంతటి ప్రమాదమో ఈ ఇన్సిడెంట్ నిరూపిస్తోంది.

మీరట్ పరిధిలో వెలుగుచూసిన ఘోరం

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఉన్న లిసారి గేట్ పరిధిలోని తారాపురి ప్రాంతంలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. అక్కడ లోకల్ గా రోడ్డు పక్కన పకోడీ బండి నడుపుకుంటూ జీవించే ఫహీమ్ అనే స్ట్రీట్ వెండర్ ఇంట్లో హఠాత్తుగా వంట గ్యాస్ అయిపోయింది. వ్యాపారం చూసుకోవాలి, ఇంట్లో వంట అర్జంట్‌గా కావాలి అనే కంగారులో అతను నార్మల్ గా వచ్చే అఫీషియల్ గ్యాస్ డీలర్ కోసం వెతకకుండా.. లోకల్ గా బ్లాక్‌లో గ్యాస్ అమ్మే ఒక వ్యక్తిని ఆశ్రయించాడు. అత్యవసర పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆ బ్లాక్ మార్కెట్ కేటుగాడు 14 కేజీల బరువుండే ఎల్‌పీజీ సిలిండర్‌ను ఏకంగా 2,500 రూపాయల భారీ ధరకు ఫహీమ్‌కు అమ్మేశాడు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఇది చాలా ఎక్కువైనప్పటికీ, అవసరం కొద్దీ ఫహీమ్ ఆ డబ్బులు చెల్లించి సిలిండర్ ఇంటికి తెచ్చుకున్నాడు.

పనిచేయని పొయ్యి.. సిలిండర్ తిరగేస్తే ఊహించని ట్విస్ట్..!

ఎంతో కష్టపడి అంత డబ్బులు పెట్టి తెచ్చిన సిలిండర్‌ను ఇంటికి తీసుకురాగానే ఫహీమ్ దానిని వంట స్టవ్‌కు కనెక్ట్ చేశాడు. కానీ ఎంత ట్రై చేసినా పొయ్యి వెలగలేదు. మొదట్లో రెగ్యులేటర్‌లోనో లేదా స్టవ్‌లోనే ఏదో ప్రాబ్లం ఉందేమోనని చుట్టుపక్కల వాళ్ళని పిలిచి రకరకాలుగా చెక్ చేయించాడు. గ్యాస్ ఫ్లో రావడం కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే ఎలాంటి ఫలితం లేకపోవడంతో.. చివరికి వారికి సిలిండర్ మీదనే అనుమానం వచ్చింది. దాంతో అసలు లోపల గ్యాస్ ఉందో లేదో చూడటానికి ఆ సిలిండర్‌ను బోర్లా తిప్పి (తలకిందులుగా చేసి) చూశారు. అంతే.. అందులో నుండి గ్యాస్ రావడానికి బదులు ధారగా నీళ్లు కారడం స్టార్ట్ అయ్యాయి. ఈ సీన్ చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు.

సోషల్ మీడియాలో వైరల్.. పెరిగిన ఆందోళన

ఈ మొత్తం ఉదంతాన్ని అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఆ వీడియోలో సిలిండర్‌ను తిరగేయగానే కిందకు నీళ్లు ఎలా పడుతున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. సదరు సిలిండర్‌లో కేవలం కొద్ది మొత్తంలో మాత్రమే గ్యాస్ నింపి, మిగతా బరువంతా నీళ్లతో మేనేజ్ చేసి ఇలా భారీ మోసానికి పాల్పడ్డారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వైరల్ వీడియో చూశాక దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. గ్యాస్ సిలిండర్లను ఎప్పుడూ కూడా ప్రభుత్వం గుర్తించిన అధికారిక , వెరిఫైడ్ డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని, ఇలాంటి లోకల్ బ్లాక్ సెల్లర్స్ ఇచ్చే సిలిండర్ల వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ప్రాణాలకే ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి సదరు కేటుగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story