Viral News : మహారాష్ట్ర వరదల్లో మానవత్వం.. ఖాకీకి సెల్యూట్ అంటున్న నెటిజన్లు.!
Viral News : మహారాష్ట్రను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల నడుమ ఓ పోలీస్ అధికారి చూపిన మానవత్వం, సాహసం దేశవ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుంది.
Viral News : మహారాష్ట్రను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల నడుమ ఓ పోలీస్ అధికారి చూపిన మానవత్వం, సాహసం దేశవ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుంది. ప్రకృతి ప్రకోపానికి జనం అల్లాడిపోతున్న వేళ, ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహణలో నిలిచిన ఒక ఖాకీ అధికారి నిజమైన ‘హీరో’ అనిపించుకున్నారు. రాయగఢ్ జిల్లాలోని సరసాయ్ ప్రాంతంలో వరద నీటిలో ఒక ప్రభుత్వ బస్సు పూర్తిగా చిక్కుకుపోగా.. అందులోని ప్రయాణికులను రక్షించే క్రమంలో నడుం లోతు నీటిలో నడుస్తూ ఒక పోలీస్ అధికారి 72 ఏళ్ల వృద్ధురాలిని తన భుజాలపై మోసుకుంటూ సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MSRTC) కి చెందిన ఈ బస్సు వరద ఉధృతికి రోడ్డుపైనే నిలిచిపోయింది. ఆ సమయంలో బస్సులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. చుట్టూ నీరు వేగంగా చేరుతుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రసాయని పోలీస్ సిబ్బంది స్థానిక ‘హెల్ప్ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ సహాయంతో అక్కడికి చేరుకుని తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
విధి నిర్వహణలో రాయగఢ్ పోలీసుల అంకితభావం
ఈ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను, ఫోటోలను రాయగఢ్ పోలీసులు తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకున్నారు. "సరసాయ్ వద్ద వరద నీటిలో ఎస్‌టీ బస్సు చిక్కుకుపోయిన వెంటనే రసాయన పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. హెల్ప్ ఫౌండేషన్ సహకారంతో బస్సులోని ఎనిమిది మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఇందులో నడవలేని స్థితిలో ఉన్న 72 ఏళ్ల వృద్ధురాలిని ఒక అధికారి తన భుజాలపై మోసుకుంటూ సురక్షిత ప్రాంతానికి తరలించి, ప్రజల పట్ల, విధి నిర్వహణ పట్ల తమకున్న అంకితభావాన్ని చాటుకున్నారు" అని పోలీసులు రాసుకొచ్చారు. భీకరంగా ప్రవహిస్తున్న వరద నీటిని చీల్చుకుంటూ ఆ వృద్ధురాలిని పోలీస్ అధికారి భుజాలపై మోసుకెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, "ఖాకీ యూనిఫాంలో ఉన్న దేవుడు" అంటూ నెటిజన్లు సదరు అధికారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బస్సులోని మిగిలిన ప్రయాణికులను కూడా లైఫ్ జాకెట్ల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మహారాష్ట్రను వణికిస్తున్న ముంబై వర్షాలు.. స్తంభించిన జనజీవనం
గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా ముంబై, పూణే, రాయగఢ్ , దాని చుట్టుపక్కల జిల్లాలు పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తుండటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రైల్వే ట్రాక్‌లపైకి, రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాయగఢ్, ముంబై పరిసర ప్రాంతాలకు వాతావరణ శాఖ 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు ముంబై , ప్రభావిత జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
रसायनी पोलिसांची तत्पर कारवाई..!
— रायगड पोलीस-Raigad Police (@RaigadPolice) July 5, 2026
सारसई येथे पुराच्या पाण्यात अडकलेल्या एसटी बसमधील ८ प्रवाशांची रसायनी पोलिसांनी हेल्प फाउंडेशनच्या सहकार्याने सुखरूप सुटका केली. ७२ वर्षीय ज्येष्ठ महिलेलाही सुरक्षित बाहेर काढत पोलिसांनी कर्तव्यदक्षतेचा आदर्श घालून दिला.#RaigadPolice #FloodRescue pic.twitter.com/MbmIiSdxuJ




