Viral News: కాటేసిన పాముపై మనిషి ప్రతీకారం.. తల కొరికేసి ఆస్పత్రికి నడక!
Viral News: నన్ను కాటేస్తావా అంటూ ఓ వ్యక్తి కోపంతో ఏకంగా పాము తలనే కొరికేశాడు.
Viral News: కాటేసిన పాముపై మనిషి ప్రతీకారం.. తల కొరికేసి ఆస్పత్రికి నడక!
Viral News: సాధారణంగా పాములు మనుషులపై పగ తీర్చుకుంటాయని సినిమాల్లోనో, కథల్లోనో వింటూ ఉంటాం. కానీ, తనను కాటేసిందనే కోపంతో ఒక మనిషి ఏకంగా పాముపైనే పగతీర్చుకుని, దాని తల కొరికేసిన వింత ప్రతీకార సంఘటన పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపింది. అంతటితో ఆగకుండా సదరు వ్యక్తి ఆ పామును అలాగే చేత్తో పట్టుకుని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్లడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా, మోతాబారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఫరూఖ్ అనే యువకుడు తన ఇంటి సమీపంలో పని చేసుకుంటుండగా ఒక విషసర్పం అతడిని కాటేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి, షాక్‌కు గురైన ఫరూఖ్.. క్షణాల్లో ఆ పామును పట్టుకుని, 'నన్నే కరుస్తావా' అన్నట్లు దాన్ని గట్టిగా కొరికి, తలను నమిలేసినట్లు సమాచారం.
పామును కొరికిన తర్వాత, ఫరూఖ్ దాన్ని వదిలిపెట్టకుండా అలాగే చేత్తో పట్టుకుని చికిత్స కోసం ఆస్పత్రికి బయలుదేరాడు. అయితే ఆస్పత్రి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. దారిలో వెళ్తున్న వాహనదారులను అతను లిఫ్ట్ అడిగినప్పటికీ.. అతడి చేతిలో విలవిల్లాడుతున్న పామును చూసి భయపడి ఎవరూ అతనికి వాహనం ఎక్కించుకోలేదు. దీంతో చేసేదేం లేక ఫరూఖ్ ఆ సుదీర్ఘ దూరాన్ని నడుచుకుంటూనే ఆస్పత్రికి చేరుకున్నాడు.
ఆస్పత్రికి చేరుకున్న ఫరూఖ్ చేతిలో పామును చూసి అక్కడి రోగులు, వైద్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు. "ఈ పాము నన్ను కాటేసింది.. అందుకే నేను కూడా దీని తల కొరికేశా" అని అతను వైద్యులకు చెప్పడంతో వారు అవాక్కయ్యారు.
వైద్యులు వెంటనే అతనికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. ఫరూఖ్ శరీరంలోకి పాము విషం ఎక్కడంతో పాటు, పామును కొరకడం వల్ల అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, నిపుణులైన వైద్యుల బృందం అతనికి అత్యవసర చికిత్స అందిస్తోందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించారు.




