Viral News : 2118వ సంవత్సరానికి వెళ్లి వచ్చా.. భవిష్యత్తు ఫోటోను బయటపెట్టిన వృద్ధుడు!
Viral News : తాను 2118వ సంవత్సరానికి కాల ప్రయాణం చేశానని అలెక్సాండర్ స్మిత్ అనే వృద్ధుడు క్లెయిమ్ చేశారు. ఇందుకు సాక్ష్యంగా భవిష్యత్తు నగరానికి సంబంధించిన ఒక ఫోటోను ఆయన బయటపెట్టారు.
Time Travel
Viral News : సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా, కొన్ని మిస్టరీలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సవాలుగానే మిగిలిపోయాయి. అందులో ప్రధానమైనది టైమ్ ట్రావెల్ (కాల ప్రయాణం). భవిష్యత్తులోకి వెళ్లడం లేదా గతంలోకి వెనక్కి వెళ్లడం అనేది కేవలం సినిమాలకే పరిమితం అనుకుంటాం. కానీ, ఒక వృద్ధుడు తాను నిజంగానే కాల ప్రయాణం చేశానని, 2118వ సంవత్సరం నాటి భవిష్యత్తు ప్రపంచాన్ని కళ్లారా చూశానని సంచలన ప్రకటన చేశారు. అలెక్సాండర్ స్మిత్ అనే ఈ వ్యక్తి మాటలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. తాను ప్రపంచంలోనే మొదటి టైమ్ ట్రావెలర్లలో ఒకడినని ఆయన గట్టిగా వాదిస్తున్నారు.
అలెక్సాండర్ స్మిత్ చెప్పే దాని ప్రకారం.. 1981లో అమెరికా నిఘా సంస్థ సీఐఏ(CIA) నిర్వహించిన ఒక అత్యంత రహస్య మిషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఆ మిషన్ ద్వారా ఆయనను భవిష్యత్తులోకి అంటే 2118వ సంవత్సరానికి పంపారట. అక్కడి వింత ప్రపంచాన్ని చూసి మళ్లీ వెనక్కి వచ్చానని ఆయన చెబుతున్నారు. ఈ రహస్యాలను బయటపెడితే తన ప్రాణాలకు ముప్పు ఉందని, సీఐఏ తన కోసం గాలిస్తోందని అందుకే తాను అజ్ఞాతంలో బతుకుతున్నానని ఒక వీడియోలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మాటలతోనే కాకుండా, తన వాదనను నిరూపించుకోవడానికి ఆయన భవిష్యత్తు కాలానికి సంబంధించిన ఒక ఫోటోను కూడా సాక్ష్యంగా చూపించారు.
ఆయన చూపించిన ఫోటో కాస్త మసకగా ఉన్నప్పటికీ, అందులో వింతైన ఆకృతులతో కూడిన భారీ భవనాలు, పచ్చదనంతో నిండిన వింత నిర్మాణాలు కనిపిస్తున్నాయి. టైమ్ ట్రావెల్ ప్రక్రియలో కలిగే ఒత్తిడి వల్ల ఫోటో క్వాలిటీ తగ్గిందని, అసలు ఫోటోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఆయన తెలిపారు. అయితే వారు తీసుకోకముందే ఒక కాపీని భద్రపరుచుకున్నానని స్మిత్ వెల్లడించారు. భవిష్యత్తు నగరం బయట ఉన్నప్పుడు తాను ఈ ఫోటో తీశానని, ఆ దృశ్యాన్ని తన జీవితంలో ఎన్నడూ మర్చిపోలేనని ఆయన చెప్పుకొచ్చారు.
మరి భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుందో కూడా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. 21వ శతాబ్దం మధ్యలో అంటే 2050 ప్రాంతంలో ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) మొదటిసారి భూమిని సందర్శిస్తారట. మనుషులు కొత్త రకం భాషలను మాట్లాడుతారని, వాతావరణ మార్పుల వల్ల భూమిపై పరిస్థితులు చాలా దారుణంగా పడిపోతాయని ఆయన హెచ్చరించారు. ఈ ఫోటోను ప్రపంచానికి చూపించడానికి సరైన సమయం కోసం ఇన్నాళ్లూ ఎదురుచూశానని స్మిత్ తెలిపారు. ఈయన మాటల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, టైమ్ ట్రావెల్ గురించి చర్చించే వారికి మాత్రం ఇదొక హాట్ టాపిక్‌గా మారింది.




